close
అసలు ప్రేమ

- నామని సుజనాదేవి

‘నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం, నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం స్వార్థమో నేరమో కాదు. ఎందుకంటే, నువ్వు బాగుంటేనే ఇతరుల గురించి ఆలోచించగలవు, సాయం చెయ్యగలవు.’ 

ఎక్కడో చదివిన కొటేషన్‌ ఆమె జీవితాన్ని మార్చేసింది. 

మార్చుకున్న జీవనసరళి ఎన్నో విమర్శలను తెచ్చిపెట్టడంతోపాటు, తన జీవితాన్నీ ఎన్నో మలుపులు తిప్పుతుందని అప్పుడు ఆమె అనుకోలేదు. కానీ, కాలగమనంలో ఆమె దృఢసంకల్పం అలా ఆమెను నడిపించింది. దానికి కారణం అంతకుముందు ఆమె జీవితంలో జరిగిన - ఆమె కలలోనైనా ఊహించని - సంఘటన. ఆమె పేరు సంగీత.

* * *

‘చూశావా వదినా, ఆరన్నా కాలేదు... టింగురంగా అని ట్రాక్‌సూట్‌ వేసుకుని గ్రౌండ్‌కి ఎలా బయల్దేరిందో. నాలుగు పదులు దాటిన ఆ వయస్సేంటీ... అలా తిరగడమేంటీ? పిల్లలు లేస్తారు, వాళ్ళ పనులు చూడాలన్న బాధేలేదు...’ ‘అంతేనా... ఇంటిపనులు వదిలేసి, సమాజసేవా కార్యక్రమాలని తిరుగుతోంది... ఇక పిల్లల్ని పట్టించుకునేదెపుడో. నాకయితే పిల్లలను ఇబ్బందులకు గురిచేసి ఎక్కడికీ వెళ్ళబుద్ధి కాదు...’

ఇంటిముందు ముగ్గులు వేస్తూ గుసగుసలాడుకుంటున్న పక్కింటి వనజ, రమణిల మాటలు నిశ్శబ్దంగా ఉన్న వీధిలో నడుస్తున్న సంగీతకు  వినబడుతున్నాయి.

తను వినాలనే అంటున్నారని ఆమెకు తెలుసు... అయినా పట్టించుకోకుండా సాగిపోయింది.

గ్రౌండ్‌లో నడుస్తుంటే వెనకవాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు లీలగా వినబడుతున్నాయి.

‘ఆవిడ మా ఫ్రెండ్‌ మదర్‌... అసలు ఇంటర్‌ అమ్మాయికి తల్లిలా ఉందా... ఈవిడే కాలేజీ పిల్లలా ఉంటుంది...’

‘అలా కనబడాలనే కదా... ఈ వాకింగు...’ 

‘అమ్మో... మా అమ్మ అయితే, ఎంత రమ్మన్నా రాదు. నేను అలా వస్తే ఈ టిఫిన్లూ వంటలూ ఇంటిపనులూ ఇవన్నీ ఎవరు చేస్తారే... మీకు సమయానికి అందివ్వొద్దూ... అంటుంది. నిజంగా ఎంత మంచి అమ్మ కదా... అమ్మ అంటే అలా ఉండాలి. మాకోసం మా అమ్మ ఎన్ని త్యాగాలు చేసిందో...అందుకే మా అమ్మ అంటే నాకు ప్రాణం.’ వారు నెమ్మదిగా మాట్లాడుకుంటూ నడుస్తున్నా వారిముందు ఉన్న సంగీతకు వినబడుతూనే ఉన్నాయి.

* * *

‘‘ఏరా చిట్టితల్లీ, వస్తున్నావా... త్వరగా రా... నాకు టైమ్‌ అవుతోంది... టిఫిన్‌ పెట్టేస్తాను’’ డైనింగ్‌ టేబుల్‌పైన ఇడ్లీ తింటూ, కూతురు త్రైలోక్య కోసం కేకేసింది సంగీత.

‘‘వస్తున్నా అమ్మా’’ అంటూ వచ్చింది త్రైలోక్య. ఆమె వచ్చేసరికి వేడివేడి ఇడ్లీలు చట్నీతో తింటోంది సంగీత. త్రైలోక్యకు ఆమె ఫ్రెండ్స్‌ మాటలు గుర్తొచ్చాయి.

‘మా అమ్మ అయితే మేము తినేంతవరకూ అసలు తినదు. మేమంతా తిన్నాకనే తింటుంది. అన్నయ్యకూ నాకూ స్నాక్సో పండ్లో ఏదో... మాకు ఏది ఇష్టమైతే అది ముందు మాకిచ్చాక ఏమైనా మిగిలితే తను తింటుంది. మిగలకపోతే తినకుండానే ఊరుకుంటుంది. ఒక్కోసారి నిన్నటిది ఏమైనా మిగిలి ఉంటే- తనే తింటుంది కానీ, మాకు మాత్రం వేడివేడివి పెడుతుంది.’ 

అమ్మ కూడా అలాగే ఉండేది కానీ ఈమధ్య ఎందుకో ఇదివరకులా లేదు. ఇదివరకు తామే లోకంలా పొద్దుటి నుండి రాత్రి వరకు క్షణం తీరికలేకుండా పని చేసేది. అప్పుడు పనామె కూడా లేదు. కానీ, ఇప్పుడు పనమ్మాయిని పెట్టుకుంది. పైగా ఎప్పుడూ లేనిది పొద్దుటే వాకింగ్‌ అంటూ తాము లేచేలోగానే వెళ్ళి వస్తోంది. అలాగని లావుగా కూడా ఏం లేదు. తమను కూడా రమ్మంటోంది. యోగా చేస్తోంది. వండినది కూడా వండాక తమకు తినడానికి ఆలస్యమవుతుంది అనుకుంటే- తను ముందే వేడివేడిగా పూజ చేయగానే తినేస్తోంది. అయినా అమ్మ కూడా త్వరగా ఆఫీసుకు వెళ్ళాలి కదా... ఇంట్లో ఉన్నా ఆఫీసుకు వెళ్ళినా తమకు బాక్సులో స్నాక్స్, పండ్లూ మొలకలూ... ఇలా అన్నీ ఎంత శ్రద్ధగా తయారుచేసి పెడుతుందో... కాకపోతే ఇప్పుడు తను కూడా బ్యాగ్‌లో పెద్ద మజ్జిగ బాటిల్, మొలకలు, రాగి జావ, ఒకరోజు కొర్రల అన్నం, ఒకరోజు ఊదల అన్నం... ఇలా రకరకాలు తీసుకెళుతోంది. తన ఫ్రెండ్స్‌వాళ్ళ అమ్మలు తమకోసం వాళ్ళు ఎలా, ఎంత త్యాగం చేస్తున్నారో  చెబుతుంటే తనకెందుకో అక్కడ నిలవబుద్ధికావడం లేదు. అప్పటికీ తన ఫ్రెండ్‌ మానస ఒకసారి అడగనే అడిగింది- ‘ఏంటే... మేమింతగా మా అమ్మ గురించి చెబుతుంటే నువ్వేం మాట్లాడవేమిటీ?’ అని. ఎలాగో మాట తప్పించడానికి తను చాలా శ్రమపడాల్సి వచ్చింది. అలాగని అమ్మ తమని పట్టించుకోవడం లేదని కాదుగా... తమ గురించి శ్రద్ధ తీసుకుంటూనే, తన గురించి కూడా శ్రద్ధ తీసుకుంటోంది. అది తను సహించలేకపోతోందా... ఛీ తప్పు కదూ.’ త్రైలోక్య వచ్చి కూర్చోగానే తనకూ ఓ ప్లేట్లో ఇడ్లీ పెట్టింది సంగీత.

‘‘తినేసి కాలేజీకి వెళ్ళు తల్లీ. ఆఫీసుకి టైమ్‌ అవుతోంది. అన్నయ్య క్లాసుకి వెళ్ళాడు- వచ్చి తిని, బాక్సు తీసుకెళతాడు. నేను అన్నీ సర్దిపెట్టి వెళతా. నాన్న ముందే వెళ్ళిపోయాడు కదా నేను బస్సులో వెళ్ళాలి... ఓకే త్రైలూ’’ అంటూ లేచింది సంగీత. ‘‘అమ్మా, మాకు మామూలు అన్నం... నీకు ఇలా చిరుధాన్యాల అన్నం... ఇలా అన్నీ చెయ్యాలంటే చాలా శ్రమ, పైగా బోలెడు టైమ్‌ కూడా పడుతుంది... నువ్వు కూడా ఇదే తినొచ్చు కదా.’’ ‘‘నిజమే నాన్నా... కానీ, డాక్టర్‌ ఇది ఆరోగ్యానికి మంచిది అన్నాడు. కానీ మీరు తినలేరు కదాని... నాకోసం వండుకుంటున్నాను.’’ తలూపింది త్రైలోక్య.

‘అమ్మకు తన ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ!’ అనుకుంది. టకటకా అందరికీ బాక్సులు సర్దింది సంగీత. తన బాక్సు కూడా పెట్టుకుంది. మజ్జిగ బాటిల్‌ నింపుకుంది. పళ్ళు, కొర్రల అన్నం, కూర, రాగిజావ సర్దుకుంది. ‘‘బై... తల్లీ’’ అంటూ బయటపడింది.

ఆఫీసుకి రాగానే పనిలో మునిగిపోయింది. చేస్తున్న పని పూర్తిచేసి అప్పటికే లంచ్‌ టైమ్‌ దాటిపోవడంతో హడావుడిగా లంచ్‌ బ్యాగుతో లేడీస్‌ రూము వైపు కదిలింది సంగీత. అయితే రూమ్‌కి మరో నాలుగడుగుల దూరంలో ఉండగానే ఓరగా వేసిన తలుపు లోపల నుండి తన పేరు వినబడటంతో ఆగిపోయింది.
‘ఇవాళ సంగీత రాలేదా ఏం... ఇంకా ఆమె బ్యాగూ దానితో ఆమె సూపర్‌ మార్కెట్‌ రాలేదేం అని చూస్తున్నా’ ...అది లత గొంతు.

‘ఏమో... నాకూ కనబడలేదు. ఆ డిపార్టుమెంటుకి వెళ్ళలేదు. అయినా వస్తే ఇప్పటివరకూ ఆగుతుందా... సమయానికి తినేయకపోతే నాకు పడదు- అంటూ రాదూ.’

‘అసలు ఆమె తినడానికే బతుకుతుందేమో అనిపిస్తుంది. పొద్దున్న ఆఫీసుకి రాగిజావ తెచ్చుకుని తాగుతుంది. ఇక లంచ్‌ అయితే చెప్పనక్కరలేదు. ఓ రోజు కొర్రలు అంటుంది... ఒకరోజు ఊదలు అంటుంది... ఒకరోజు సగ్గుబియ్యం మాత్రమే అంటుంది... వామ్మో, మనకు పిచ్చి లేస్తుంది.’

‘అంతేనా... అన్నం ఎంత ఉందో అందులో సగం కూర తెస్తుంది. మరి ఇంట్లోవాళ్ళకి ఏం వండి పెడుతుందో... ఎంత వండుతుందోగానీ...’

‘అయ్యో, ఒక్క కూరేనా... లీటర్‌ బాటిల్‌ నిండా మజ్జిగ తెస్తుంది... మధ్యమధ్యలో తాగడానికి. రాగి బాటిల్‌లోని నీళ్ళే తాగుతుంది. రోజుకో రకం పండు తెచ్చుకుని తింటుంది. అమ్మో... నిజంగా అలా తన గురించి అంత శ్రద్ధగా అన్నీ సర్దుకుని రావడం అంటే నిజంగా గ్రేట్‌.’

‘ఏంటి గ్రేట్‌...మనం ఎప్పుడైనా మన గురించి అంత శ్రద్ధ తీసుకుంటామా... మన పిల్లల గురించో శ్రీవారి గురించో... అంటే చేస్తాంగానీ మనకోసం ఎప్పుడైనా ఏదైనా చేసుకున్నామా..?’

‘నిజమే. నాకయితే పిల్లలూ మావారూ ఉంటేనే, వారికోసం అంటేనే, ఏమైనా చేయబుద్ధి అవుతుంది వారెటైనా వెళ్తే అసలు వంటే చేయను, ఏదో ఒకటి తినేస్తా.’

‘నేనూ అంతే... మనమంతా అంతే! ఇంట్లో కూడా ఇంట్లోవాళ్ళకి వడ్డించాక మిగులు తగులు చూసుకుని మనం తింటాం కదా... కానీ, సంగీత మాత్రం అలా కాదట... ఇంట్లో కూడా సుబ్బరంగా మొగుడూ పిల్లలతో సమానంగా కూర్చుని తినేస్తుందట. వాళ్ళింట్లో పనిమనిషే మా ఇంట్లోనూ చేస్తుంది... ఆమె చెప్పింది.’

‘మంచి ఇల్లాలు అంటే- ముందు పిల్లలూ భర్తా అత్తా మామా... అందరికీ పెట్టి తర్వాత ఉన్నదో లేనిదో తను గుట్టుచప్పుడు కాకుండా తినేసేయాలి. చిన్నప్పటి నుంచీ మన అమ్మా అమ్మమ్మా నాన్నమ్మా అందరూ అలాగే చేస్తున్నారుగా. కానీ, ఇలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు’ మంజరి గొంతు. ఇక ఆగలేక తలుపు తెరుచుకుంటూ లోనికి వెళ్ళింది సంగీత.

‘‘హాయ్‌ సంగీతా... ఇంకా రాకపోతే- నువ్వు రాలేదనుకున్నాం’’ అంది మంజరి.

‘‘కొంచెం అర్జంట్‌ వర్క్‌ ఉంటే అది పూర్తిచేసి వచ్చా’’ బాక్సు ఓపెన్‌ చేస్తూ అంది సంగీత.

అందరి కళ్ళూ ఆమె బ్యాగు నుంచి తీసే బాటిల్, పళ్ళూ, టిఫిన్‌ బాక్సూ, కూరగిన్నె మీద పడ్డాయి. అందరూ చూసీచూడనట్లుగా తనను చూస్తున్నారని సంగీతకు తెల్సు- అయినా ఏమీ పట్టించుకోకుండా నింపాదిగా తినడం మొదలుపెట్టింది. ‘‘కర్రీగానీ మజ్జిగా పళ్ళూగానీ ఎవరికైనా కావాలంటే తీసుకోండి’’ అంటూ బౌల్‌ టేబుల్‌పైన పెట్టింది. నానబెట్టిన బాదం కూడా అందరికీ ఒక్కొక్కటి ఇచ్చింది.

‘‘అబ్బా, నీకెంత ఓపిక సంగీతా... ఇవన్నీ సర్దుకోవడానికి. కనీసం పావుగంట పడుతుందా?’’ నర్మగర్భంగా లోలోపల నవ్వుతూ అంది మంజరి.

‘‘ఎంతయినా సంగీత గ్రేట్‌లే... ఎన్ని తిన్నా మళ్ళీ వాకింగ్, జాగింగ్, యోగా అంటూ స్లిమ్‌గా బాడీ మెయింటెయిన్‌ చేస్తుంది. అదే మనమూ ఉన్నాం ఎందుకూ... వట్టి ముద్దపప్పులం’’ వద్దన్నా అసూయ తొంగిచూసింది హేమ గొంతులో.

‘‘అంతేనా... సమాజసేవా కార్యక్రమాలంటూ మీటింగ్‌లకు కూడా వెళుతుందిగా... ఎంతైనా మెచ్చుకోవచ్చు’’ అంది ఉమ.

‘‘ఆఁ...ముందు ఇంటిని దిద్దుకుని బయట సేవకు వెళ్ళాలంటారు. ఆఫీసునుంచి చచ్చీ చెడీ ఇంటికెళ్ళాక- పిల్లలకీ ఇంట్లోవాళ్ళకీ కావల్సినవి చేస్తే చాలు... అన్ని సమాజ సేవల్లో పాలుపంచుకున్నట్లే.’’

‘‘నేను మాత్రం పిల్లలతోనే ఉంటా... నాకు మా పిల్లలు ప్రాణం. నేను లేకుండా ఉండలేరు. నాకే కార్యక్రమాలూ వద్దు. వాకింగ్‌లూ యోగాలూ చేసి మరో నాలుగేళ్ళు బతకాలనే ఆశ కూడా నాకు లేదు. ఆ టైమ్‌ కూడా పిల్లలకి ఇంకేదైనా తినడానికి తయారుచేయడానికో వారికి సంబంధించిన పనులు చూడటానికో కేటాయిస్తా.’’

‘‘నేనూ అంతే. స్వార్థం చూసుకోవడం నాకసలు ఇష్టముండదు’’ మంజుల అంది, నా స్వార్థం నేను ఎప్పుడూ చూసుకోను అన్నట్లు.

‘‘అయినా ఎవరి ఇష్టాలు వారివి’’ అంది రమణి.

‘‘ఇంతకీ హెల్త్‌ చెకప్‌కి వెళతానన్నావు... వెళ్ళావా ఉమా...’’ టాపిక్‌ భరించడం కష్టమై, మళ్ళించడానికి అన్నట్లు అంది సంగీత.

‘‘లేదు సంగీతా... ‘అన్ని పరీక్షలకూ కలిపి ఏడువేలే, వెళ్ళు’ అన్నావని... వెళదామనుకున్నా... కానీ, ఆ డబ్బు పెడితే- బాబు పుట్టినరోజుకి మంచి బహుమతి వస్తుందని ఆగిపోయా. 

నేను బాగానే ఉన్నాగా... వాళ్ళకి డబ్బులు తగలేసి, లేని అనుమానాలు ఎందుకు పెట్టుకోవాలి చెప్పు’’ అంది ఉమ.

‘‘నేను కూడా దానికి పెట్టే డబ్బులతో మా పాపకి మంచి డ్రెస్‌ వస్తుందని వెళ్ళలేదు. ఆ బహుమతి ఇస్తే వారి కళ్ళల్లో మెరిసే ఆనందం ముందు ఇంకేదైనా దిగదుడుపే...’’

‘‘మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు...ఆ డబ్బులు మన ఆరోగ్యం కోసం పెట్టడం తప్పా...’’ అంటూ సంగీత ఇంకేదో చెప్పబోతుండగా లంచ్‌ టైమ్‌ అయిపోవడంతో అంతా లేచారు.

* * *

‘‘హలో... ఆఁ చెప్పవే వేదా’’ అంది త్రైలోక్య సెల్‌ రింగ్‌ అవడంతో ఎత్తి తన ఫ్రెండ్‌ వేదతో.

‘‘త్రైలూ...మరే...మన మానసవాళ్ళ అమ్మ...’’ ఏడుపు గొంతుతో అంది వేద.

‘‘ఆంటీకి ఏమయ్యిందే... హాస్పిటల్‌లో ఉంది కదా...’’ అంది త్రైలోక్య.

వేద, త్రైలోక్య, మానస ముగ్గురూ మంచి స్నేహితురాళ్ళు.

‘‘మానసకు ఇక అమ్మ లేదే...’’ వేద ఏడుస్తూ అంది.

‘‘ఆఁ... మైగాడ్‌. అదేంటీ... నిన్న బానే ఉంది కదా... ఇప్పుడెక్కడున్నారు.’’ 

‘‘వాళ్ళింటికి తీసుకొచ్చారు. త్వరగా రా... మానస బాగా షాక్‌లో ఉంది’’ వేద పెట్టేసింది. త్రైలోక్య, సంగీతతో కలిసి వాళ్ళింటికి వెళ్ళింది. వీళ్ళను చూస్తూనే శోకదేవతలా ఉన్న మానస వారిని హత్తుకుని హృదయవిదారకంగా ఏడవసాగింది. ఆమెనూ ఆమె తమ్ముడినీ ఆపడం ఎవరి తరం కాలేదు. చూసినవాళ్ళందరికీ గుండెలు అవిసిపోయాయి. మానస తండ్రి- మానస చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి ప్రైవేట్‌ జాబ్‌ చేస్తూ, ఆ చిన్న జీతంతోనే మానసనూ ఆమె తమ్ముడినీ చదివిస్తోంది. గత కొంతకాలంగా ఆమె ఆరోగ్యం బాలేకపోవడంతో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటోంది. కొన్ని రోజులుగా మానస కాలేజీకి రాకుండా హాస్పిటల్‌లో ఉన్న అమ్మనే చూసుకుంటోంది. ఇప్పుడు హఠాత్తుగా ఈ విషాదవార్త.

పిల్లలు చిన్నవాళ్ళు కావడంతో వారికి ఏ విషయాలూ తెలీవు. మానస అమ్మమ్మా, మేనమామలు కూడా ఆర్థికంగా అంత ఉన్నవాళ్ళేం కాదు. దానితో అక్కడ కొంచెం పెద్దదిక్కుగా త్రైలోక్య తల్లీ తండ్రీ అయిన సంగీత, శ్రీనివాస్‌లే నిలబడ్డారు.‘‘అమ్మా, పాపం... వాళ్ళు పేదవాళ్ళమ్మా... ఇప్పటి కార్యక్రమానికి కూడా డబ్బులు ఉన్నాయో లేవో... ఎందుకంటే వాళ్ళమ్మ హాస్పిటల్‌లో ఉంటే మందులకూ, ఖర్చులకే డబ్బులు లేవని బాగా ఇబ్బందిపడింది మానస. మనం సాయం చేద్దామమ్మా...’’ మానస ఏడుపు తట్టుకోలేని త్రైలోక్య ఏడుస్తూ అంది సంగీతతో.‘‘నువ్వు చెప్పాలామ్మా... నాన్నా నేనూ చూసుకుంటాం, బాధపడకు...’’ సంగీత కూతుర్ని ఓదారుస్తూ అంది. మొత్తానికి సంగీత, శ్రీనివాస్, వేదా వాళ్ళ తల్లిదండ్రుల సాయంతో ఆరోజు కార్యక్రమం జరిగిపోయింది.

* * *

‘‘సంగీతకి ఉత్తమ మహిళ అవార్డు వచ్చిందట.’’

‘‘నేనూ విష్‌ చేశాను. అయినా రాదూ మరి, ఎప్పుడు చూసినా వాకింగ్, జాగింగ్, యోగా, సాహిత్యం, సమాజసేవ...అంటూ తిరగడమే తప్ప, పిల్లల గురించి ఎప్పుడైనా పట్టించుకుందా...’’

‘‘పిల్లల పుట్టినరోజుకు నేను ఖరీదైన గిఫ్ట్‌ ఇస్తే, తనేమో డబ్బులన్నీ హెల్త్‌చెకప్‌లకు ఖర్చుచేసి, ఏదో ఇంట్లో తనే తయారుచేసిన పుస్తకం ఇచ్చిందట.’’

‘‘ఎప్పుడూ తన స్వార్థం తనదే... ఆడతనం, అమ్మతనం ఆవగింజంతయినా లేదు.’’ 
‘‘వాళ్ళాయన కూడా ఆడంగి పనులన్నీ చేస్తూ ఆమెకి తందానతాన అంటుంటాడు. అయినా ఇల్లూ వాకిలీ పట్టని సంగీత లాంటి మనిషికి అవార్డు ఇవ్వడమేంటి?’’ ‘‘ఎందుకివ్వరు... సమాజసేవ అంటూ పిల్లల్ని దత్తత తీసుకోవడం, మురికివాడలు ఊడ్చడం, అవయవదానం, మహిళా సంఘాలంటూ తిరగడం... ఎన్ని లేవు. ఇవి చాలవూ తన పిల్లలకన్నా మంది పిల్లల్ని బాగా చూసుకున్న మహిళగా అందరి మన్ననలూ పొందడానికి?’’ ఎగతాళిగా అంది మంజరి. ‘‘మనకే గుర్తింపూ లేకపోతేనేం, మన పిల్లల సంతృప్తిముందు ఏ అవార్డు అయినా దిగదుడుపే అనిపిస్తుంది నాకు.’’


‘‘నిన్న మంత్రి చేతులమీదుగా అవార్డు తీసుకుందని ఈవేళ సాయంత్రం మన ఆఫీసులో ఆమెకు సన్మాన కార్యక్రమం. అందులో ఆమెను పరిచయంచేసే బాధ్యత నాకే ఇచ్చారు. పొగిడినట్టే పొగిడి తన స్వార్థబుద్ధిని బయటపెడతా చూడండి’’ మంజరి అంది అక్కసుగా. అది ఆఫీసులోని మహిళల గది. అందులోని వాళ్ళంతా రకరకాలుగా ఆమెకు గ్రీటింగ్స్‌ చెప్పినవాళ్ళే. సాయంత్రం బ్రాంచ్‌ మేనేజర్, పైఆఫీసు నుంచి విచ్చేసిన అధికారి, సంగీత కుటుంబసభ్యులు, ఆఫీసు స్టాఫ్, ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్, పత్రికా విలేకరుల మధ్య అభినందన సభ ఏర్పాటు చేయబడింది. జ్యోతి ప్రజ్వలన తర్వాత ఎజెండా ప్రకారం వేదికపైనున్న కుర్చీల్లో ఆసీనులైన పైఆఫీసు అధికారి, క్లబ్‌ సెక్రటరీ, బ్రాంచ్‌ మేనేజర్‌ల సందేశాలు అన్నీ అయ్యాయి. అందరూ ఆమెకు అవార్డు వచ్చినందుకు అభినందించి, ఆకాశానికి ఎత్తేశారు. ముఖ్య అతిథి అయిన జిల్లా కలెక్టర్‌ తదితరులందరూ కలిసి సంగీతను శాలువా, పూలమాల, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. మంజరి లేచింది. ‘‘అందరికీ నమస్కారం. అందరి అభినందనలూ అందుకున్న సంగీత, మా సహ ఉద్యోగిని అయినందుకు మేము గర్వపడుతున్నాం. అయితే, తను అందరు అమ్మల్లా కాకుండా సమాజసేవ, వ్యక్తిగత ఆరోగ్యం అంటూ పిల్లలకన్నా కుటుంబంకన్నా తన స్వార్థానికే ఎక్కువ శ్రద్ధా సమయం కేటాయిస్తారని ఒక విమర్శ. సభాముఖంగా అయితే అందరూ తన మనసులోని మాట వింటారని మాత్రమే ఇలా అడుగుతున్నా... ఈ విమర్శకు తన ప్రతిస్పందన తప్పక తెలియజేస్తారని ఆశిస్తున్నా.’’ సెగ రగిల్చి కూర్చుంది మంజరి. గుసగుసల మధ్య సంగీత లేచింది.సభ మొత్తం సూదిపడినా వినిపించేంత నిశ్శబ్దం. ఆమె జవాబుకోసం అందరూ చెవులు రిక్కించారు.

‘‘సభాసరస్వతికి మనసా శిరసా ప్రణామాలు. ఈ అవార్డు ఇచ్చి నా బాధ్యత మరింత పెంచిన ప్రభుత్వానికీ నన్నాదరించిన మీ అందరికీ నా వందనాలు. నా ప్రియనేస్తం చెప్పినట్లు నేను సమాజసేవకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. ‘కారంలేని కూరా ఆకారంలేని ఇల్లూ ప్రాకారంలేని కోటా ఓంకారంలేని మంత్రమూ చిత్తశుద్ధిలేని పూజా పరోపకారంలేని జీవితం నిరర్ధకం’ అంటారు. అందుకే అన్నింటికన్నా పరోపకారానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. ఇక నాకు వ్యక్తిగత స్వార్థం ఎక్కువ అన్నారు. అదీ నిజమే. కారణం... నాకు నా పిల్లలపైనా కుటుంబంపైనా ఉన్న అవ్యాజమైన అనురాగం.’’ సభికుల పెదాల చాటున నవ్వులు మొదలయ్యాయి. మంజరి వాళ్ళయితే బయటికే వంకర నవ్వు నవ్వారు.‘‘నిజమే... నిస్సందేహంగా పిల్లలపైన ప్రేమ ఉండే చేశాను. నాకు తెల్సు- నేను నా వ్యక్తిగత ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతున్నానని. దానికి కారణం...నా జీవితంలో నేను కలలో కూడా ఊహించని ఒక సంఘటన. అదేమిటంటే...ఆమధ్య నేను మావారి బలవంతంపై హెల్త్‌చెకప్‌కి వెళ్ళాను. దంపతులిద్దరూ ఒకేసారి చేయించుకుంటే కొంత తగ్గింపు ఉందనడంతో నేనూ వెళ్ళాను. అందులో నాకు క్యాన్సర్‌ ఉందని బయటపడింది. చాలా ఒత్తిడికి లోనయ్యాను. అక్కడ డాక్టర్‌ చెప్పిన విషయాలు నా మనస్సుని కదిలించి వేశాయి.

ప్రతి ఏడుగురు మహిళల్లో ఒకరికి క్యాన్సర్‌ ఉందీ అంటే... ఆ వ్యాధి ఎంత ఘోరంగా ప్రబలిందో అర్థంచేసుకోండి. అంతేకాదు, భారతీయ మహిళ కుటుంబం పట్ల చూపే శ్రద్ధలో ఆవగింజంత అయినా తన ఆరోగ్యం పట్ల చూపకపోవడం వల్ల... ప్రారంభ దశలో తెలుసుకోలేకా ముదిరిపోయిన తర్వాత ఏం చేయలేకా చాలామంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారట. ఒక్కోసారి క్యాన్సర్‌ అని తెలిసినా, ఆ వ్యాధి నివారణకు అయ్యే విపరీతమైన ఖర్చు భరించే స్థోమత లేక కొంతమందీ, సమాజం చూసే చిన్నచూపు భరించలేక బయటకు చెప్పుకోలేక కొంతమందీ... ఇలా రకరకాల కారణాల వల్ల చనిపోతున్నారట. అంతేకాదు, మరే ఇతర వ్యాధి అయినా ఒక టెస్ట్‌ చేస్తే బయటపడుతుంది. కానీ, ఈ క్యాన్సర్‌ మహమ్మారి మన శరీరంలో ఏ భాగానికైనా- అంటే- కాలేయానికీ గర్భాశయానికీ రొమ్ములకూ ఇలా ఏ భాగానికైనా రావచ్చు. అలా అని టెస్ట్‌లు అన్ని భాగాలకు చేయించలేము కూడా. పైగా ఇది నొప్పి ఏమీ లేకుండా, చిన్నగానే మొదలవుతుంది. దానితో దాని గురించి మనం అంతగా పట్టించుకోము. కొంచెం అనుమానం వచ్చి పరీక్ష చేయించుకునేసరికి నివారించలేనంతగా ప్రబలిపోతుంది. మన భారతదేశంలో ఏ తల్లినయినా తన ఆరోగ్యం గురించి పరీక్షలు చేయించుకోమంటే, దానికి బదులు ఆ డబ్బుతో పిల్లలకు ఏవైనా కొని ఇవ్వవచ్చు కదా అనే ఆలోచిస్తుంది కానీ, తాను ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలను ఎక్కువ కాలం జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంటుంది అని ఆలోచించదు. మనదేశంలో తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు జరిపే విధానం లేదు. కానీ, అదే కొన్ని దేశాల్లో- ఉదాహరణకు- ఆస్ట్రేలియానే తీసుకుంటే, అక్కడ రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోకుంటే ముందు ఆ హాస్పిటల్‌ నుంచీ, తర్వాత సిస్టర్, డాక్టర్‌ల నుంచీ ఫోన్‌ వస్తుంది. ఒకవేళ అప్పటికీ వెళ్ళకపోతే స్వయంగా ఇంటికే వచ్చి తీసుకెళ్ళి పరీక్షలు చేస్తారు. ఇక్కడ కూడా అలాంటి విధానం రావాలి. ప్రజల్లో వారి ఆరోగ్యం గురించిన శ్రద్ధ పెరగాలి. ఇప్పుడున్న పరిస్థితులపై అవగాహన రావాలి. అందుకే, నేను ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూనే, వారు చెప్పినట్లుగా యోగా, వాకింగ్, ఆహారపుటలవాట్లపైన శ్రద్ధ పెట్టాను. నేనొక్కదాన్నే కాదు, అందరికీ ఈ విషయాలు తెలియాలని దీనికి విస్తృత ప్రచారం కల్పించే కార్యక్రమంలో భాగంగా అన్నిచోట్లా ఈ విషయమై గణాంకాలతో సహా తెలిపే ‘మేల్కొలుపు’ క్లాసులు నిర్వహించాను. ప్రస్తుతం ఆ విధంగా నన్ను నేను కాపాడుకుని క్యాన్సర్‌ నుంచి విముక్తురాలినయ్యాను. నా కూతురి ఫ్రెండ్‌ మానస తల్లి ‘జయ’ కూడా అహర్నిశలూ పిల్లల గురించి ఆరాటపడుతూ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసింది. ఎంతగా అంటే- చెకప్‌ చేయించుకోవడానికి ఒక రెండువేలు పెట్టి హాస్పిటల్‌కి వెళ్ళమన్నా, ‘ఆ డబ్బులతో పిల్లలకు ఒక డ్రెస్‌ వస్తుంది, నా గురించి నేను అంత డబ్బు పెట్టుకోవడం అవసరమా’ అనేది. కానీ దురదృష్టం... ఒకసారి అనారోగ్యానికి గురైన ఆమెను నేను బలవంతాన హాస్పిటల్‌కి తీసుకెళితే డాక్టర్‌ ఆమెకు క్యాన్సర్‌ అనీ ఆలస్యం అయినందున నయం కాలేనంతగా ముదిరిందనీ చెప్పారు. ఇప్పుడు తల్లిని  కోల్పోయి వారెంత బాధపడుతున్నారు?

నిజంగా పిల్లలపైన ప్రేమ ఉండటం అంటే ఏమిటి? మనం బతికి అంటూ ఉంటే వారికి కొత్త డ్రెస్సులూ బహుమతులూ ఎన్నైనా కొనివ్వొచ్చు. అమ్మానాన్నలు కడదాకా ఆరోగ్యంగా ఉండి, తమ అనుభవంతో అడుగడుగునా అండదండగా ఉండటమే, పిల్లలకు వాళ్ళు ఇవ్వగలిగే వెలలేని నిజమైన బహుమతి. ఈ విషయాన్ని గుర్తించని ఎందరో ‘జయ’లు మన సమాజంలో నాకు కనిపించారు. ఆరోగ్యమైన ఆహారపుటలవాట్లతో వ్యాయామంతో అనారోగ్యాన్ని తరిమివేయవచ్చు. తల్లిలేనివారికే ఆ లోటు ఎంతటిదో తెలుస్తుంది. నేనూ అలా తల్లిలేని బిడ్డనే. మా అమ్మ నా చిన్నప్పుడే అనారోగ్యంతో చనిపోయింది. అందుకే ఏ బిడ్డా అనారోగ్యంతో తల్లిని కోల్పోకూడదు అనిపించి, ఆ దిశగా నేను నడుస్తూ, అందర్నీ చైతన్యవంతం చేస్తున్నాను. ఇందులో నా భర్తా, పిల్లల సహకారం సంపూర్ణంగా ఉంది. మిగతావాళ్ళెవరేమనుకున్నా నాకేమీ బాధలేదు. సభాముఖంగా నా వినతి ఏమిటంటే...మీ పిల్లల పైన నిజంగా ప్రేమే ఉంటే, తల్లిదండ్రులూ... దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అర్థంలేని త్యాగం పేరుతో అర్ధాయుష్కులై వారికి దూరం కాకండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలతో...’’ రెండు చేతులూ జోడించిన ఆమెపై చప్పట్ల జడివాన కురిసింది. కన్నీళ్ళను ఆపుకోలేని త్రైలోక్య, మానస వేదికపైకి పరుగున వచ్చి ఆమెను హత్తుకున్నారు.అందరికన్నా ముందు నిల్చుని మరీ కళ్ళనిండా నీళ్ళతో ఆపకుండా చప్పట్లు కొడుతూనే ఉందో మహిళా బృందం... వారు మరెవరో కాదు, ఇంతకాలం సంగీతను హేళనచేస్తూ మాట్లాడిన తోటి మహిళా ఉద్యోగినులు. 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.