close

పదవీ విరమణ వయసు పెంపునకు సిఫార్సు

 ఆచార్యులు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు 65 ఏళ్లు చేయాలన్న కమిటీ
 ముఖ్యమంత్రికి నివేదిక..
   ఆయనదే తుది నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) వేతనాలు అందుకునే వర్సిటీల ఆచార్యులు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు పదవీ విరమణ వయసును ఇప్పుడున్న 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలని ఉన్నతాధికారులతో కూడిన రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రికి సిఫార్సు చేసింది. ఏడో కేంద్ర వేతన సంఘం ప్రకారం యూజీసీ వేతనాలు అందుకునే ఆచార్యులు, డిగ్రీ అధ్యాపకుల పదవీ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాస్‌ కన్వీనర్‌గా ఏర్పాటైన కమిటీ శాసనసభ ఎన్నికలకు ముందే ముసాయిదా నివేదికలో సిఫార్సు చేసింది. ఈ నివేదికపై అప్పుడు చర్చించిన విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య.. రెండుమూడు అంశాలపై సందేహాలను లేవనెత్తారు. వాటికి సమాధానం ఇస్తూ తుది నివేదికను కొద్ది రోజుల క్రితం కమిటీ.. ప్రస్తుత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రాకు సమర్పించింది. ఈ క్రమంలో కమిటీ సభ్యులు కూడా అయిన అజయ్‌మిశ్రాతోపాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌ సిన్హా, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌తోపాటు కమిటీ కన్వీనర్‌ శ్రీనివాస్‌, సభ్యులైన ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్‌టీయూ ఉపకులపతి వేణుగోపాల్‌రెడ్డి, మహాత్మాగాంధీ వర్సిటీ ఉపకులపతి అల్తాఫ్‌ హుస్సేన్‌, ఓయూ మాజీ ఉపకులపతి ఆచార్య తిరుపతిరావు సమావేశమై లోతుగా చర్చించారు. ఏడో కేంద్ర వేతన సంఘం ప్రకారం వేతనాలు పెంచడం, ఆచార్యుల వయసును 65 సంవత్సరాలకు పెంచడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా యూజీసీ వేతనాలు అందుకునే వారికీ మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌ వర్తింపజేయాలన్నది కమిటీ ప్రధాన సిఫార్సులు. ఉన్నతాధికారులు కమిటీ అన్ని సిఫార్సులకు ఆమోదం తెలిపారు. పదవీ విరమణ వయసు పెంచడంపై తమకు అభ్యంతరం లేదని, దానిపై తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి తీసుకోవాల్సి ఉంటుందని ఆయా శాఖల ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. కమిటీ ప్రతిపాదనలకు యథాతథంగా ఆమోదం తెలిపిన ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి నివేదికను పంపారు. సిఫార్సులు అమలైతే వర్సిటీలు, డిగ్రీకళాశాలల్లో కలిపి 3 వేల మంది బోధన సిబ్బందికి ప్రయోజనం కలుగుతుంది.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.