విజయాలు కాదు.. సర్దుబాట్లు చేసుకోవాలి: కేన్‌

తాజా వార్తలు

Published : 03/05/2021 01:12 IST

విజయాలు కాదు.. సర్దుబాట్లు చేసుకోవాలి: కేన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా పలు సర్దుబాట్లు చేసుకొని జట్టును బలంగా తీర్చిదిద్దుకోవాలని కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 55 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దాంతో ఈ సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే విజయం సాధించి మిగతా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే విలియమ్సన్‌ మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ ఈ విధంగా స్పందించాడు.

‘ఇదో కష్టతరమైన రోజు. రాజస్థాన్‌ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది జోస్‌ బట్లర్‌ రోజు కూడా. అతడు అత్యద్భుతంగా ఆడాడు. విజయం సాధించాలంటే బ్యాట్‌తో బాగా ఆడాలి. అయితే, వికెట్లు పడేకొద్దీ 220 లక్ష్యాన్ని చేరుకోవాలంటే కష్టంగా ఉంటుంది. గత మూడు వారాలుగా మా జట్టు అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఇక ఈరోజు మ్యాచ్‌లో సంజూ, బట్లర్‌ కీలకంగా ఆడారు. దాంతో వారికి రషీద్‌ చేత బౌలింగ్‌ చేయించాలని భావించాం. ఇప్పుడు మేం కొన్ని సర్దుబాట్లు చేసుకొని జట్టును తీర్చిదిద్దుకోవాలి. ఓటములను అంగీకరించి ముందుకు సాగాలి’ అని విలియమ్సన్‌ చెప్పుకొచ్చాడు.

రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ బాగా ఆడారని, వాళ్లకి హ్యాట్సాఫ్‌ చెప్పాలని సన్‌రైజర్స్‌ సారథి అన్నాడు. విజయాల కోసం ఎక్కువ ఆలోచించకుండా సర్దుబాట్లు చేసుకొని జట్టును మరింత బలంగా నిర్మించుకోవాలని చెప్పాడు. ముందుకు ఎలా సాగాలనే విషయంపై స్పష్టత ఉండాలన్నాడు. ఇక చివరగా మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌పై స్పందిస్తూ.. అతడో ప్రపంచశ్రేణి ఆటగాడని మెచ్చుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 220/3 భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(124; 64 బంతుల్లో 11x4, 8x6) శతకంతో చెలరేగాడు. అనంతరం ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లకు 165/8 స్కోరుకు పరిమితమైంది. దాంతో విలియమ్సన్‌ టీమ్‌ 55 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని