close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వివేకి

- కారంపూడి వెంకట రామదాస్‌

వాట్సాప్‌లో వచ్చిన ఫొటోలు చూసి మృదుల భయంతో వణికిపోతూ ఫోన్‌ని అప్రయత్నంగా దూరంగా విసిరికొట్టింది. ఫోనులో దృశ్యాలు గిర్రున మెదడులో గింగిర్లు తిరుగుతుంటే ఆమె మనసు తీవ్రంగా కలత చెందింది. నిమిషాల్లో ఆమె మొహం ఎర్రగా కందిపోయింది. అసలే మృదుస్వభావి అయిన ఆమె, ఆ సంఘటన రేపిన అలజడికి, భయాందోళనలతో చివురుటాకులా వణికిపోయింది. మెదడు మొద్దుబారిపోయి  చాలాసేపు అలాగే ఉండిపోయింది. అసలు తాను చూసింది కలో నిజమో తెలీని ఓ అనిశ్చిత పరిస్థితికి లోనైంది. ఆమెని ఇంత మనోవేదనకి గురిచేసిన ఆ ఫొటోలు ఏమిటంటే... అవి మృదుల అర్ధనగ్న చిత్రాలు! జుగుప్సాకరమైన ఆ చిత్రాలని పంపింది ఆమె స్నేహితుడు మహేష్‌!
మృదుల ఎంతసేపు అలా చేష్టలుడిగి కూర్చుందో తెలీదు. కరిగిపోయిన గంటలు ఆమె బాధని కాసింత తగ్గిస్తే, ఆమె మెదడు మెల్లగా మేలుకుంది. ఇంగితం- జరుగుతోంది వాస్తవమే, దానిని ఎదుర్కోక తప్పదని కర్తవ్య భోదచేసింది. ఆరోజు మధ్యాహ్నం నుండి ఫోనులో వాట్సాప్‌ మెసేజెస్‌ చూడలేదు. సాయంత్రం కాలేజీ నుండి వచ్చింది మొదలు, రాత్రి భోజనం ముగించే వరకూ అమ్మా, నాన్నా, అన్నలతో ఎప్పట్లానే సరదాగా గడిపి హుషారుగా తన గదికి వచ్చింది. అప్పుడు తీరిగ్గా ఫోనుతీస్తే నోటిఫికేషన్స్‌లో చాలా వాట్సాప్‌ అన్‌రెడ్‌ మెసేజెస్‌ కనబడ్డాయి. వాట్సాప్‌ ఓపెన్‌ చేసి ఒక్కొక్క మెసేజ్‌ చూసుకుంటూ వచ్చిన మృదులకు, తన ఫ్రెండ్‌ మహేష్‌ షేర్‌ చేసిన కొన్ని ఫొటోలు డౌన్‌లోడ్‌కి సిద్ధంగా కనబడ్డాయి. వెంటనే ఉత్సాహంగా ఆ ఫొటోలపై క్లిక్‌ చేయగానే ఒకటి తరువాత ఒకటి డౌన్‌లోడ్‌ అవుతుంటే వాటిని చూసిన ఆమె దిగ్భ్రాంతికి గురైంది.
నిజానికి మృదుల సగటు యువతుల్లా బేల కాదు. విద్య వల్ల ఆమెకి వినయం అబ్బింది. తోటి మనిషికీ, కాలానికీ విలువనిచ్చే సుజ్ఞానవంతురాలామె. పిరికితనం ఎరుగని మృదు గంభీర స్వభావి. అందుకే అంత కష్టంలోనూ ఒక్క కన్నీటి బొట్టునీ చిందించలేదు. ఊహించని విధంగా ఎదురైన ఈ సమస్యకి మొదట కొంత కలత చెందినా, ధైర్యాన్ని కూడ తీసుకుని మున్ముందు ఏం చెయ్యాలనే ఆవేశరహితమైన ఆలోచనలకి తెరలేపింది.
వివేకం మేలుకొనే సరికి, విసిరేసిన ఫోన్‌ని  తిరిగి తీసుకుని మహేష్‌ పంపిన ఫొటోలు వచ్చిన సమయం కేసి దృష్టిసారించింది. సాయంత్రం నాలుగూయాభైకి వచ్చాయి. మృదుల తీవ్రంగా ఆలోచిస్తోంది...
‘మహేష్‌ ఏంటీ... ఇలాంటి ఫొటోలు పంపడమేంటీ? తనకేకాక మొత్తం కుటుంబానికి స్కూల్‌ రోజుల్లోనుండి తెలిసిన పక్కింటి అబ్బాయి మహేష్‌! ఇరు కుటుంబాల మధ్యా సాన్నిహిత్యం ఉంది. తన అన్న వంశీ, మహేష్‌ చాలా కాలంగా మిత్రులు. ఒకరింటికి ఒకరు వచ్చిపోతుంటారు. ఆ మాటకొస్తే తమ మధ్య కూడా మంచి స్నేహమే ఉంది. మంచివాడనే భావనతో మహేష్‌తో చనువుగా ఉంటోంది. అలాంటి మహేష్‌ అనూహ్యంగా, ఇలాంటి చిత్రాలు పంపడమేంటీ? అసలు ఇలాంటి చిత్రాలు మహేష్‌కి ఎలా వచ్చాయి? తానెప్పుడూ మహేష్‌తో మితిమీరి ప్రవర్తించలేదే. అసలు తమ మధ్య ఎలాంటి ప్రేమా లేదు. అలాంటిది అసభ్యకరమైన తన చిత్రాలని ఎలా సంపాదించాడు?
మృదులకి ఏదో అనుమానం వచ్చింది. ఇష్టం లేకపోయినా మహేష్‌ పంపిన ఫొటోలని గమనించింది. కాస్త జాగ్రత్తగా ఆ చిత్రాలని చూసిన ఆమెకి అవి నిజమైన ఫోటోలు కావు, మార్ఫింగ్‌ చేసినవని స్పష్టంగా అర్థమైపోయింది. అయితే, మహేష్‌ ఈ ఫొటోలని పంపడంలోని ఉద్దేశం ఏంటో అర్థంకాలేదు.
నిజానికి మృదుల కుటుంబం ఎంత పరువు ప్రతిష్ఠలు గలదో, మహేష్‌దీ అంతే గౌరవప్రదమైన కుటుంబం. మహేష్‌ తల్లి పార్వతీదేవి పోలీసుశాఖలో ఐ.పి.ఎస్‌. కేడర్లో ఈ మధ్యే రిటైరయిన అధికారిణి. నాలుగేళ్ల క్రితం అదే శాఖలో సేవలందిస్తూ ఆమె భర్త అకాలమరణం చెందాడు. మంచి విలువలతో మహేష్‌ని తల్లే పెంచింది. మృదుల తల్లిదండ్రులెప్పుడూ మహేష్‌ రాకపోకలకి అడ్డుచెప్పక పోవడానికి అదే కారణం.
మహేష్‌ సౌమ్యుడూ, మితభాషిగా మృదులకి తెలుసు. అలాంటి అతడిలో సగటు మగాడు దాగున్నాడా? ఇదే మహేష్‌ అసలు రూపమా? ఇది తాను ఇప్పటివరకూ గ్రహించలేకపోయిందా? అసలు మహేష్‌ ఏం ఆశించి ఈ పని చేశాడు. అతడిని రెచ్చగొట్టే విధంగా తను ఏనాడూ ప్రవర్తించలేదే! కనీసం అతడిష్టమన్న సంకేతాలూ ఎప్పుడూ ఇవ్వలేదు. అతడూ ఏనాడూ ప్రేమ ప్రస్తావన తన వద్ద తీసుకురాలేదు. మరిప్పుడు ఒక్కసారిగా ఈ పని చేసి ఏం పొందాలనుకుంటున్నాడు? ఈ అశ్లీల చిత్రాల ఆధారంగా తనని బలవంతంగా ప్రేమలోకి దించాలనుకుంటున్నాడా? డబ్బుకోసమా? లేకా తన శరీరంపై అతడికున్న ఏహ్యమైన కోరికా? ఎంత ఆలోచించినా మహేష్‌ అంతర్గతం అంతుపట్టలేదు మృదులకి.
గందరగోళ ఆలోచనలు మృదులని అలుముకున్నాయి. ఇప్పుడు ఈ విషయం తల్లిదండ్రులకి చెప్పాలా...? లేక తిన్నగా పోలీసుల దృష్టికే తీసుకెళ్లాలా...? చూసీ చూడనట్టు ఊరుకుంటే మహేష్‌ మరింత రెచ్చిపోతే, సమస్య మరింత జటిలమౌతుంది. మరి తన ముందున్న దారి ఏది? మహేష్‌ కోసం కాకపోయినా వారి కుటుంబ పరువు ప్రతిష్ఠల కోసమైనా అతడికి ఒక్క అవకాశమివ్వాలి. మహేష్‌ ఉద్దేశం తెలుసుకోవాలి. వివేకంతో ఆలోచించితే ఇదే సరైన నిర్ణయమనిపించింది. అంతే ఒక స్థిర నిర్ణయానికొచ్చి, మనసులోని గజిబిజి ఆలోచనలకి స్వస్తి చెప్పింది.

*      *     *

మృదుల తనని అంత అర్జంటుగా అదీ ఒంటరిగా పార్కులో ఎందుకు కలవమందో పార్వతీదేవికి అర్థంకాలేదు. మృదులంటే ఆమెకి చాలా ఇష్టం, అభిమానం. మృదుల ఆమె ఎదుటే పెరిగి పెద్దదైంది. చదువే కాదు వినయం, విధేయత, ఓర్పూలాంటి లక్షణాలన్నీ ఉన్న పిల్లని పార్వతీదేవికి స్థిరమైన అభిప్రాయం. తమ ఇంటికి స్వేచ్ఛగా ఎప్పుడూ వస్తూ పోతూ ‘ఆంటీ... ఆంటీ’ అంటూ తనచుట్టూ తిరుగుతుంటుంది. ఉన్నట్టుండి మృదుల తనని ఎందుకు కలవమందీ... అదీ బయట పార్కులో...? ఎంత ఆలోచించినా అర్థంకాలేదు ఆమెకి.
మరో గంటలో పార్వతీదేవి- మృదులలు పార్కులో కలుసుకున్నారు. ఓమూల పెద్దగా జనసంచారంలేని ఓ బెంచీ చూసుకుని ఇద్దరూ కూర్చున్నారు.
‘‘ఆఁ... మృదులా ఏంటి ఇలా కలవమన్నావు? ఏదైనా బలమైన కారణమా?  అంతా బాగానే ఉన్నారుగా...?’’ కొంచెం అనుమానంతో అడిగింది పార్వతీదేవి.
‘‘చాలా సీరియస్‌ మేటర్‌ ఆంటీ...! నా నోటితో చెప్పలేను. మీరే చూడండి!’’ అంటూ ఫోన్లో ఫొటోలని చూపిస్తూ ఉపోద్ఘాతం లేకుండా తిన్నగా విషయంలోకి వచ్చింది మృదుల.
మృదుల చూపించిన ఫొటోలు చూసి విస్తుపోయింది పార్వతీదేవి. ఆ ఫొటోలు చూడలేక సిగ్గుతో ఫోన్‌ మృదులకి తిరిగిచ్చి ఎరుపెక్కిన మొహంతో కాసేపు ఏమీ మాట్లాడలేదు.
‘‘మహేష్‌ ఇలాంటి పని చేస్తాడనుకోలేదు ఆంటీ’’ మౌనాన్ని బ్రేక్‌ చేస్తూ అంది మృదుల.
మృదుల మాటల్ని ఖండించడానికి పార్వతీదేవి వద్ద సమాధానం లేదు. కొడుకు చేసిన నిర్వాకం ఎదుట ప్రత్యక్షంగా కనబడుతుంటే ఇక ఏం మాట్లాడగలదు?
‘‘చూశానమ్మా... మహేష్‌ చేసింది చిన్న తప్పుకాదు. ఏ శిక్షకైనా అర్హమైన పని చేశాడు. ఏం చెయ్యమంటావో, ఏ శిక్షవేయమంటావో నువ్వే చెప్పు’’ అతి కష్టంమీద వచ్చాయి ఈ మాటలు పార్వతీదేవి నోట.
‘‘నేను, మహేష్‌ని శిక్షించమని అడిగేందుకు రాలేదాంటీ. మీమీద ఉన్న గౌరవంతో ఇంట్లో కూడా ఏమీ చెప్పకుండా తిన్నగా మీతోనే చెప్పా. లేకపోతే ఇప్పటికే ఈ విషయం పోలీసుస్టేషన్‌ గడపతొక్కేది. ఓ తల్లిగా మీరు మీ కొడుకు మనోగతం తెలుసుకోవడంలో విఫలమైనా, ఓ పోలీసు ఉద్యోగం చేసి రిటైరయిన అనుభవంతో మీ అబ్బాయి అసలెందుకు ఈ పని చేశాడో ఈజీగా అరాతీయగలరనే, విషయం మీ దృష్టికి తీసుకొచ్చా. నేను ఇప్పటికీ మహేష్‌ ఈ తప్పు చేశాడంటే నమ్మలేకపోతున్నా. పొరపాటున మీ అబ్బాయి ఈ తప్పు చేసుంటే ఇకపై ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా అదుపులో పెట్టగలరనే నమ్మకంతో మీ దృష్టికి తీసుకొచ్చా.’’
పార్వతీదేవి బాగా ఆలోచించింది. వెంటనే- ‘‘మంచిపని చేశావు మృదులా! నేను నీకు హామీ ఇస్తున్నా. మహేష్‌ నుండి మళ్లీ ఇలాంటి సమస్య నీకు తలెత్తదు. అంతే కాదు ఇప్పుడు జరిగినదానికి కూడా నీకు న్యాయం చేస్తా. నన్ను నమ్ము’’ అంది.
అయితే మనసులో తన కొడుకుపై నమ్మకాన్ని కోల్పోలేదు పార్వతీదేవి. మహేషే ఈ పని చేసుంటే కొడుకైనా క్షమించకూడదనుకుంది. ఈ విషయంలో నిజానిజాలు తేలవలసిందే అని స్థిరంగా అనుకుంది.
‘‘మృదులా, ఆ ఫొటోలని నా ఫోన్‌కి ఫార్వర్డ్‌ చెయ్యి’’ అంది పార్వతీదేవి. వెంటనే మృదుల, ఫొటోలని ఫార్వర్డ్‌ చేసింది.

*      *     *

‘‘మేడమ్‌... మీరు ఇలా...?’’ ఆశ్చర్యానందాలతో అన్నాడు బయటకి వెళ్లబోతున్న ఎస్‌ఐ వేణు, ఉన్నట్టుండి సైబర్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమైన పార్వతీదేవిని చూస్తూ.
‘‘ఆఁ వేణూ, ఓ పని మీద వచ్చాను. నీతో మాట్లాడాలి’’ అంది పార్వతీదేవి.
ఏవో రిటైర్‌మెంట్‌కి సంబంధించిన పేపర్స్‌ కోసం అనుకుని ‘‘రండి, కూర్చుని మాట్లాడుకుందాం’’ అన్నాడు వేణు.
ఇద్దరూ వేణు కేబిన్‌కి వెళ్లి కూర్చున్నారు. ‘‘ఇప్పుడు చెప్పండి మేడమ్‌ ఏ పని మీదొచ్చారు’’ డైరెక్టుగా సబ్జెక్టులోకి వస్తూ అడిగాడు వేణు.
‘‘చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్‌. ఇష్యూ మీడియా వరకూ వెళ్లకుండా సాల్వ్‌ చేస్తావని నీతో మాట్లాడ్డానికి వచ్చా’’ అంటూ జరిగింది చెప్పి ఫొటోలు వేణూకి చూపించింది.
‘‘డోంట్‌ వర్రీ మేడమ్‌... ఇప్పుడే దీని సంగతేంటో తేలుద్దాం’’ అంటూ వేణు, తక్షణం ఏఎస్‌ఐ కమ్‌ కంప్యూటర్‌ ఎక్స్‌పర్ట్‌ ప్రదీప్‌కి ఫోన్‌ చేసి రమ్మన్నాడు.
ప్రదీప్‌ వస్తూనే పార్వతీదేవికి నమస్కరించాడు. వెంటనే, ‘‘సార్‌... రమ్మన్నారూ...?’’ అన్నాడు వేణూని ఉద్దేశించి.
పార్వతీదేవి ఫోనులోని ఫొటోలని ప్రదీప్‌కి చూపించి- ‘‘వీటిని నీ కంప్యూటర్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకుని ఎవరు క్రియేట్‌ చేశారో ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడు’’ అంటూ ఫొటోలు చూపించాడు వేణు. ప్రదీప్‌ అక్కడికక్కడే పార్వతీదేవి ఫోనులోని ఫొటోలని తన ఫోనులోకి పార్వర్డ్‌ చేసుకుని కంప్యూటర్‌ రూమ్‌వైపు తిరిగి వెళ్లిపోయాడు.
గంట గడవక ముందే ప్రదీప్‌ అక్కడికి తిరిగి వచ్చీ-
‘‘సార్‌... ఈ ఫొటోలు మార్ఫింగ్‌ ఎవరు చేశారో తెలిసిపోయింది’’ అని చెప్పాడు
‘‘వాట్‌... ఇంత తక్కువ టైంలో తప్పుచేసిందెవరో తెలుసుకున్నావా...? వెరీ ఫాస్ట్‌... ఇంతకీ ఎలా పట్టుకున్నావ్‌...?’’ అంటూ చాలా ఉత్సాహంగా అడిగాడు వేణు. పార్వతీదేవి కూడా చాలా ఆతృతతో ప్రదీప్‌ రిప్లై కోసం ఎదురుచూసింది.
‘‘వెరీ సింపుల్‌ సార్‌... నా కంప్యూటర్‌లో ఫొటోలు లోడ్‌ చేసి జూమ్‌ చేసి అన్ని కోణాలలో పరిశీలించాను. చాలా జాగ్రత్తగా చూస్తే ఫొటోల కింది భాగంలో చిన్న వాటర్‌ మార్కుతో ఆ ఫొటోలు ఏ ఆప్‌లో క్రియేట్‌ చేశారో ఆ కంపెనీ పేరు ఉంది. వెంటనే ఆ కంపెనీ డీటైల్స్‌ గూగుల్లో సెర్చ్‌ చేసి వాళ్ల ఫోన్‌ నంబర్‌ పట్టుకున్నాను. వాళ్లతో సైబర్‌ పోలీస్‌స్టేషన్‌ నుండి మాట్లాడుతున్నానని చెప్పి గత నెలరోజుల్లో వాళ్ల ఆప్‌ మన సిటీనుండి ఎవరెవరు డౌన్‌లోడ్‌ చేసుకున్నారో వాళ్ల ఐ.పి అడ్రస్‌లు అడిగాను. ఆ లిస్ట్‌ పావుగంటలో వాళ్లు నాకు వాట్సాప్‌ చేశారు. ఆ ఆప్‌ అంత పేరున్నది కాకపోవడంతో ఓ పది డౌన్‌లోడ్స్‌ మాత్రమే మన సిటీలో జరిగాయి. ఆ ఐ.పి. అడ్రస్‌లు ఇవే! నెట్‌వర్క్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ని కాంటాక్ట్‌ చేస్తే ఈ ఐ.పి అడ్రస్‌లు ఎవరివో పూర్తి చిరునామాలతో సహా తెలిసిపోతుంది’’ అంటూ ఐ.పి. అడ్రస్‌ల లిస్ట్‌ వేణు చేతిలో ఉంచాడు ప్రదీప్‌.
‘‘వెరీ స్మార్ట్‌ వర్క్‌. ఐ విల్‌ టేక్‌ కేర్‌ ఫరదర్‌ ఇన్‌ దిస్‌ మేటర్‌. యూకెన్‌గో...’’ అన్నాడు వేణు, ప్రదీప్‌తో.

‘‘మేడమ్‌! ఐ.పి అడ్రస్‌లు దొరికాయి కాబట్టి ఇక దోషిని పట్టుకోవడం నల్లేరు మీద నడకే...!’’
‘‘యస్‌... ఇంత ఈజీగా పనవుతుందని ఊహించలేదు. ఇక ఆ అడ్రస్‌లు ఎవరివో ఆరాతీయి వేణూ’’ అంది పార్వతీదేవి.
ఒక్క అరగంటలో సంబంధిత నెట్‌వర్క్‌ ప్రొవైడర్స్‌ ఒక్కొక్కరికీ కాల్‌ చేసి పది అడ్రస్‌లూ పూర్తి వివరాలతో సేకరించి పార్వతీదేవి ముందుంచాడు వేణు.
పార్వతీదేవి ఆతృతగా ఒక్కొక్క అడ్రస్‌ నిశితంగా పరిశీలించింది. ఒక ఐ.పి నంబర్‌ వివరాల దగ్గర ఆమె కళ్లు నిలిచాయి. ఆమె భృకుటి ముడిపడింది. నమ్మలేనంత ఆశ్చర్యానికి లోనైంది. వెంటనే ఆమె మెదడు తీవ్రంగా ఆలోచించింది. ‘‘యస్‌... ఐ గాటిట్‌!’’ అని అప్రయత్నంగా బయటకంది.
‘‘మేడమ్‌... హోప్‌ యువర్‌ ప్రాబ్లమ్‌ ఈజ్‌ సాల్వ్‌డ్‌’’ అన్నాడు వేణు.
‘యస్‌... థాంక్స్‌ ఏ లాట్‌. చిక్కుముడి విడిపోయింది. ఇక నేను చూసుకుంటా’’ అంటూ పార్వతీదేవి బయటకి నడిచింది.

*    *     *

మృదుల ఆలోచిస్తోంది... ఆంటీ తననెందుకు పార్కులో కలవమందీ? మహేష్‌ తన తప్పు అంగీకరించాడా? సారీ చెప్పించడానికి రమ్మన్నారా? మహేష్‌కి తనని సూటిగా చూసే ధైర్యం ఉందా? మనసు పరిపరివిధాల ఆలోచిస్తోంది. చేసిన తప్పుకి తలవంచుకుని పశ్చాతాపంతో చిన్నబోయిన మహేష్‌ ముఖం ఆమె కళ్లముందు కదిలింది.
సాయంత్రం ఆరు దాటి అప్పుడప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి. మృదుల పార్క్‌కి వచ్చే సరికే పార్వతీదేవి ఓ బెంచీపై కూర్చుని ఉంది. ఆ పక్కనే వెనుకకి తిరిగి చేతులు కట్టుకుని నిలబడ్డ వ్యక్తిని మహేష్‌గా గుర్తించింది.
‘‘రా మృదులా... నీకిచ్చిన మాట ప్రకారం నీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన అబ్బాయిని నీ ముందు నిలబెట్టా. మొహం చెల్లక వెనక్కి తిరిగి తలవంచుకుని ఉన్నాడు. నువ్వే చూడు’’ అంటూ ఆ అబ్బాయి భుజం పట్టుకుని ముందుకి తిప్పింది పార్వతీదేవి.
ఎదుట నిలబడ్డ వ్యక్తిని చూసి షాక్‌తింది మృదుల. కలలో కూడా ఊహించని వ్యక్తి ఎదుట దోషిగా తలదించుకుని కనబడేసరికి ఆమెకి పూర్తిగా మతిపోయింది. అక్కడ వీస్తున్న గాలీ, ఎగురుతున్న పక్షులూ, కనువిందు చేస్తున్న సాయంసంధ్యా ఒక్కసారిగా ఆగిపోయి నిశ్చలంగా నిలిచిపోయినట్లైంది ఆమెకి. అంతటి కుదుపుకి కారణమైన ఆ వ్యక్తి మరెవరో కాదు... వంశీ!
‘‘నమ్మలేకపోతున్నా ఆంటీ... నా అన్నేంటి... ఈ పని చేయడమేంటి?’’ అంది మృదుల ఏమీ అర్థంకాక.
‘‘నువ్వే కాదు, నేనూ ఇప్పటికీ నమ్మలేక పోతున్నా. అసలు జరిగింది చెబుతా విను.’’

*       *          *

వేణూ చూపించిన ఐ.పి అడ్రస్‌లలో ‘ఎన్‌.వంశీ, సన్‌ ఆఫ్‌...’ అంటూ ఉన్న ఆ పూర్తి అడ్రస్‌ చూసి పార్వతీదేవి అదిరిపడింది. ఆలోచించగా ఈ ఫొటోలు క్రియేట్‌ చేసింది వంశీ అని గ్రహించింది. వెంటనే వంశీకి ఫోన్‌ చేసి తనని తక్షణం ఇంటి దగ్గర కలవమంది.
‘‘ఏమైంది ఆంటీ...! ఎందుకు అంత అర్జంటుగా నన్ను కలవమన్నారూ...?’’ కొంచెం తడబడుతూ అడిగాడు పార్వతీదేవి ఇంటికొచ్చిన వంశీ.
‘‘కూర్చో... వంశీ!’’ అంటూ కుర్చీ చూపించింది. ఇబ్బందిగా కుర్చీలో కూర్చున్నాడు వంశీ.
‘‘వంశీ... నాకు మహేష్‌ ఎంతో నువ్వూ అంతే. అందుకే నీ శ్రేయస్సుకోరి అడుగుతున్నా ఏదీ దాచకుండా చెప్పు. ఈ పని చేసింది నువ్వేగా’’ అంటూ ఫొటోలు చూపించింది.
ఒక్కసారిగా హతాశుడయ్యాడు వంశీ. ఎదుట ఉన్నది క్రైం బ్రాంచ్‌ ఐ.పి.ఎస్‌ అధికారిణి. ఆమెకి అంతా తెలిసిపోయిందని గ్రహించాడు. ఆమె పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడ్చేశాడు.
వంశీని లేవదీసి హృదయానికి హత్తుకుని కన్నీళ్లు తుడిచింది పార్వతీదేవి. ఈ చర్యకి మరింత కరిగిపోయిన వంశీ-
‘‘యస్‌ ఆంటీ, ఇది నేనే చేశాను’’ అన్నాడు.
‘‘నీ సొంత చెల్లెలి పట్ల ఇంత ఏహ్యమైన పని ఎలా చేశావు? ఎందుకు చేశావు?’’

‘‘ఆంటీ... మాది ఎంత మంచి కుటుంబమో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మా నాన్న పరువు ప్రతిష్ఠలకి ప్రాణం పెడతారు. ప్రాణంపోయినా ఫరవాలేదుగానీ కుటుంబ పేరూ ప్రతిష్ఠలకి భంగం కలగకూడదనే మనస్తత్వం కలిగిన వ్యక్తి. అలాంటి మా నాన్నకి, గత సంవత్సరం మా అక్క రూపంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. వేరే కులం అబ్బాయిని ప్రేమించి పెళ్లిచేసుకొని తనదారి తాను చూసుకుంది. పరువుకే విలువిచ్చే మా నాన్న తన పెద్దకూతురు చేసిన నిర్వాకానికి మా బంధువుల్లో తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో ఆయన ఎంతో కృంగిపోయారు. మా అక్కచేసిన ఆ గాయం నుండి నాన్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మృదుల మహేష్‌తో చనువుగా మెలగడం గమనిస్తూ వచ్చాను. మృదుల ఎక్కడ మహేష్‌ పట్ల ఆకర్షితురాలై అక్క చేసిన తప్పునే తానూ చేస్తుందో అనే ఆందోళనకి లోనయ్యాను. అదే జరిగితే ఈసారి మా నాన్న పరువు హత్యకి పాల్పడకమానడు. అప్పుడు మా కుటుంబం ఛిన్నాభిన్నం అయిపోతుందని భయపడ్డాను. అలాగని సున్నితమైన ఈ విషయం ఇటు మృదులతోగానీ, అటు మహేష్‌తోగానీ ఎలా చర్చించాలో తెలీకా నాలో నేనే మథనపడ్డాను. మహేష్‌తో చనువు కారణంగా వాడికి నా ఫోన్‌ పనిచేయడంలేదూ, హ్యాండ్‌ సెట్‌ ప్రాబ్లమో సిమ్‌కార్డు లోపమో చెక్‌ చేస్తానని చెప్పి, సిమ్‌ అడిగాను. మహేష్‌ ఏమాత్రం అనుమానించకుడా తన ఫోన్‌లో సిమ్‌ తీసి నాకిచ్చాడు. వెంటనే నా ఫోన్‌ నుండి నా సిమ్‌ తీసి మహేష్‌ సిమ్‌ వేసి అప్పటికే నా ఫోన్లో రెడీగా ఉన్న ఫొటోలని వాట్సాప్‌ ద్వారా మృదుల అకౌంట్‌కి పంపి, ఆ ఫొటోలని వెంటనే డిలీట్‌ చేశాను. మహేష్‌ నంబరునుండి వచ్చిన ఆ ఫొటోలు చూసి మృదుల అతడిని ద్వేషిస్తుందని నమ్మాను. మా కుటుంబం చిందరవందర కాకూడదని ఈ పిచ్చి పని చేశాను తప్పా, నాకు వేరే ఉద్దేశంలేదు’’ అంటూ బావురుమన్నాడు వంశీ.
‘‘వంశీ... చాలా తప్పు చేశావు. మృదుల నువ్వనుకున్నంత బలహీనమైన, చంచల మనస్కురాలు కాదు. ఆమె చాలా ఉన్నతంగా ఆలోచిస్తుంది. తల్లీ, తండ్రీ, అన్నా అనే అనుబంధాలకి చాలా విలువనిచ్చే వ్యక్తిత్వం ఆమెది. మీ కుటుంబ పరువు ప్రతిష్ఠలని అనునిత్యం కాపాడాలనే తపనపడే మనసు తనది. అందుకే ఇంత జరిగినా ఈ విషయాన్ని ఇటు పోలీసులకిగానీ, అటు కన్న తల్లిదండ్రులకు గానీ తెలీనివ్వకా తనలోతానే చాలా మథనపడుతూ నాతో చెప్పుకుని సమస్యని పరిష్కరించమంది’’ అంది పార్వతీదేవి.

*       *     *

పార్వతీదేవి చెప్పింది విన్న మృదుల కళ్లు వర్షిస్తున్నాయి. సిగ్గుతో తలదించుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్న వంశీ దగ్గరికి వెళ్లి, ‘‘తనవాళ్లని పిచ్చిగా ప్రేమించే వాళ్లే ఇలాంటి పనులు చేస్తారు. మన కుటుంబంలో నెలకొన్న పరిస్థితుల దృష్యా నువ్వాలోచించింది కరెక్టే కావచ్చు. కానీ దానికి పరిష్కారం మాత్రం ఖచ్చితంగా ఇది కాదు’’ అంటూ వంశీని ఓదార్చి, ‘‘ఆంటీ... కళ్లెదుట కనబడింది నిజమనుకొని మహేష్‌ని అనవసరంగా అనుమానించా క్షమించండి’’ బాధపడుతూ అంది మృదుల.
‘‘లేదు మృదులా నేనే నిన్ను అభినందించాలి. నిజానికి ఈ సమస్య నువ్వేకాదు, ప్రస్తుత సమాజంలో చాలామంది యువతులు ఎదుర్కొంటున్నారు. అయితే నీలాగా స్థిమితంగా వివేకంతో ఆలోచించకుండా, ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఎదుటివాళ్ల డిమాండులకి లొంగిపోయో, దాచిపెట్టో సమస్యని మరింత జటిలం చేసుకుంటున్నారు. మరికొందరు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకి సైతం పాల్పడి కన్నవారికి తీవ్ర మనోవేదన మిగులుస్తున్నారు. ఇలాంటి విషయంలో భయపడకుండా తమ పెద్దలతో ధైర్యంగా చర్చించి, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడమే సరైన మార్గం. నువ్వు నా ద్వారా అదే చేసి వివేకివనిపించుకున్నావు. శభాష్‌!’’ అంటూ అభినందించింది పార్వతీదేవి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.