close

తాజా వార్తలు

Updated : 21/10/2020 16:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జోరు కొనసాగించనీ..!

నేడు బెంగళూరుతో కోల్‌కతా ఢీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 క్రికెట్‌ లీగ్‌లో భాగంగా 39వ మ్యాచ్‌కు అబుదాబి వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా, బెంగళూరు తలపడనున్నాయి. ఇప్పటి వరకూ రెండు జట్లు చేరో తొమ్మిది మ్యాచ్‌లాడాయి. అందులో ఆరు విజయాలతో బెంగళూరు ఒకడుగు ముందు ఉండగా.. కోల్‌కతా ఐదు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. ఈ రోజు రాత్రి 7.30గంటలకు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది. గత మ్యాచుల్లో సాధించిన విజయాలతో రెండు జట్లూ మంచి జోరులో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్‌ రేసులో ముందడుగు వేయాలని రెండు జట్లు పట్టుదలతో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలను తెలుసుకుందాం..

రికార్డులేమంటున్నాయి..
ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 25 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో 14 విజయాలతో కోల్‌కతా పైచేయి సాధించింది. బెంగళూరు 11 మ్యాచుల్లో గెలిచింది. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో మాత్రం కోల్‌కతాను బెంగళూరు 82 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ రెండు జట్లూ ఆడిన గత ఐదు మ్యాచుల్లో మూడింట్లో గెలిచి, రెండింట్లో ఓడాయి. 

అతడ్ని ఎలా ఎదుర్కొంటారో..?
ప్రస్తుత బెంగళూరు జట్టు మునుపెన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. అన్ని విభాగాల్లోనూ మెరిపిస్తోంది. బ్యాటింగ్‌లో యువసంచలనం దేవదత్‌ పడిక్కల్‌ నిలకడగా రాణిస్తున్నాడు. ఆరోన్‌ ఫించ్‌, డివిలియర్స్‌, కోహ్లీతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్ఠంగా ఉంది. ఆఖర్లో శివం దూబె మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇన్నాళ్లు బౌలింగ్‌లో సమస్యలు ఎదుర్కొన్న కోహ్లీసేనకు మోరిస్‌ రాకతో కష్టాలు తీరాయి. అయితే.. బ్యాటింగ్‌లో ఫించ్‌ తన మార్క్‌ బ్యాటింగ్‌ చేయలేదనే చెప్పాలి. బౌలింగ్‌లో మోరిస్‌కు అండగా ఇతర బౌలర్లు నిలిస్తే బెంగళూరుకు తిరుగుండదు. కోల్‌కతా ఫాస్ట్‌ బౌలర్‌ ఫెర్గూసన్‌ను బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ ఎలా ఎదుర్కొంటారన్నదే కీలకం. గత మ్యాచ్‌లో అతని ప్రదర్శన మనందరం చూశాం. అతను మంచి దూకుడు మీదున్నాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా అస్త్రం అతనే అనడంలో సందేహం లేదు. కాబట్టి.. బెంగళూరు ఫెర్గూసన్‌పై ఓ కన్నేయాల్సిందే. లేకపోతే ఇబ్బందులు తప్పవు. 

కోల్‌కతా శ్రమించాల్సిందే..
పాయింట్ల పట్టికలో ప్రత్యర్థి కంటే దిగువన ఉన్న కోల్‌కతా ఈ మ్యాచ్‌లో గెలవాలంటే శ్రమించాల్సిందే. బ్యాటింగ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ ఎప్పుడు ఎవరు రాణిస్తారో.. ఎవరు విఫలమవుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. నిలకడైన ప్రదర్శన ఆ జట్టులో కనిపించడం లేదు. శుభ్‌మన్‌ గిల్‌ ఫర్వాలేదనిపిస్తున్నా.. అతని స్ట్రైక్‌రేట్‌ తక్కువగా ఉంటోంది. లీగ్‌లో అత్యంత కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో కోల్‌కతా ఆల్‌రౌండర్‌ రసెల్‌.. జూలు విదిల్చి బ్యాటింగ్‌ చేయాలి. దినేశ్‌ కార్తిక్‌, కెప్టెన్ మోర్గాన్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ కమిన్స్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేసినప్పటికీ వికెట్లు తీయలేకపోతున్నాడు. కమిన్స్‌ వికెట్లు పడగొడుతూ ఫెర్గూసన్‌కు తోడుగా నిలిస్తే కోల్‌కతా విజయం పెద్ద కష్టమేం కాదు. 

ఈ మైదానం.. 
* ఈ మైదానంలో తొమ్మిది మ్యాచ్‌లాడిన కోల్‌కతా ఐదింట్లో గెలిచి నాలుగు మ్యాచుల్లో ఓడింది. ఇక్కడ రెండు మ్యాచ్‌లాడిన బెంగళూరు రెండింట్లోనూ గెలిచింది. 
* పిచ్‌ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది. చెన్నై, రాజస్థాన్‌ మ్యాచ్‌ను బట్టి.. ఈ మైదానంలో ఛేదనకు దిగిన జట్టు చెమటోడ్చాల్సిందేనని అర్థం అవుతోంది.

జట్లు (అంచనా)
బెంగళూరు: దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్, గురుకీరత్‌సింగ్‌ మన్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, షహబాద్ అహ్మద్, ఇసురు ఉదాన, నవదీప్ సైనీ, చాహల్‌.
కోల్‌కతా: శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా, మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తిక్, రసెల్, ఫెర్గూసన్‌, కమిన్స్, శివం మావి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.