
తాజా వార్తలు
బుమ్రా ఇలా అయ్యాడేంటి?
2020లో విఫలమైన పేసు గుర్రం..
అతడు ప్రపంచంలోనే మేటి పేసర్. పవర్‌ప్లే, డెత్‌ఓవర్ల స్పెషలిస్టు. తనవైన యార్కర్లతో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించగల సిద్ధహస్తుడు. క్లిష్ట పరిస్థితుల్లో నేనున్నానంటూ ఆదుకునే పేసు గుర్రం. టీమ్ఇండియా బౌలింగ్‌లో అతి గొప్ప పేరు సంపాదించిన ఫాస్ట్ బౌలర్. ఇవన్నీ కలగలిపితే వచ్చే పేరే జస్ప్రీత్బుమ్రా. ప్రస్తుత తరంలో నంబర్ వన్ బౌలర్‌గా పేరున్న అతడు ఈ ఏడాదిని మరీ ఘోరంగా ముగించాడు. 2020లో ఆడిన వన్డే క్రికెట్లో నిరాశపర్చాడు.
9 మ్యాచ్‌ల్లో 5 వికెట్లే..
బుమ్రా ఈ ఏడాది మొత్తం ఆడింది 9 వన్డేలు. అందులో తీసింది 5 వికెట్లే. మరో మాటలో చెప్పాలంటే ఇన్ని మ్యాచ్‌ల్లో కొత్త బంతితో ఒక్క పవర్‌ప్లేలోనూ వికెట్ తీయలేకపోయాడు. నమ్మశక్యంగా లేకున్నా ఇదే నిజం. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా.. భారత పర్యటన సందర్భంగా మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క వికెట్ మాత్రమే తీసిన అతడు తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో మూడు వన్డేల్లో పూర్తిగా విఫలమయ్యాడు. లాక్డౌన్ తర్వాత ఐపీఎల్లో మెరిసినా ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో 4 వికెట్లు పడగొట్టాడు. తొలి రెండు వన్డేల్లో ఒక్కొక్క వికెట్ తీయగా మూడో మ్యాచ్‌లో రెండు వికెట్లతో మెరిశాడు. దీంతో ఈ ఏడాది మొత్తం 5 వికెట్లే తీయడం గమనార్హం. 2016లో తొలిసారి టీమ్ఇండియాకు ఎంపికైన బుమ్రా ఈ నాలుగేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ప్రదర్శన చేయలేదు. 9 మ్యాచుల్లో మొత్తం 85.4 ఓవర్లు బౌలింగ్ చేసి 5 వికెట్లే పడగొట్టాడు. 5.62 ఎకానమితో ఎక్కువ పరుగులు ఇవ్వకపోయినా.. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టలేక ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి పెంచలేకపోయాడు.
గాయమే ప్రభావమా?
బుమ్రా ఈ ఏడాది ఆరంభంలో విఫలమవ్వడానికీ ఓ కారణం ఉంది. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత అతడు వెన్నెముక గాయంతో ఇబ్బంది పడ్డాడు. దానికి లండన్‌లో శస్త్రచికిత్స తీసుకొని కొద్దికాలం ఆటకు దూరమయ్యాడు. మళ్లీ జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొంది ఫిట్నెస్ సాధించడంతో 2020 జనవరిలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. కోలుకున్నాక అదే తొలి సిరీస్ కావడంతో లయ అందుకోలేకపోయాడు. ఆపై న్యూజిలాండ్ పర్యటనలో పేలవమైన ప్రదర్శన చేశాడు. కానీ, అక్కడి పరిస్థితులు టీమ్ఇండియా పేసర్లకు ఎప్పుడూ ప్రతికూలమే. దాంతో బుమ్రాను ప్రత్యేకంగా విమర్శించడానికి ఆస్కారం లేదు. కరోనా పరిస్థితుల కారణంతో అనుకోకుండా లభించిన లాక్డౌన్ సమయాన్ని ఈ పేసుగుర్రం చక్కగా వినియోగించుకున్నాడు. తగినంత విశ్రాంతి దొరకడంతో ఐపీఎల్‌కు మంచి ప్రణాళికతో సన్నద్ధమయ్యాడు. అలా టీ20 మెగా లీగ్‌లో అద్భుతం చేశాడు. 15 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండోస్థానంలో నిలిచాడు. ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సిడ్నీలో ఎందుకు విఫలం?
బుమ్రా ఐపీఎల్లో చక్కటి ప్రదర్శనతో మునుపటి ఫామ్ అందుకున్నట్లు కనిపించినా ఆస్ట్రేలియాతో ఆడిన తొలి రెండు వన్డేల్లో మరోసారి విఫలయ్యాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆ రెండు మ్యాచ్‌ల్లో అతడు 73, 79 పరుగులిచ్చి ఒక్కొక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఇక మూడో వన్డేలో 43 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. అయితే, సిడ్నీ మైదానం బ్యాటింగ్ పిచ్. అక్కడ భారత బౌలర్లు పెద్దగా రాణించే అవకాశం లేకపోవడంతో బుమ్రా తొలి రెండు వన్డేల్లో రాణించలేదు. ఇప్పుడు కాన్బెరాలో చెలరేగి ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు. ఇలా మొత్తంగా చూస్తే బుమ్రా 2020ని పవర్‌ప్లేలో వికెట్ లేకుండానే పూర్తి చేసి చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రేపటి నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్, ఆపై జరిగే టెస్టు సిరీస్‌లో అతడెలా రాణిస్తాడో వేచి చూడాలి.
-ఇంటర్నెట్‌డెస్క్
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్ చిరస్మరణీయ విజయం..
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- భారత్ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- ఆసీస్ పొగరుకు, గర్వానికి ఓటమిది
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
