లక్ష్మీ బ్యారేజీ నుంచి నీటి విడుదల
close

ప్రధానాంశాలు

లక్ష్మీ బ్యారేజీ నుంచి నీటి విడుదల

మహదేవ్‌పూర్‌, రామడుగు, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని తొలి, భారీ ఆనకట్ట లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీ నుంచి నీటి విడుదల ప్రారంభించారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలకు గాను రెండు రోజుల్లోనే 12 టీఎంసీల మేర వరద ప్రవాహం వచ్చింది. ప్రస్తుతం ఎగువ నుంచి 51,900 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 10 గేట్లను ఎత్తి 23,900 క్యూసెక్కుల మేర విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ(కన్నెపల్లి) పంపుహౌస్‌ ద్వారా 4,200 క్యూసెక్కుల నీటిని అన్నారం(సరస్వతి) బ్యారేజీకి ఎత్తిపోస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంప్‌హౌస్‌ నుంచి సుమారు 6,300 క్యూసెక్కుల జలాలను ఎత్తిపోస్తూ.. ఎస్సారెస్పీ వరద కాలువలోకి వదులుతున్నారు. అక్కడి నుంచి మధ్య మానేరు ప్రాజెక్టుకు గోదావరి జలాలు తరలుతున్నాయి.

శ్రీరాంసాగర్‌కు 15 వేల క్యూసెక్కులు

ఈనాడు, హైదరాబాద్‌: మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి స్వల్పంగా ప్రవాహం వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్‌ జలాశయానికి 15,360 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలకు గాను ప్రస్తుతం 20.90 టీఎంసీల జలాలు నిల్వ ఉన్నాయి. ఎల్లంపల్లి జలాశయానికి 1246 క్యూసెక్కులు వస్తున్నాయి.  
కృష్ణా నదిలో ఆలమట్టికి 13,748 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జూరాలకు 7,355 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా దిగువకు 6,718 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి 6,568, నాగార్జునసాగర్‌కు 1817 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని