
తాజా వార్తలు
ముంబయి: ఆస్ట్రేలియా ప్రస్తుత సారథి టిమ్‌పైన్‌ను తక్కువ చేయడం లేదని మాజీ సారథి స్టీవ్‌స్మిత్ అన్నాడు. అతడిని తాను అగౌరవపరచలేదని పేర్కొన్నాడు. పైన్‌ను స్మిత్ తక్కువ అంచనా వేయడం చూశానన్న ఆసీస్ మాజీ సారథి ఇయాన్ ఛాపెల్ వ్యాఖ్యలపై అతడు స్పందించాడు. ‘నేనెప్పుడు టిమ్‌కు సాధ్యమైనంత సాయపడేందుకు ప్రయత్నిస్తుంటాను. అతడు అద్భుతంగా తన పని చేస్తున్నాడు. కానీ నేను అతడికి సలహాలు మాత్రమే ఇస్తాను. అంతే. జట్టు బాగా ఆడాలని కోరుకుంటాను. నేను టిమ్‌ను తక్కువ చేయడం లేదు’ అని స్మిత్ స్పష్టం చేశాడు.
అడిలైడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఆటలో భాగంగా సోమవారం పైన్‌కు చెప్పి స్మిత్ ఫీల్డర్ల చోట్లను మార్చాడు. ఇది ఇయాన్ ఛాపెల్‌కు నచ్చలేదు. ‘నేనేది చూడటానికి ఇష్టపడనో మీకు చెబుతా. మైదానంలో కొందరు ఫీల్డర్లను స్టీవ్‌స్మిత్‌ను మార్చడం చూశా. టిమ్‌పైన్‌తో మాట్లాడి వారిని ఆఫ్‌సైడ్ మార్చేందుకు ప్రయత్నించాడు. స్మిత్ కోరిక మేరకే పైన్ వారిని మార్చాడో లేదో తెలియదు. స్మిత్ అలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు’ అని ఛాపెల్ అన్నాడు.