వామ్మో..! వీళ్లకు ఎందుకింత ధర?
close

తాజా వార్తలు

Updated : 18/02/2021 20:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వామ్మో..! వీళ్లకు ఎందుకింత ధర?

ఏ జట్టుకు ఎవరు ఎలా ఉపయోగపడతారంటే..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో సంచలనాలు నమోదయ్యాయి. యువరాజ్‌ సింగ్‌ అత్యధిక ధర రికార్డును క్రిస్‌ మోరిస్‌ బద్దలు కొట్టాడు. కైల్‌ జేమిసన్‌, రిలె మెరిడిత్‌, షారుక్ ఖాన్‌ వంటి కుర్రాళ్లు కోట్ల రూపాయాలు పలికారు. దేశవాళీ ఆల్‌రౌండర్‌ కృష్ణప్ప గౌతమ్‌ భారీ మొత్తం సొంతం చేసుకున్నాడు. మరి ఆయా జట్లు వీళ్లను ఎందుకింత ధర పెట్టి కొనుగోలు చేశాయో తెలుసా!


మోరిస్‌తో సమతూకం

దక్షిణాఫ్రికా పేస్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ను కొనుగోలు చేసేందుకు ఈ సారి ఫ్రాంచైజీలు ఎక్కువ ఆసక్తి ప్రదర్శించాయి. రూ.75 లక్షల కనీస ధరలో ఉన్న అతడి కోసం దిల్లీ, ముంబయి, పంజాబ్‌, రాయల్స్‌ పోటీపడ్డాయి. చివరికి రాజస్థాన్‌ రూ.16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. సమయోచితంగా వికెట్లు తీయడమే కాకుండా భారీ సిక్సర్లు బాదగలగడం మోరిస్‌ ప్రత్యేకత. అతడు జట్టుకు అత్యంత సమతూకం తీసుకొస్తాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 77 మ్యాచులు ఆడిన మోరిస్‌ 551 పరుగులు చేశాడు. 79 వికెట్లు పడగొట్టాడు. గతేడాది 9 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. గతేడాది రూ.10 కోట్లు వెచ్చించిన బెంగళూరు ఈసారి తక్కువ ధరకు అతడిని దక్కించుకోవాలని ప్రయత్నించి భంగపడింది!


మాక్సీ విధ్వంసం

ఆసీస్‌ విధ్వంసకర వీరుడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ భారీ ధర పలుకుతాడని అందరూ ఊహించిందే. టీమ్‌ఇండియాతో జరిగిన టీ20, వన్డే సిరీసులో అతడు విధ్వంసకరంగా ఆడాడు. ఎన్నో ఏళ్లుగా బెంగళూరు బ్యాటింగ్ భారాన్ని విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ మోస్తున్నారు. కుదిరినప్పుడల్లా వీరే మ్యాచులను ముగిస్తుంటారు. వీరు త్వరగా ఔటైతే మిడిలార్డర్‌లో ఆదుకొనేందుకు ఒక్కరు సరైనా ఆటగాడు లేరు. దాంతో మిడిలార్డర్‌ను మంచి హిట్టర్‌తో బలపేతం చేయాలని కోహ్లీసేన భావించింది. ఈ ఉద్దేశంతోనే మాక్సీని రూ.14.25 కోట్లు పెట్టి దక్కించుకుంది. అతడు గనక జట్టులో స్థిరపడి, తన పాత్రపై స్పష్టతతో ఉన్నాడంటే బెంగళూరుకు పండగే.


రిచర్డ్‌సన్‌తో వికెట్లు

ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ఆసీస్‌ యువపేసర్‌ జే రిచర్డ్‌సన్‌కు వేలంలో మంచి ధర లభిస్తుందని భావించారు. అందుకు తగ్గట్టే పంజాబ్‌ కింగ్స్‌ అతడిని రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గతేడాది పంజాబ్‌కు సరైన విదేశీ పేసర్లు లేని ఇబ్బంది తెలిసొచ్చింది. క్రిస్‌ జోర్డాన్‌ లయ అందుకొనే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే రిచర్డ్‌సన్‌ను భారీ మొత్తానికి దక్కించుకుంది. ఇప్పటి వరకు 62 టీ20లు ఆడిన అతడు 7.84 ఎకానమీతో 78 వికెట్లు పడగొట్టాడు. ఆరంభ, ముగింపు ఓవర్లలో వికెట్లు తీయగలడు. బిగ్‌బాష్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌ తరఫున అతడీ పని చేశాడు. ప్రస్తుతం 29 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్నాడు.


కృష్ణప్ప ది ఆల్‌రౌండర్‌‌

టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేయకుండానే ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కర్ణాటక స్పిన్నర్‌ కృష్ణప్ప గౌతమ్‌ రికార్డు సృష్టించాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌ అతడిని రూ.9.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇందుకు ధోనీసేన వద్ద పెద్ద కారణమే ఉంది. చెపాక్‌ మందకొడి, స్పిన్‌ పిచ్‌ కావడంతో స్పిన్నర్లు కీలకం అవుతారు. ఇక ఇమ్రాన్‌ తాహిర్‌ వయసు పెరిగింది. ఫిట్‌నెస్‌ స్థాయి తగ్గింది. సీనియర్లైన హర్భజన్‌సింగ్‌, పియూష్‌ చావ్లాను విడుదల చేశారు. దాంతో వారికి మంచి దేశవాళీ స్పిన్నర్‌ అవసరం ఏర్పడింది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ జట్టుకు వెన్నెముకగా నిలిచే సత్తా కృష్ణప్ప సొంతం. పైగా యువకుడు. ఐపీఎల్‌లో అనుభవం ఉంది. మొత్తంగా టీ20 క్రికెట్లో 62 మ్యాచులు ఆడిన అతడు 41 వికెట్లు తీసి 594 పరుగులు చేశాడు. ఇక ధోనీ ఎవరితోనైనా వందశాతం ప్రభావవంతంగా బౌలింగ్‌ చేయించగలడన్న సంగతి తెలిసిందే. మరో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీని రూ.7 కోట్లకు సొంతం చేసుకోవడానికీ ఇదే కారణం.


మెరిడిత్‌.. వామ్మో

ఆస్ట్రేలియా ఆటగాడు రిలె మెరిడిత్‌ ఐపీఎల్‌ వేలంలో రూ.8కోట్ల ధర దక్కించుకోవడం అనూహ్యం. 24 ఏళ్ల ఈ ఆసీస్‌ పేసర్‌ తన భయంకరమైన పేస్‌తో బిగ్‌బాష్‌ లీగులో ప్రకంపనలు సృష్టించాడు. బ్యాట్స్‌మెన్‌ వికెట్లు ఎగరగొట్టడంలో మేటి. అతడి వేగానికి దాదాపుగా బ్యాటర్లు ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌రూపంలో వెనుదిరుగుతారు. అతడు విసిరే యార్కర్లకు ప్రత్యర్థి నుంచి కొన్నిసార్లు జవాబు ఉండదు. ఆరంభ, మధ్య, ఆఖరి ఓవర్లలో వికెట్లు తీస్తూ జట్టుకు మేలు చేస్తాడు. హోబర్ట్‌ హరికేన్‌ తరఫున ఇప్పటికే బిగ్‌బాష్‌లో 16 వికెట్లు తీశాడు. మహ్మద్‌ షమి, హర్షదీప్‌ సింగ్‌, జేమిసన్‌, జోర్డాన్‌తో పాటు పంజాబ్‌ కింగ్స్‌ బౌలింగ్‌లో అతడు వైవిధ్యం తీసుకురాగలడు. ఇప్పటి వరకు అతడు 34 టీ20ల్లో 8.06 ఎకానమీతో 43 వికెట్లు తీశాడు.


జేమిసన్‌తో వైవిధ్యం

న్యూజిలాండ్‌ పేసర్‌ కైల్‌ జేమిసన్‌ రూ.15 కోట్లు పలకడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పంజాబ్‌ కింగ్స్‌తో పోటీపడి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అతడిని కొనుగోలు చేసింది. పేస్‌, పిచ్‌కు అనుకూలించే పిచ్‌లపై అతడు దుమ్మురేపగలడు. యువకుడు కావడం, బిగ్‌బాష్‌ వంటి లీగుల్లో అదరగొట్టడంతో బెంగళూరు అతడిని తీసుకొంది. ఎన్నో ఏళ్లుగా ఆ జట్టుకు మంచి పేసర్లు లేకపోవడం చేటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 38 టీ20లు ఆడిన జేమిసన్‌ 20.59 సగటు, 7.98 ఎకానమీతో 54 వికెట్లు పడగొట్టాడు. 6/7 అత్యుత్తమ గణాంకాలు. బెంగళూరు బౌలింగ్‌ లోటును అతడు తీర్చగలడు.


షారుఖ్‌ క్రేజీ

తమిళనాడు యువ క్రికెటర్‌ షారుక్‌ ఖాన్‌ అనుకున్నట్టే భారీ ధర పలికాడు. పంజాబ్‌ కింగ్స్‌ అతడిని రూ.5.25 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. అతడి కోసం మిగతా జట్లు పోటీపడటంతో పంజాబ్‌ ఇంత మొత్తం వెచ్చించింది. తమిళనాడు ఈ ఏడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ సొంతం చేసుకుందంటే అది షారుఖ్‌ వల్లే. క్వార్టర్‌ ఫైనల్‌, ఫైనల్లో అతడు చేసిన పరుగులే జట్టును గట్టెక్కించాయి. 13 ఏళ్లకే అతడు టీఎన్‌పీఎల్‌లో అరంగేట్రం చేశాడు. 2014లోనే లిస్ట్‌-ఏ, టీ20లు ఆడాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫస్ట్‌క్లాస్‌కు ఎంపికయ్యాడు. టీ20లకు అవసరమైన బ్యాటింగ్‌ వేగం, కండబలం అతడి సొంతం. కఠిన పరిస్థితుల్లో మ్యాచులను ముగించడం అతడి శైలి. రాజస్థాన్‌, కోల్‌కతా, పంజాబ్‌ నిర్వహించిన ట్రయల్స్‌లోనూ అతడు ప్రతిభ కనబరిచాడు. నికోలస్‌ పూరన్‌తో కలిసి షారుఖ్‌ మ్యాచ్‌ విన్నర్‌గా మారగలడని పంజాబ్‌ అతడిని కొనుగోలు చేసింది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని