Pat Cummins: దాతృత్వంలోనూ ‘స్టార్’‌!

తాజా వార్తలు

Updated : 29/04/2021 13:00 IST

Pat Cummins: దాతృత్వంలోనూ ‘స్టార్’‌!

భారతీయుల ప్రేమకు పాత్రుడైన పాట్‌ కమిన్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత గురువారం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటుతో విరుచుకుపడ్డ కోల్‌కతా నైట్‌ రైడర్స్ స్టార్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌ క్రికెట్ అభిమానులకు నిజమైన వినోదాన్ని పంచాడు. ఓటమి ఖాయమని ఫిక్సయిన కోల్‌కతా అభిమానుల్లో తన సిక్సర్ల మోతతో ఆశలు నింపాడు. చివరకు తన మెరుపులు వృథా అయినప్పటికీ.. అతను ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ మాత్రం క్రికెట్‌ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే, కమిన్స్‌ బ్యాటుతోనే కాదు.. తన దాతృత్వంతోనూ  భారతీయుల ప్రేమకు పాత్రుడయ్యాడు. కోట్ల మంది భారతీయుల చూపిస్తున్న ప్రేమకు బదులుగా ఏదైనా తిరిగివ్వకపోతే లావైపోతాననుకున్నాడేమో ఏమో? ఆక్సిజన్‌ కొరతతో సతమతమవుతున్న భారత్‌కు సాయం ప్రకటించాడు. పీఎం కేర్స్‌కు 50వేల డాలర్లు విరాళంగా ఇచ్చాడు. ఆక్సిజన్‌ కొనుగోలుకు వినియోగించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ సందర్భంగా కమిన్స్ పంచుకున్న సందేశం ప్రతిఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. ఆ సందేశం అతని మాటల్లోనే...

‘‘భారత్‌.. ఏళ్లుగా నేను ప్రేమిస్తూ వస్తున్న దేశం. నేను ఇప్పటి వరకూ చూసిన వాళ్లలో అత్యంత దయ, మంచి మనసు కలిగినవారు ఇక్కడి ప్రజలు. అలాంటి వారు ఇప్పుడు బాధలో ఉన్నారని తెలియడం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది’’ అంటూ భారత్‌పై ఉన్న తన ప్రేమను చాటుకున్నాడు కమిన్స్‌. 

‘‘కరోనా విజృంభిస్తున్న సమయంలో ఐపీఎల్‌ ఆడడం సముచితమా అన్న విషయంపై ఇక్కడ కొంత చర్చ జరుగుతోంది. అయితే, లాక్‌డౌన్‌, ఆంక్షల మధ్య క్లిష్టమైన సమయం గడుపుతున్న ప్రజలకు ఐపీఎల్‌ కొంతమేర విశ్రాంతినిస్తుందన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్లు నాకు తెలిసింది’’ అంటూ ఐపీఎల్‌ నిర్వహణ ఎంత వరకు సమంజసమన్న దానిపై జరుగుతున్న చర్చను ప్రస్తావించారు.

‘‘ఓ మంచి పనితో లక్షల మందిని చేరుకునేందుకు ఆటగాళ్లుగా మాకున్న వేదిక ఓ గొప్ప అవకాశం. అది దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఆస్పత్రులకు కావాల్సిన ఆక్సిజన్‌ సామగ్రిని కొనుగోలు చేయడానికి  పీఎం కేర్స్‌కు నా వంతు సాయంగా 50 వేల డాలర్లు అందిస్తున్నాను. ఐపీఎల్‌లో నాతోటి సహచరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతీయుల దాతృత్వంతో ముగ్ధులైనవారెవరైనా సాయం చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాను’’ అని కమిన్స్ పిలుపునిచ్చాడు.  

భారతీయుల కష్టాన్ని చూసి ఉబికి వస్తున్న ఉద్వేగానికి సాయం చేయడం ద్వారా కార్యరూపం ఇచ్చే అవకాశం ఉందని కమిన్స్‌ పిలుపునిచ్చాడు. తద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉందన్నాడు. తాను చేసిన సాయం పెద్దదేమీ కానప్పటికీ.. ఎవరో ఒకరి జీవితంలో మార్పు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

పాట్‌ కమిన్స్‌ ట్వీట్‌ ఇదే...


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని