అనుకోకుండా దీపక్‌
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 21/07/2021 03:18 IST

అనుకోకుండా దీపక్‌

లంకపై సిరీస్‌ కైవసం
 
చాహర్‌ అసమాన పోరాటం
 భారత్‌కు మరో విజయం

తొలి వన్డేలో భారత్‌ ముందు 263 పరుగుల లక్ష్యం. కుర్రాళ్లు పృథ్వీ, కిషన్‌ల అండతో ఇంకో 80 బంతులుండగానే కెప్టెన్‌ ధావన్‌ జట్టును గెలిపించేశాడు.

ఈసారి లంక నిర్దేశించిన లక్ష్యం 276. మళ్లీ టాప్‌ఆర్డర్‌ మెరుపులతో భారత్‌ అలవోకగా లక్ష్యాన్ని  ఛేదించేస్తుందనుకున్నారు అభిమానులు.

కానీ 12 ఓవర్లు తిరిగేసరికి పై ముగ్గురూ వెనుదిరిగారు. సగం లక్ష్యమైనా కరగకముందే సగం జట్టు పెవిలియన్‌ చేరిపోయింది. ‘బ్యాట్స్‌మెన్‌’లో చివరి వాడైన కృనాల్‌ పాండ్య ఏడో వికెట్‌ రూపంలో   ఔటయ్యేసరికి జట్టు స్కోరు 193.

ఇక భారత్‌ ఓటమి లాంఛనమే అని అందరూ ఒక అంచనాకు వచ్చేశాక మొదలైంది దీపక్‌ చాహర్‌ కొత్త అవతారం! బౌలర్‌ కాస్తా సాధికారిక బ్యాట్స్‌మన్‌లా మారిపోయి ఆడిన సంచలన ఇన్నింగ్స్‌తో లంకకు దిమ్మదిరిగే షాక్‌! సిరీస్‌ భారత్‌ సొంతం!!

కొలంబో

అనుకోని హీరో.. టీమ్‌ఇండియాకు అనుకోని విజయాన్నందించాడు. పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ (69 నాటౌట్‌; 82 బంతుల్లో 7×4, 1×6) అద్భుతంగా పోరాడడంతో మంగళవారం రెండో వన్డేలో భారత్‌ 3 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది. భువనేశ్వర్‌ (19 నాటౌట్‌; 28 బంతుల్లో 2×4)తో అభేద్యమైన ఎనిమిదో వికెట్‌కు చాహర్‌ 84 పరుగులు జోడించడంతో 276 పరుగుల లక్ష్యాన్ని భారత్‌.. 49.1 ఓవర్లలో  7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓ దశలో భారత్‌ 116కే అయిదు వికెట్లు కోల్పోగా.. సూర్యకుమార్‌ (53; 44 బంతుల్లో 6×4), కృనాల్‌ పాండ్య (35) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. అయినా ఓటమి దిశగా సాగిన భారత్‌ను.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ చాహర్‌ విజయపథంలో నడిపించాడు. చరిత్‌ అసలంక (65), అవిష్క ఫెర్నాండో (50), కరుణరత్నె (44 నాటౌట్‌) రాణించడంతో మొదట శ్రీలంక 9 వికెట్లకు 275 పరుగులు సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యం సంపాదించింది.

తడబాటు..: ఛేదన ఆరంభంలోనే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తొలి వన్డే హీరోలు పృథ్వీ షా (13), ఇషాన్‌ కిషన్‌ (1) త్వరగానే నిష్క్రమించారు.  హసరంగ.. పృథ్వీని ఔట్‌ చేయగా.. కిషన్‌ను రజిత బౌల్డ్‌ చేశాడు. 5 ఓవర్లకు స్కోరు 39/2. కెప్టెన్‌ ధావన్‌ (29; 38 బంతుల్లో 6×4)... పాండే (37)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 12వ ఓవర్లో హసరంగ బౌలింగ్‌తో అతడు నిష్క్రమించేటప్పటికి స్కోరు 65 పరుగులే. ఈ దశలో ధాటిగా ఆడిన సూర్యకుమార్‌.. పాండేతో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించడంతో భారత్‌ 17 ఓవర్లలో 114/3తో లక్ష్యం దిశగా సాగింది. కానీ తర్వాతి ఓవర్లో భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. పాండే దురదృష్టవశాత్తు రనౌట్‌ కాగా.. హార్దిక్‌ (0)ను శనక వెనక్కి పంపాడు. 116కే అయిదు వికెట్లు కోల్పోయిన భారత్‌ను సూర్యకుమార్‌, కృనాల్‌ ఆదుకున్నారు. అయితే ఆరో వికెట్‌కు 44 పరుగులు జోడించాక సూర్యకుమార్‌ ఔట్‌ కావడంతో భారత్‌ ఓటమి దిశగా సాగింది.

సూపర్‌ చాహర్‌..: 160కే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో భారత్‌ ఓడిపోతుందనే అనిపించింది. కానీ చాహర్‌తో కలిసి కృనాల్‌ పోరాడాడు. ఆశలు పెరుగుతున్న సమయంలో జట్టు స్కోరు 193 వద్ద 36వ ఓవర్లో వెనుదిరిగాడు. అప్పటికి సాధించాల్సిన రన్‌రేట్‌ అందుబాటులోనే ఉంది. పరుగులు చేయడానికి బ్యాట్స్‌మెనే లేరు. మిగిలిందల్లా ముగ్గురు టెయిలెండర్లే. చివరి 14 ఓవర్లలో 81 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్‌ ఓటమి ఖాయమనిపించింది. ఈ దశలో భువనేశ్వర్‌తో కలిసి దీపక్‌ అసమాన పోరాటపటిమను ప్రదర్శించాడు. ఒత్తిడి తేవడానికి ప్రయత్నించిన లంక స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. అతను చక్కటి షాట్లతో బౌండరీలు సాధించడంతో జట్టు క్రమంగా లక్ష్యానికి చేరువైంది. భువనేశ్వర్‌ కూడా స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ చాహర్‌కు సహకరించాడు. క్రమంగా లంకపై ఒత్తిడి పెరిగింది. చాహర్‌ 64 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. చివరి 4 ఓవర్లలో భారత్‌కు 29 పరుగులు అవసరం కాగా.. చమీర బౌలింగ్‌లో భువి, చాహర్‌ చెరో ఫోర్‌ కొట్టారు. చివరి 2 ఓవర్లలో విజయానికి కావాల్సింది 15 పరుగులు. చమీర వేసిన ఇన్నింగ్స్‌ 49వ ఓవర్లో చాహర్‌, భువి చెరో ఫోర్‌ కొట్టేశారు. ఆఖరి ఓవర్లో మూడు పరుగులు అవసరం కాగా.. తొలి బంతినే బౌండరీకి తరలించి భారత్‌ను గెలిపించాడు చాహర్‌.

మెరిసిన అసలంక: తొలి వన్డేతో చూస్తే శ్రీలంక బ్యాటింగ్‌ కాస్త మెరుగుపడింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆతిథ్య జట్టుకు ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, మినోద్‌ (36) మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించారు. కానీ ఆ జట్టు ఇన్నింగ్స్‌లో అసలంక ఆటే హైలైట్‌. శనక (16)తో అయిదో వికెట్‌కు 38, కరుణరత్నెతో కలిసి ఏడో వికెట్‌కు 50 పరుగులు జోడించిన అతడు లంక మంచి స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్లలో చాహల్‌ (3/50) చక్కగా బౌలింగ్‌ చేశాడు.

స్కోరు వివరాలు

శ్రీలంక ఇన్నింగ్స్‌: అవిష్క ఫెర్నాండో (సి) కృనాల్‌ (బి) భువనేశ్వర్‌ 50; మినోద్‌ (సి) పాండే (బి) చాహల్‌ 36; రాజపక్స (సి) ఇషాన్‌ (బి) చాహల్‌ 0; ధనంజయ డిసిల్వా (సి) ధావన్‌ (బి) చాహర్‌ 32; చరిత్‌ అసలంక (సి) పడిక్కల్‌ (బి) భువనేశ్వర్‌ 65; దసున శనక (బి) చాహల్‌ 16; హసరంగ (బి) చాహర్‌ 8; చమిక కరుణరత్నె నాటౌట్‌ 44; చమీర (సి) పడిక్కల్‌ (బి) భువనేశ్వర్‌ 2; సందకన్‌ రనౌట్‌ 0; రజిత నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 21;

మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 275;

వికెట్ల పతనం: 1-77, 2-77, 3-124, 4-134, 5-172, 6-194, 7-244, 8-264, 9-266;

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 10-0-54-3; దీపక్‌ చాహర్‌ 8-0-53-2; హర్దిక్‌ పాండ్య 4-0-20-0; చాహల్‌ 10-1-50-3; కుల్‌దీప్‌ 10-0-55-0; కృనాల్‌ 8-0-37-0

భారత్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ (బి) హసరంగ 13; ధావన్‌ ఎల్బీ (బి) హసరంగ 29; కిషన్‌ (బి) రజిత 1; పాండే రనౌట్‌ 37; సూర్యకుమార్‌ ఎల్బీ (బి) సందకన్‌ 53; హార్దిక్‌ (సి) ధనంజయ (బి) శనక 0; కృనాల్‌ (బి) హసరంగ 35; దీపక్‌ చాహర్‌ నాటౌట్‌ 69; భువనేశ్వర్‌ నాటౌట్‌ 19; ఎక్స్‌ట్రాలు 21

మొత్తం: (49.1 ఓవర్లలో 7 వికెట్లకు) 277;

వికెట్ల పతనం: 1-28, 2-39, 3-65, 4-115, 5-116, 6-160, 7-193;

బౌలింగ్‌: రజిత 7.1-0-53-1; చమీర 10-0-65-0; హసరంగ 10-0-37-3; సందకన్‌ 10-0-71-1; చమిక కరుణరత్నె 6-1-26-0; శనక 3-0-10-1; ధనంజయ డిసిల్వా 3-0-10-0



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన