కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలను నెరవేరుస్తున్నాం

ప్రధానాంశాలు

కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలను నెరవేరుస్తున్నాం

ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: సకల జనుల, సబ్బండవర్గాల ప్రజల కోసం జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఆయన కలలను నెరవేరుస్తూ, అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం విశేష పురోగతి సాధించిందని, చేనేత కార్మికుల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. ఈ నెల 27న స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ 106వ జయంతిని పురస్కరించుకుని కేసీఆర్‌ ఆయనకు నివాళులర్పించారు. బంగారు తెలంగాణ సాధనే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ‘‘బాపూజీ నిస్వార్థ సేవలు స్ఫూర్తిదాయకం. న్యాయవాదిగా సాయుధ పోరాట కాలంలో చాకలి ఐలమ్మ సహా పలువురికి సేవలందించారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని, అవే విలువలను జీవితాంతం పాటించారు. తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన పోరాటంలో ఆ స్ఫూర్తిని కొనసాగించారు. బహుజన నేతగా దేశవ్యాప్తంగా నేతన్నలను సంఘటితం చేసిన ఘనత ఆయనకే దక్కింది. ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకున్నాం. ప్రతిభావంతులైన చేనేత కళాకారులకు ఆయన పేరిట పురస్కారాలు అందజేస్తూ స్ఫూర్తిని కొనసాగిస్తున్నాం’’ అని సీఎం తన సందేశంలో తెలిపారు. మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డిలు బాపూజీ సేవలను స్మరించుకున్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని