విజయ డెయిరీ టర్నోవర్‌ రూ.1500 కోట్లకు పెంచాలి: తలసాని

ప్రధానాంశాలు

విజయ డెయిరీ టర్నోవర్‌ రూ.1500 కోట్లకు పెంచాలి: తలసాని

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేటు డెయిరీలకు దీటుగా విజయ డెయిరీ అమ్మకాలు ఉండాలని, అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉత్పత్తులను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. రూ.800 కోట్లుగా ఉన్న డెయిరీ వార్షిక టర్నోవర్‌ను రూ.1,500 కోట్లకు పెంచే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాలని స్పష్టంచేశారు. విజయ డెయిరీ ఉత్పత్తుల మార్కెటింగ్‌, నూతన ఔట్‌లెట్ల ఏర్పాటుపై అధికారులతో గురువారం మంత్రి సమీక్షించారు. ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, జాతీయ రహదారుల వెంట డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేయాలన్నారు. ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌, చార్మినార్‌, దుర్గంచెరువు కేబుల్‌బ్రిడ్జి వద్ద విక్రయ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతంచేయాలని సూచించారు. పుష్‌కార్ట్‌(ట్రైసైకిల్‌) ద్వారా విజయ ఐస్‌క్రీం విక్రయాలు పెంచితే యువతకు ఉపాధి కల్పించవచ్చన్నారు. పుష్‌కార్ట్‌లు,  ఐస్‌క్రీం ఫ్రీజర్లను రాయితీపై అందించే ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలిచ్చారు. త్వరలో ప్రారంభం కానున్న మెగా డెయిరీని దృష్టిలో పెట్టుకుని ఇప్పట్నుంచే పాల ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్‌పై దృష్టిపెట్టాలని సూచించారు. సమావేశంలో డెయిరీ ఛైర్మన్‌ లోకభూమారెడ్డి, ఇన్‌ఛార్జి ఎండీ అనిత రాజేంద్ర అధికారులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని