హుజూరాబాద్‌లో ఈటల గెలుపు ఖాయం

ప్రధానాంశాలు

హుజూరాబాద్‌లో ఈటల గెలుపు ఖాయం

మంత్రి హరీశ్‌రావు చెప్పేవన్నీ అబద్ధాలే
ప్రచార సభల్లో బండి సంజయ్‌

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌:  తెరాస ఎన్ని కుట్రలు చేసినా.. మాయమాటలతో ఓటర్లను మభ్యపెట్టాలని చూసినా హుజూరాబాద్‌లో తమ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపు ఖాయమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గురువారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని 8 గ్రామాల్లో ఆయన రోడ్‌షోలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ కోసం పేదలే బలిదానాలు చేశారని.. వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించిన వాళ్లు మాత్రం నేడు రాజ్యమేలుతూ ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. భాజపా ఆస్తులను అమ్ముతోందని అసత్య ప్రచారాల్ని చేస్తున్నారని.. వాస్తవానికి రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వమే భూముల్ని అమ్ముతున్న సంగతిని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. హుజూరాబాద్‌ ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు అన్నీ అబద్ధాలే చెబుతున్నారంటూ ఆయన మాటల్ని ఇక్కడి ప్రజలు నమ్మరన్నారు. ఏ ఎన్నికలొచ్చినా కేసీఆర్‌ దొడ్డిదారిన గెలిపించాలని చూస్తారని, ఫోర్జరీ లేఖల్ని సృష్టిస్తారని ఆరోపించారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో తెరాసకు ఓటర్లు కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. యువత భాజపా పక్షాన నిలబడ్డారని ఇక్కడ ఈటల గెలుపుతో చరిత్రను సృష్టిస్తారని సంజయ్‌  ధీమా వ్యక్తం చేశారు.

బీసీలపై కేసీఆర్‌ది కపట ప్రే మ:లక్ష్మణ్‌
ఈనాడు, దిల్లీ: రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. రాష్ట్రంలో 54 శాతం బీసీలు ఉన్నట్లు సమగ్ర కుటుంబ సర్వేలో తేలినప్పటికీ ఆ గణాంకాలు బయటపెట్టలేదని, ఇప్పుడు కులాల వారీ గణన చేపట్టాలంటున్నారని ఆక్షేపించారు. ఇప్పటికైనా బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏడేళ్ల పాలనలో తెరాస  బీసీలకు మేలు కన్నా కీడే ఎక్కువ చేసిందని ఆరోపించారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించారని, కేసీఆర్‌ వాటిని తగ్గించారని మండిపడ్డారు. బీసీల సంక్షేమం, అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రతి గడపకూ తీసుకుపోతామన్నారు. ఇందులో భాగంగా ఓబీసీ వర్గాలకు చెందిన విశ్రాంత సివిల్‌ సర్వీస్‌ అధికారులు, న్యాయాధికారులు, విద్యావంతులతో తొలి మేధావుల సమావేశాన్ని శుక్రవారం దిల్లీలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తర్వాత దేశవాప్తంగా నిర్వహిస్తామన్నారు. ఒక రాష్ట్రంలో బీసీలుగా ఉన్న వారు మరో రాష్ట్రంలో ఎస్సీ, వేరే రాష్ట్రంలో ఓసీలుగా ఉండటం కుల గణనకు సాంకేతికంగా ప్రతిబంధకంగా మారిందన్నారు. అందుకే కేంద్రం ఓబీసీల్లో కులాల గణన అధికారాన్ని రాష్ట్రాలకు కట్టబెట్టిందని గుర్తుచేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని