close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బడి బకాయి..‘ప్రైవేటు’ లడాయి

 లాక్‌డౌన్‌లోనూ ఫీజు వసూలుకు బలవంతం
 వచ్చే ఏడాది ట్యూషన్‌ రుసుం తొలి వాయిదా చెల్లించాలని ఒత్తిడి
 ప్రభుత్వం హెచ్చరించినా పట్టించుకోని ప్రైవేట్‌ పాఠశాలలు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులు తారుమారైనందున మానవతతో ఆలోచించి 2019-20 విద్యా సంవత్సర ట్యూషన్‌ ఫీజు బకాయిలు చెల్లించాలని తల్లిదండ్రులను బలవంతం చేయరాదని ప్రభుత్వం కోరినా పలు ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ ముగియనే లేదు....విద్యాసంస్థలు తెరచుకోలేదు. అయినా వచ్చే విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తాం... తొలి వాయిదా చెల్లించాలని, లేకుంటే లింక్‌ పంపించేది లేదని బెంబేలెత్తిస్తున్నాయి. మరో వైపు వచ్చే విద్యా సంవత్సరం రుసుములు పెంచొద్దని ప్రభుత్వం జీఓ 46 జారీ చేసినా కొన్ని ఇంటర్నేషనల్‌ పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ట్యూషన్‌ ఫీజును నెలవారీగా వసూలు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొనడంతో ఇతర ఫీజుల మొత్తాన్ని కలిపి నెల రుసుంగా చూపిస్తున్నాయని హైదరాబాద్‌ స్కూల్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎస్‌పీఏ) సైతం విద్యాశాఖకు ఆధారాలతో ఫిర్యాదు చేసింది. సీబీఎస్‌ఈ సిలబస్‌తో నడిచే పలు ఇంటర్నేషనల్‌ పాఠశాలలు మార్చి 16 నుంచి ఏప్రిల్‌ మూడో వారం వరకు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు నిర్వహిస్తాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి చివరి వారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాయి. దీంతో ట్యూషన్‌ రుసుం తొలి వాయిదా చెల్లించాలని ఒత్తిడి తీసుకొచ్చాయి. చెల్లించని వారికి ఇప్పుడు నిర్వహించే ఆన్‌లైన్‌ తరగతులకు లింక్‌ పంపించేది లేదని బెదిరిస్తున్నాయి.హైదరాబాద్‌లోని మల్కాజిగిరి సంజయ్‌నగర్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాల పరిపాలనాధికారి 9వ తరగతి విద్యార్థి తండ్రి నుంచి 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి బకాయిలను వసూలు చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. హైదరాబాద్‌లో పలు పాఠశాలలను నిర్వహిస్తున్న ఓ కార్పొరేట్‌ పాఠశాల బకాయిలను చెల్లించాలంటూ తల్లిదండ్రులకు ఈ-మెయిళ్లు పంపిస్తూ ఒత్తిడితెస్తోంది.

జీఓలో అస్పష్టత.. తల్లిదండ్రుల్లో అయోమయం
వచ్చే విద్యా సంవత్సరానికి(2020-21) కూడా గత ఏడాది రుసుములను వసూలు చేయాలని, ఫీజులు పెంచవద్దని విద్యాశాఖ జీఓ 46 జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోలోని అస్పష్టతతో తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది. ఉదాహరణకు ఒక విద్యార్థి 1వ తరగతికి వార్షిక ఫీజు 2019-20లో రూ.40 వేలు చెల్లించాడు. వచ్చే ఏడాది 2వ తరగతి చదవాలి. అప్పుడు కూడా రూ.40 వేలు మాత్రమే చెల్లించాలని చాలా మంది అనుకున్నారు. యాజమాన్యాలు మాత్రం రూ.40 వేలు కాదని, గత ఏడాది 2వ తరగతి ఫీజు ఎంతో అది చెల్లించాలని చెబుతున్నాయి. దీనిపై విద్యాశాఖకు కొందరు ఫిర్యాదు చేశారు. పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకుడు రమణకుమార్‌ను ‘ఈనాడు’ వివరణ కోరగా విద్యార్థి గత ఏడాది చెల్లించిన ఫీజు కాదని, గత ఏడాది ఏ తరగతికి ఎంత రుసుం ఉందో అది చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.


వచ్చే నెల నుంచి కొత్త విద్యా సంవత్సరంలో భాగంగా ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించబోతున్నాం. ఆలోపు ట్యూషన్‌ ఫీజు మొదటి వాయిదా చెల్లించాలి. లేదంటే ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేందుకు అవసరమైన లింక్‌ పంపించం.

- తల్లిదండ్రులకు బేగంపేటలోని ఓ ఇంటర్నేషనల్‌ పాఠశాల పంపిన హెచ్చరిక

 


యూకేజీ చదివే విద్యార్థికి గత విద్యా సంవత్సరానికి అతని తండ్రి చెల్లించిన వార్షిక రుసుం రూ.32 వేలు. వచ్చే విద్యా సంవత్సరానికి మొదటి తరగతికి రూ.42 వేలు ఫీజు అని, తొలి వాయిదా వెంటనే చెల్లించాలని నిత్యం ఫోన్‌లో సంక్షిప్త సందేశాలు. గత సంవత్సరం మొదటి తరగతి ఫీజు కంటే ఇది సుమారు రూ.ఐదువేలు అధికం.

- ఇదీ ఖైరతాబాద్‌లోని ఓ పాఠశాల యాజమాన్యం ఇష్టారాజ్యం

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.