close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అస్తిత్వ వేదనలు

తరతరాల వ్యథార్థ భరిత చరిత్ర శకలాలను సహజంగా చిత్రించిన 23 కథల సంకలనం ‘మడినారు’. వీటిని చదివితే మలయాళ సాహిత్యంలో ముఖ్యధారగా ఉన్న దళిత సాహిత్యపు తీరు స్థూలంగా బోధపడుతుంది. కేరళ రాష్ట్రానికి చెందిన దళితుల నిర్దిష్ట సమస్యలను చెబుతూనే ప్రాంతాలకు అతీతమైన జీవన దృశ్యాలను ఈ కథలు ప్రతిబింబించాయి. మతం మారినా వివక్ష మారని తీరు కొన్ని కథల్లో కనిపిస్తుంది. అనూహ్య మలుపులతో విషాదాంతమైన తల్లీ కొడుకుల పాత్రలు వేర్వేరు కథల్లో పాఠకులను వెంటాడతాయి. ‘మడి నారు’ కథలో పేద దళితుడు సొంతంగా పొలం కొని సేద్యం చేయాలనే కోరిక నెరవేర్చుకోవటానికి నిజంగానే పితృదేవతలు దిగిరావాల్సివచ్చింది. దాదాపు అన్ని కథలూ ఆసక్తికరంగా ఉన్నాయి. అనువాదం సరళంగా, పఠనీయంగా ఉంది.

    - సీహెచ్‌.వేణు

మడినారు (మలయాళ దళిత కథలు)
తెలుగుసేత: ఎల్‌.ఆర్‌.స్వామి
పేజీలు: 137; వెల: రూ.120
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు


ఆదర్శాలూ అనుబంధాలూ

మురళి, రాహుల్‌, ప్రశాంత్‌, నిఖిల్‌, దివ్య, సాహితి... ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. రైల్లో అడుక్కుంటున్న మురళిని ఓ పెద్దమనిషి  తాను నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో చేర్పిస్తాడు. కష్టపడి చదివి ప్రయోజకుడైన మురళి అమెరికా వెళ్తాడు. అనాథాశ్రమం కోసం ఎంతో కష్టపడతాడు. స్నేహితులైన రాహుల్‌ తదితరులకు స్ఫూర్తినిస్తాడు. అందరూ కలిసి స్వదేశానికి తిరిగి వచ్చి ఏం చేశారన్నదే కథ. ఎప్పుడూ తనని ఏడ్పించే మేనత్త కొడుకు రాహుల్‌ అంటే దివ్యకి కోపం. భార్యాభర్తల బంధం చక్కటి యుగళగీతంలా సాగాలి కానీ భర్తకి భార్య సబార్డినేట్‌ కాదంటుంది దివ్య. వారిద్దరి ప్రేమ నేపథ్యంలో మూడుతరాల దంపతుల స్వభావాలను కథాగమనంలో ఇమిడేలా చక్కగా విశ్లేషించారు రచయిత్రి. ‘జీవితాన్ని అందంగా మలచుకోవడం మన చేతుల్లోనే ఉంద’ని అంతర్లీనంగా సాగే సూక్తితో ఆసక్తిగా చదివిస్తుందీ నవల.

   -పద్మ

జీవితం అందమైనది(నవల)
రచన: పెబ్బిలి హైమావతి
పేజీలు: 276: వెల: రూ. 200
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


కుటుంబవ్యాపార రాజ్యాంగం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కుటుంబ వ్యాపారాలది కీలక పాత్ర. ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో 34శాతం కుటుంబవ్యాపారాలే. కుటుంబేతర వ్యాపారాల కన్నా లాభసాటిగా ఉన్న వీటి నిర్వహణ అంత తేలికేమీ కాదు. అనుబంధాల్ని కాపాడుకుంటూ వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించటం కత్తిమీద సామే. ముఖ్యంగా వారసత్వ ప్రణాళికా, వ్యాపార వాటాల పంపకమూ చాలా క్లిష్టమైనవి అంటారు రచయిత. అందుకని సమస్యలు తలెత్తక ముందే పరిష్కారాలను పాలసీల రూపంలో తయారుచేసి పెట్టుకోవాలనీ అదే కుటుంబ రాజ్యాంగపత్రం అనీ, దాన్ని అనుసరిస్తే ఎన్నితరాలైనా కుటుంబవ్యాపారాలను విజయవంతంగా నడిపించవచ్చనీ అంటున్నారు. జీఎంఆర్‌ కుటుంబ రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర వహించిన రచయిత రాసిన ఈ పుస్తకం చిన్న, మధ్యతరగతి కుటుంబ వ్యాపారులకు ఎంతో ఉపయోగకరం.

- శ్రీ

కుటుంబ వ్యాపారాలు
తరతరాలుగా కొనసాగడానికి విజయసూత్రాలు
రచన: ఎస్‌.వి.మల్లేశ్వర శాస్త్రి
పేజీలు: 192: వెల: రూ.150/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


అష్టవిధనాయికలు ఆధునికంగా..!

పద్యాలనగానే పారిపోయేవారికి వాటి సొగసుల్ని చవిచూపే రచన ఇది. ఇదివరకే జడ పద్యాలూ, చీర పద్యాలూ వెలువరించిన రచయిత్రి జ్యోతి వలబోజు మరో ప్రయోగం ఇది. కావ్యాలూ, పురాణాలూ, నాట్య, అలంకారశాస్త్రాల్లో చెప్పిన అష్టవిధనాయికలపైన 67 మంది కవులు రాసిన అపురూప పద్యాల సంకలనమిది. పద్యాల నడక పాతదే కావొచ్చుకానీ వాటి వెనకున్న ఆలోచనలు చాలావరకూ కొత్తవే. మరీ సంస్కృత భూయిష్టంగా, తలతిరిగే దీర్ఘ సమాసాలతో కాకుండా సరళమైన పదాలతో సాగే పద్యాలివి. ఛందస్సు చట్రంలోనే ‘అతడు రమ్మనియెను ఐమాక్సుహాలుకి/తాను లేడు సరియ- ఫోను ఆఫు/వెర్రిదాననేను విప్రలబ్ధగనైతి/ పురుషులందు లేరు పుణ్యులెవరు’(బ్నిం) అంటూ సాగే పద్యాలు ఇందులో చాలానే ఉన్నాయి!

-అంకిత

అష్టవిధ నాయికలు (67మంది పద్యకవుల సంకలనం)
పరిష్కర్త: కంది శంకరయ్య
పేజీలు: 224: వెల: రూ.150/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు