ధాన్యం కొనుగోళ్ల అక్రమాలకు అడ్డుకట్ట

ప్రధానాంశాలు

ధాన్యం కొనుగోళ్ల అక్రమాలకు అడ్డుకట్ట

పాసుపుస్తకంలో పేరున్న వారికే చెల్లింపులు

దిద్దుబాటు దిశగా పౌరసరఫరాలశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్ల చెల్లింపుల్లో ఉన్న లోపాలు కొందరు అక్రమార్కుల చేతివాటానికి కారణమవుతుండటంతో వాటిని అరికట్టేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల చెల్లింపుల కోసం ఆధార్‌ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసేందుకు పౌరసరఫరాలశాఖ అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల సందర్భంలో పట్టాదారు పాసు పుస్తకంలో పేరుతో సంబంధం లేకుండా ట్రక్‌ షీట్‌లో ఎవరి పేరు రాస్తే వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పట్టాదారుకు, బ్యాంకు ఖాతాకు పొంతన ఉండటంలేదు. ఈ వెసులుబాటుతో కొందరు దళారులు, కొనుగోలు కేంద్రాల రాజకీయ పెద్దలు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవల నాగర్‌కర్నూల్‌, ఖమ్మం, సిద్దిపేట, జనగామ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీనిపై ‘పొలం లేదు.. ధాన్యం లేదు.. రూ.కోట్లలో పంట విక్రయించారంట’ శీర్షికతో బుధవారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీంతో ఆయా జిల్లాల్లో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టి జరిగిన అక్రమాలను గుర్తిస్తున్నారు. కొందరు మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. వరి పండించే రైతుల ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేయించి.. వాటిలో పేరు ఒకేలా ఉంటేనే చెల్లింపులు చేస్తారు. వరి రైతుల వివరాలను వ్యవసాయశాఖ రికార్డుల్లో విధిగా నమోదు చేయించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. వీటన్నింటికీ సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో జారీ చేసే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖలోని క్షేత్రస్థాయి అధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు జరిపే నాటికి ఆన్‌లైన్‌ వ్యవస్థ మరింత పటిష్ఠమవుతుందని వివరించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని