ఆఖరి దెబ్బ అదిరింది..
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 21/03/2021 06:56 IST

ఆఖరి దెబ్బ అదిరింది..

రెచ్చిపోయిన కోహ్లి, రోహిత్‌
భువనేశ్వర్‌ అద్భుత బౌలింగ్‌
చివరి టీ20, సిరీస్‌ భారత్‌వే
మొతేరా

కోహ్లి కొట్టాడు. రోహిత్‌ దంచాడు. సూర్యకుమార్‌, పాండ్య కూడా ఉతికేశారు. కానీ  మ్యాచ్‌లో రియల్‌ హీరో మాత్రం భువనేశ్వరే.
స్కోరు బోర్డుపై 224 పరుగులున్నాయి. ఇంకేం మ్యాచ్‌ మనదే అని ధీమా! కానీ 12 ఓవర్లు తిరిగేసరికి ఇంగ్లాండ్‌ స్కోరు 127. కోల్పోయింది ఒక్కటే వికెట్టే.
మలన్‌, బట్లర్‌ కలిసి దొరికిన బంతిని దొరికినట్లు దంచేస్తున్నారు. ఏ బౌలర్‌నూ లెక్క చేయట్లేదు. ఇద్దరూ క్రీజులో పాతుకుపోయారు. అర్ధశతకాలు పూర్తి చేశారు. వీళ్ల వెనుక బెయిర్‌ స్టో, మోర్గాన్‌, స్టోక్స్‌ లాంటి వీర హిట్టర్లున్నారు. ఈ స్థితిలో 48 బంతుల్లో 98 పరుగులు చేయడం ఇంగ్లాండ్‌కు పెద్ద కష్టమే కాదు!
అప్పుడొచ్చాడు భువనేశ్వర్‌. అలవోకగా ఫోర్లు, సిక్సర్లు బాదేస్తున్న ఇంగ్లిష్‌ జోడీని కట్టి పడేశాడు. వాళ్లను ఒత్తిడిలో పడేశాడు. ఎలాగైనా షాట్‌ ఆడాలని చూశాడు బట్లర్‌. లాంగాన్‌లో పాండ్య చేతిలో పడింది బంతి. అంతే.. ఇంగ్లాండ్‌ కథ కంచికి.. మ్యాచ్‌ భారత్‌ చేతికి! 

టెస్టుల్లో మాదిరే టీ20ల్లోనూ ఓటమితో సిరీస్‌ను ఆరంభించిన టీమ్‌ఇండియా.. అక్కడి నుంచి గొప్పగా పుంజుకుని చివరికి సిరీస్‌ను 3-2తో చేజిక్కించుకుంది. శనివారం నిర్ణయాత్మక పోరులోభారత్‌.. 36 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట  ఓపెనర్లు కోహ్లి (80 నాటౌట్‌; 52 బంతుల్లో 7×4, 2×6), రోహిత్‌ (64; 34 బంతుల్లో 4×4, 5×6)లకు తోడు.. సూర్యకుమార్‌ (32; 17 బంతుల్లో 3×4, 2×6), హార్దిక్‌ పాండ్య (39 నాటౌట్‌; 17 బంతుల్లో 4×4, 2×6) చెలరేగడంతో భారత్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 224 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం డేవిడ్‌ మలన్‌ (68; 46 బంతుల్లో 9×4, 2×6), జోస్‌ బట్లర్‌ (52; 34 బంతుల్లో 2×4, 4×6) భారత్‌ను భయపెట్టినా.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ భువనేశ్వర్‌ (2/15) ప్రత్యర్థికి కళ్లెం వేశాడు. శార్దూల్‌ ఠాకూర్‌ (3/45) కూడా చివర్లో వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్‌ 8 వికెట్లకు 188 పరుగులే చేసింది. కోహ్లికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ దక్కింది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ మంగళవారం ఆరంభమవుతుంది.

ఆ ఇద్దరి దూకుడు: 225 పరుగుల లక్ష్యం ముందుండగా,   భువి బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ రెండో బంతికే రాయ్‌ వికెట్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్‌.. అసలు మ్యాచ్‌లో పోటీలో ఉంటుందని కూడా ఎవరూ అనుకోలేదు. కానీ బట్లర్‌, మలన్‌.. అనూహ్యంగా చెలరేగి ఇంగ్లాండ్‌ను రేసులో నిలిపారు. పవర్‌ ప్లే ముగిసేసరికి ఇంగ్లాండ్‌ 62/1తో నిలిచింది. పదో ఓవర్లోనే స్కోరు వంద దాటేసింది. 11 ఓవర్లకు స్కోరు 120. కోహ్లి బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఏ ఫలితం లేకపోయింది. మ్యాచ్‌పై ఆశలు సన్నగిల్లిపోతున్న దశలో భువి వచ్చి 13వ ఓవర్లో ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అతను బట్లర్‌ను ఔట్‌ చేశాడు. ఆ ఓవర్లో మూడే పరుగులు రావడంతో ఇంగ్లాండ్‌ ఒత్తిడిలో పడిపోయింది. ఇక ప్రతి బంతినీ బాదాల్సిన స్థితిలో బెయిర్‌ స్టో (7), మలన్‌ కూడా వికెట్లు ఇచ్చేశారు. శార్దూల్‌ ఒకే ఓవర్లో వీళ్లిద్దరినీ పెవిలియన్‌ చేర్చాడు. మోర్గాన్‌ (1) ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఇంగ్లాండ్‌కు దారులు మూసుకుపోయాయి. చివరి 4 ఓవర్లలో 81 పరుగులు చేయాల్సిన స్థితిలో మిగతా బ్యాట్స్‌మెన్‌ అద్భుతాలేమీ చేయలేకపోయారు.


టీమ్‌ఇండియాకు ఇది అజేయంగా ఎనిమిదో సిరీస్‌. ఏడు సిరీస్‌లు గెలిచిన కోహ్లి సేన.. ఒక దాన్ని డ్రా చేసుకుంది. ఇది వరుసగా ఆరో సిరీస్‌ విజయం.

దంచుడే దంచుడు:   ఈ సిరీస్‌ అంతా మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టుకు ఆరంభంలో కష్టాలు తప్పలేదు. ఈ మ్యాచ్‌లో భారత్‌ సంప్రదాయాన్ని మార్చింది. పవర్‌ ప్లేలో వికెట్‌ కోల్పోకుండా 60 పరుగులు చేసింది. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రోహిత్‌ శర్మ.. ఈసారి చెలరేగిపోవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అతను తనదైన శైలిలో పుల్‌ షాట్లతో సిక్సర్లు బాదాడు. అతను 30 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్‌తో పోలిస్తే కొంచెం ఆలస్యంగా ఊపందుకున్న విరాట్‌ సైతం.. కొన్ని భారీ షాట్లు ఆడాడు.  8 ఓవర్లకు భారత్‌ స్కోరు 81/0. స్టోక్స్‌ వేసిన తర్వాతి ఓవర్లోనూ రోహిత్‌ 6, 4 బాదడంతో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. భారత్‌ 100 వైపు పరుగులు పెడుతుండగా.. అదే ఓవర్లో స్టోక్స్‌ లెగ్‌ కటర్‌ను వికెట్ల మీదికి ఆడుకుని రోహిత్‌ ఔటయ్యాడు. కానీ తర్వాత వచ్చిన సూర్యకుమార్‌.. రోహిత్‌ను మించిన దూకుడుతో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. తాను ఎదుర్కొన్న 2, 3 బంతులకు అతను సిక్సర్లు బాదడం విశేషం. కోహ్లి కూడా జోరు పెంచడంతో 13 ఓవర్లకు 142/1తో భారత్‌ తిరుగులేని స్థితిలో నిలిచింది. తర్వాతి ఓవర్లో సూర్య ఔటైపోయినా.. బ్యాటింగ్‌ ఆర్డర్లో ముందుకు వచ్చిన హార్దిక్‌ అదే స్థాయిలో రెచ్చిపోయాడు. కోహ్లి చివరి ఓవర్లలో టాప్‌ గేర్‌ అందుకోవడంతో భారత్‌ సునాయాసంగా 200 దాటేసింది. చివరి 5 ఓవర్లలో భారత్‌ 67 పరుగులు రాబట్టింది.
భారత్‌ ఇన్నింగ్స్‌:    రోహిత్‌ (బి) స్టోక్స్‌ 64; కోహ్లి నాటౌట్‌ 80; సూర్యకుమార్‌ (సి) రాయ్‌ (బి) రషీద్‌ 32; పాండ్య నాటౌట్‌ 39; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 2 వికెట్లకు) 224; వికెట్ల పతనం:       1-94, 2-143; బౌలింగ్‌: రషీద్‌ 4-0-31-1; ఆర్చర్‌ 4-0-43-0; వుడ్‌ 4-0-53-0; జోర్డాన్‌ 4-0-57-0; సామ్‌ కరన్‌ 1-0-11-0; స్టోక్స్‌ 3-0-26-1
ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (బి)   భువనేశ్వర్‌ 0; బట్లర్‌ (సి) పాండ్య (బి) భువనేశ్వర్‌ 52; మలన్‌ (బి) శార్దూల్‌ 68; బెయిర్‌స్టో (సి) సూర్యకుమార్‌ (బి) శార్దూల్‌ 7; మోర్గాన్‌ (సి) రాహుల్‌ (బి) పాండ్య 1; స్టోక్స్‌ (సి) పంత్‌ (బి) నటరాజన్‌ 14; జోర్డాన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) శార్దూల్‌ 11; ఆర్చర్‌ రనౌట్‌ 1; కరన్‌ నాటౌట్‌ 14; రషీద్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 188; వికెట్ల పతనం: 1-0, 2-130, 3-140, 4-142, 5-142, 6-165, 7-168, 8-174; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-15-2; పాండ్య 4-0-34-1; సుందర్‌ 1-0-13-0; శార్దూల్‌ 4-0-45-3; నటరాజన్‌ 4-0-39-1; రాహుల్‌ చాహర్‌ 3-0-33-0

రోహిత్‌-కోహ్లి తొలిసారి
రాహుల్‌పై వేటు పడటంతో ఈ మ్యాచ్‌లో కోహ్లి ఓపెనర్‌గా వచ్చాడు. రోహిత్‌తో కలిసి అతను టీ20ల్లో ఇన్నింగ్స్‌ ఆరంభించడం ఇదే తొలిసారి. మొత్తంగా అంతర్జాతీయ టీ20ల్లో విరాట్‌ ఓపెనర్‌గా రావడమిది 9వసారి. కలిసి ఓపెనింగ్‌ చేసిన తొలి మ్యాచ్‌లోనే కోహ్లి, రోహిత్‌ 94 పరుగులు జోడించి జట్టుకు బలమైన పునాది వేశారు.

రాహుల్‌పై వేటు
వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమవడంతో ఓపెనర్‌ రాహుల్‌పై వేటు వేసింది టీమ్‌ఇండియా. తొలి టీ20లో ఒక్క పరుగే చేసిన అతను.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. అయినప్పటికీ అతడికి మరో అవకాశం దక్కింది. కానీ నాలుగో టీ20లోనూ అతను 15 పరుగులే చేసి వెనుదిరిగాడు. టీమ్‌ఇండియా రాహుల్‌ స్థానంలో ఫాస్ట్‌బౌలర్‌ నటరాజన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా అతను ఆలస్యంగా జట్టులోకి వచ్చాడు.

ఆ క్యాచ్‌.. వాహ్‌!
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు జోర్డాన్‌, రాయ్‌ అద్భుత ఫీల్డింగ్‌ నైపుణ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గత మ్యాచ్‌ జోరును కొనసాగిస్తూ చెలరేగిపోయిన సూర్యకుమార్‌ యాదవ్‌కు వీళ్లిద్దరే బ్రేకులేశారు. రషీద్‌ బౌలింగ్‌లో మిడ్‌వికెట్‌ దిశగా సూర్య భారీ షాట్‌ ఆడగా.. అది బౌండరీ అవతల పడేట్లే కనిపించింది. కానీ లాంగాన్‌ నుంచి శరవేగంగా దూసుకొచ్చిన జోర్డాన్‌ బంతిని కళ్లు చెదిరే రీతిలో అందుకున్నాడు. కానీ తనను తాను నియంత్రించుకోని స్థితిలో.. రెప్పపాటు వ్యవధిలో బంతిని ముందుకు విసిరేశాడు. జోర్డాన్‌ను జాగ్రత్తగా గమనిస్తున్న రాయ్‌ చురుగ్గా స్పందించి బంతిని అందుకోవడంతో సూర్య పెవిలియన్‌ చేరక తప్పలేదు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన