
తాజా వార్తలు
మోదీ స్టేడియంలో కోహ్లీ ఆందోళన ఇదే!
(Images: BCCI Twitter)
అహ్మదాబాద్: మొతెరాలోని కుర్చీల రంగు కన్నా విద్యుద్దీపాల వెలుతురే ఆందోళన కలిగిస్తోందని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. పైకప్పుకు అమర్చిన దీపాల వెలుతురులో బంతి స్పష్టంగా కనిపించదని పేర్కొన్నాడు. ఆటగాళ్లు త్వరగా ఇందుకు అలవాటు పడాలని సూచించాడు. ఇంగ్లాండ్‌తో డే/నైట్ టెస్టు టాస్ తర్వాత అతడు మాట్లాడాడు.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతెరా. లక్షాపదివేల మంది ఇందులో మ్యాచ్‌ను వీక్షించొచ్చు. బుధవారం ఆరంభోత్సవం సందర్భంగా మైదానం పేరును సర్దార్ వల్లభాయ్ పటేల్ బదులు నరేంద్రమోదీగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీసీసీఐ కార్యదర్శి జే షా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడి కుర్చీలకు నారింజ రంగు వేయగా మైదానంలో ఫ్లడ్‌లైట్లు లేవు. దుబాయ్ స్టేడియం మాదిరిగా పైకప్పు ముందు అర్ధచంద్రాకారంలో ఎల్ఈడీ దీపాలను అమర్చారు. ఇది ఫీల్డింగ్ జట్టుకు సవాల్‌గా మారుతుందని కోహ్లీ ఆవేదన చెందుతున్నాడు.
‘అతిపెద్ద మైదానంలో వాతావరణం ఉత్సాహభరితంగా ఉంది. అయితే కుర్చీల రంగు కన్నా ఎల్ఈడీ దీపాల వెలుతురు పట్లే నేను ఆందోళన చెందుతున్నా. ఎందుకంటే ఇలాంటి వెలుతురులో బంతిని గుర్తించడం చాలా కష్టం. మేమిలాంటిదే దుబాయ్ స్టేడియంలో ఆడాం. క్యాచులు అందుకొనే కోణాలు, దేహ దిశ భిన్నంగా ఉండాలి. వీటికి ఆటగాళ్లు త్వరగా అలవాటు పడాలి’ అని కోహ్లీ అన్నాడు.
గతేడాది ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. షార్జా, అబుదాబితో పోలిస్తే దుబాయ్‌లో ఆటగాళ్లు ఎక్కువ క్యాచులు జారవిడిచారు. కోహ్లీ దానినే ఉదహరించాడు. నారింజ రంగులో ఉన్న కుర్చీలు, స్టాండ్లతో మరీ ఇబ్బందేమీ ఉండదని స్పష్టం చేశాడు.