
తాజా వార్తలు
ఇంగ్లాండ్ ఆటగాళ్లకు మూడు రోజులే అవకాశం
ఇంటర్నెట్‌డెస్క్: మరో పది రోజుల్లో టీమ్ఇండియాతో తలపడనున్న తొలి టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లకు మూడు రోజుల ట్రైనింగ్ సెషన్ లభించనుంది. శ్రీలంకతో టెస్టు సిరీస్ పూర్తయ్యాక ఆ జట్టు బుధవారం చెన్నై చేరుకోనుంది. ఫిబ్రవరి 5 నుంచి భారత్‌తో తొలి టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలోనే లంక నుంచి వచ్చే ఇంగ్లాండ్ ఆటగాళ్లు కచ్చితంగా ఆరు రోజులు క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దాంతో తొలి టెస్టుకు ముందు ఆ జట్టుకు మూడు రోజులే ట్రైనింగ్ సెషన్ లభించనుంది. ఇక లంకతో టెస్టు సిరీస్ ఆడని బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరీ బర్న్స్ ఆదివారమే భారత్‌కు చేరుకున్నారు. ఈ ముగ్గురూ ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. దాంతో వీరికి ఐదు రోజుల పాటు ప్రాక్టీస్ చేసుకునే వీలు కలిగింది.
కాగా, టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే ఆటగాళ్లందరికీ ఆరు రోజుల వ్యవధిలో మూడుసార్లు కరోనా పరీక్షలు చేయనున్నారు. చెన్నైలో రెండు టెస్టులు పూర్తయ్యాక అహ్మదాబాద్‌లో ఇంకో రెండు టెస్టులు నిర్వహిస్తారు. అయితే, ఈ వేసవిలో బీసీసీఐ భారత్‌లోనే ఐపీఎల్ 14వ సీజన్‌ను నిర్వహించాలని చూస్తోంది. దాంతో ఇంగ్లాండ్‌తో మూడు సిరీస్‌లు నిర్వహించడం కీలకంగా మారింది. ఒకవేళ ఏ ఆటంకాలూ లేకుండా ఇవి విజయవంతమైతే.. ఏప్రిల్, మేలో ఐపీఎల్ ఇక్కడే జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఈ టెస్టు సిరీస్ భారత్‌కు కూడా చాలా ముఖ్యమైందనే చెప్పాలి. ఇప్పటికే బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో టీమ్ఇండియా ఆస్ట్రేలియాపై విజయం సాధించి టెస్టు ఛాంపియన్షిప్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌ను కూడా అలాగే ఓడిస్తే ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే వీలుంది.
ఇవీ చదవండి..
ఒకే ఆటగాడు. ఒకే బంతి.. రెండుసార్లు రనౌట్
కుంబ్లేను ఎదుర్కోడానికి ద్రవిడ్ సాయం: తైబు