T20 World Cup: హార్దిక్‌ పాండ్య గాయం చిన్నదే.. కివీస్‌ మ్యాచ్‌కు అందుబాటులోనే!

తాజా వార్తలు

Updated : 16/11/2021 15:33 IST

T20 World Cup: హార్దిక్‌ పాండ్య గాయం చిన్నదే.. కివీస్‌ మ్యాచ్‌కు అందుబాటులోనే!

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య భుజానికి అయిన గాయం చిన్నదేనని, ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా పీటీఐకు తెలిపారు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గత ఆదివారం పాకిస్థాన్‌తో తలపడిన సందర్భంగా హార్దిక్‌ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో బరిలోకి దిగిన అతడు భుజం నొప్పి కారణంగా భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఈ క్రమంలోనే (8) పరుగులు చేసి విఫలమయ్యాడు. 

అనంతరం పాండ్య రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌ చేయకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యాడు. అతడి స్థానంలో ఇషాన్‌ కిషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా సేవలందించాడు. అయితే, వైద్య నివేదికల్లో అతడి గాయం చిన్నదిగా తేలిందని, తర్వాతి మ్యాచ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం మిగిలి ఉండటంతో అప్పటివరకూ కోలుకుంటాడని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు ఆ అధికారి వివరించారు. జట్టు ఫిజియోలు హార్దిక్‌ను నిరంతరం పర్యవేక్షిస్తుంటారన్నారు. కాగా, ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ వెన్నునొప్పి కారణంగా ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున బౌలింగ్‌ చేయని సంగతి తెలిసిందే. అలాగే పాకిస్థాన్‌ మ్యాచ్‌లోనూ బౌలింగ్‌ చేయలేదు. అయితే, పాండ్య ఈ టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ముందు నాకౌట్‌ దశలో బౌలింగ్‌ చేస్తానని చెప్పాడు. అలాగే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సైతం తొలి మ్యాచ్‌ సందర్భంగా అతడిపై నమ్మకం ఉంచాడు. త్వరలోనే పాండ్య బౌలింగ్‌ చేస్తాడని చెప్పాడు. మరోవైపు న్యూజిలాండ్‌తో పోరు టీమ్‌ఇండియాకు కీలకంకానుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తేనే కోహ్లీసేన సెమీస్‌ చేరడానికి వీలుంటుంది. అక్కడ ఓడితే నాకౌట్‌ దశకు చేరడం కష్టమయ్యే ప్రమాదం పొంచి ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని