కంగారూలకు అప్పుడే షాకిచ్చాడు.. 

తాజా వార్తలు

Published : 30/12/2020 01:53 IST

కంగారూలకు అప్పుడే షాకిచ్చాడు.. 

ధోనీ తర్వాత ఆ రికార్డు రహానెదే..

టీమ్‌ఇండియా తాత్కాలిక సారథి అజింక్య రహానె టెస్టుల్లో తనదైన నాయకత్వంతో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు అతడు భారత్‌కు మూడు మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ వహించగా అన్నింటిలోనూ విజయాలే సాధించాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా నేనున్నానంటూ ఆదుకున్నాడు. అడిలైడ్‌ టెస్టు ఘోర పరాభవం తర్వాత కోహ్లీ, షమిలాంటి కీలక ఆటగాళ్లు లేకున్నా మెల్‌బోర్న్‌లో భారత్‌ను విజేతగా నిలబెట్టాడు. ఈ గెలుపుతో మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ తర్వాత టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో కెప్టెన్సీ వహించిన తొలి మూడు మ్యాచ్‌లను గెలిపించిన సారథిగా నిలిచాడు. ఈ నేపథ్యంలో రహానె గతంలో ఏయే టెస్టులకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు.. ఆయా మ్యాచ్‌ల్లో ఎలా ఆడాడనే విషయాలను తెలుసుకుందాం.

కంగారూలకు అప్పుడే షాకిచ్చాడు..
2017లో ఆస్ట్రేలియా భారత పర్యటన సందర్భంగా 4 టెస్టుల సిరీస్‌ జరిగింది. తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టు భారీ విజయం సాధించగా రెండో టెస్టులో కెప్టెన్‌ కోహ్లీ సారథ్యంలో టీమ్‌ఇండియా గెలుపొందింది. ఇక మూడో మ్యాచ్‌ డ్రాగా ముగీయడంతో నాలుగో టెస్టు నిర్ణయాత్మకంగా మారింది. ఇలాంటి కీలకమైన మ్యాచ్‌లోనే రహానె తొలిసారి కెప్టెన్సీ చేపట్టడమే కాకుండా భారత్‌ను విజేతగా నిలబెట్టాడు. తన నాయకత్వంతో కంగారూలకు అప్పుడే షాకిచ్చాడు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలుత 300 పరుగులు చేయగా, టీమ్‌ఇండియా 332 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 137 పరుగులకే ఆలౌటవ్వడంతో భారత్‌ 106 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి. దీంతో రహానె నేతృత్వంలో టీమ్‌ఇండియా ఆ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 46కే రెండు వికెట్లు పడగా.. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(51)తో కలిసి రహానె(38) జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేశాడు.

అఫ్గాన్‌పై బ్యాట్‌ ఝుళిపించలేకపోయినా..

ఇక రెండోసారి రహానె కెప్టెన్సీ చేపట్టింది 2018లో అఫ్గానిస్థాన్‌పై. ఆ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో భారత్‌ విజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్‌ చేసి 474 పరుగులు చేసింది. విజయ్‌(105), ధావన్‌ (107) శతకాలతో రాణించారు. తర్వాత కెప్టెన్‌గా వచ్చిన రహానె పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 10 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. కానీ అఫ్గాన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా రహానె కెప్టెన్‌గా అదరగొట్టాడు. ఫీల్డింగ్‌లో మార్పులు, బౌలర్లకు కావాల్సిన స్వేచ్ఛ ఇచ్చి అఫ్గాన్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 109 పరుగులకే ఆలౌటవ్వగా రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులే చేసింది. దీంతో భారత్‌ ఇన్నింగ్స్‌ 262 పరుగులతో ఘన విజయం సాధించింది.

క్లిష్ట పరిస్థితుల్లో శభాష్‌ అనిపించుకున్నాడు..
ఇక ప్రస్తుత సిరీస్‌లో టీమ్‌ఇండియా తొలి టెస్టులో ఘోర పరాభవం పాలవ్వగా.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పితృత్వపు సెలవుల మీద, పేసర్‌ మహ్మద్‌ షమి గాయంతో మిగతా సిరీస్‌కు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఇక భారత్‌ పని అయిపోయిందని ఆశలు వదులుకున్నారు. అయితే, అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ రహానె అదరగొట్టాడు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో వ్యూహాలు, ఫీల్డింగ్‌లో మార్పులతో అందర్నీ ఆకట్టుకున్నాడు. దీంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 195, రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు ఆలౌటైంది. ఇక భారత బ్యాటింగ్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్‌ ఆకట్టుకోకపోయినా రహానె(112) నిలిచాడు. శతకంతో కదం తొక్కి ప్రత్యర్థిపై 131 పరుగుల ఆధిక్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియాను మరోసారి ఆదుకున్నాడు. గిల్‌(35)తో కలిసి రహానె(27) జట్టును గెలిపించాడు. అలా ఈ బాక్సింగ్‌ డే టెస్టులో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికవ్వడమే కాకుండా అరుదైన జానీ ముల్లగ్‌ అవార్డు గెలుచుకున్నాడు. 

-ఇంటర్నెట్‌డెస్క్‌

ఇవీ చదవండి..

ఈ విజయం మధుర జ్ఞాపకం..
ఒక రేంజ్‌ క్రికెటర్లు బాబూ..!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని