close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోడలు

- పి. చంద్రికశేఖర్‌

బ్యాంకులో నుండి వస్తూ టైమ్‌ చూసుకున్నాను, 11:30 దాటింది. కారు దగ్గరకి రాబోయి కాఫీ తాగాలని అనిపించి, పక్కనున్న కాఫీ షాప్‌ దగ్గరికి నడిచాను. ఫిల్టర్‌ కాఫీ తీసుకుని వేడి వేడి కాఫీని ఆస్వాదిస్తూ తాగుతుంటే- స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లుంది. నా కాఫీ పిచ్చికి నా భార్య అరుణ కూడా విసుక్కునే సందర్భాలూ చాలానే ఉన్నాయి. భోజనం లేకపోయినా రోజంతా కాఫీలు తాగుతూ బతికేయగలను. చెప్పాలంటే మంచి కాఫీనీ, వంశీగారి అచ్చ తెలుగు గోదారొడ్డు కథలనీ ఇష్టపడని వారుంటారా!
కాఫీ పూర్తిచేసి కారు దగ్గరకు వెళ్లబోతూ హఠాత్తుగా ఆగిపోయాను. పక్క షాపు అరుగుమీద ఒక ముసలాయన సొమ్మసిల్లి నట్లుగా కూర్చుని ఉన్నాడు. ఆయన... మా ఇంటి ముందు రోడ్డుకు అవతల ఉన్న పాత పెంకుటింట్లో ఉండే పెద్దాయన కదూ! పరీక్షగా చూశాను, అవును ఆయనే. వాళ్లు ఈ మధ్యే ఆ ఇంట్లోకి వచ్చారు. నేను రోజూ మా ఇంటి బాల్కనీలో కూర్చుని ఆ ఇంటిని గమనిస్తుంటాను. ‘అదేంటీ ఆయన అలా కూలబడ్డాడు’ అనుకుంటూ గబగబా ఆయన దగ్గరికి వెళ్లి భుజం తడుతూ ‘‘ఏంటండీ, ఏమయ్యింది?’’ అని అడిగాను.
ఆయన దాహం అన్నట్లుగా సైగ చేశాడు. షాపు నుండి చల్లని వాటర్‌బాటిల్‌ తెచ్చి ఆయనకి ఇచ్చాను. గడగడా బాటిల్‌ ఎత్తి సగం నీళ్లు తాగేశాడు. మిగతా నీళ్లతో మొహం కడుక్కున్నాడు. అప్పటికి కొద్దిగా తేరుకున్న ఆయన రెండు చేతులూ జోడించి నమస్కారం చేశాడు.
ఆయన లేవబోతుండగా పక్కనే ఉన్న రెండు సంచులూ తీసుకుని ‘‘రండి, మీ ఇంటి దగ్గర దిగబెడతాను’’ అంటూ కారుకేసి నడిచాను. సంచుల్లో ఏమున్నాయోగానీ బరువుగానే ఉన్నాయి. నీరసంగా ఉన్నాడేమో ఆయన కూడా ఏం మాట్లాడకుండా నాతో నడిచాడు. సంచులు రెండూ వెనకసీట్లో సర్ది ఆయన్ని కూర్చోమని చెప్పి నేను కారు స్టార్ట్‌ చేశాను. అక్కడినుండి మా ఇల్లు పావుగంటే. ఇల్లు చేరేదాకా ఎవరం ఏమీ మాట్లాడలేదు. ఇంటి ముందు కారు పార్క్‌చేసి, డోర్‌ తీసి ‘‘రండి మా ఇంట్లో కాసేపు కూర్చుని వెళ్దురుగానీ’’ అంటూ సంచులు తీసుకుని లోపలికి నడిచాను, ఆయన మారు మాట్లాడకుండా నన్ను అనుసరించారు.
రెండు పోర్షన్‌ల బిల్డింగ్‌ నాది. రిటైర్‌ అయ్యాక కట్టుకున్నాను. కింద సింగిల్‌ బెడ్‌రూమ్‌, ముందు పెద్ద వరండా. అందులో సాఫ్ట్‌వేర్‌ దంపతులు అద్దెకుంటారు. వాళ్లు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో వాళ్లకే తెలియదు. పైన డబుల్‌ బెడ్‌రూమ్‌లో నేనూ, నా భార్య అరుణా ఉంటున్నాము. అమ్మాయి బెంగుళూరులో, అబ్బాయి ఆస్ట్రేలియాలో సెటిల్‌ అయిపోయారు. నేను మంచి పోస్టులోనే రిటైర్‌ అయ్యాను కాబట్టి ఆర్థికంగా ఏ లోటూ లేదు.
ఇంట్లోకి వస్తూనే ఆయనను సోఫాలో కూర్చోబెట్టి ఫ్యాన్‌ వేసి నేను ఎదురుగా కూర్చున్నాను. ఆయన మొహమాట పడుతూ ముడుచుకుని కూర్చున్నాడు... నీరుకావి పంచె, చేతుల్లేని పాత చొక్కా, సుమారు డెబ్భై సంవత్సరాలు ఉంటాయేమో. మనిషి బలహీనంగానే ఉన్నాడు, దగ్గరనుండి పరీక్షగా చూశాను.
‘‘మీరు ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చినట్లున్నారు’’ సంభాషణకి నాందిగా అన్నాను. నిజానికి ఆయనను ఇంటికి తీసుకుని వచ్చింది ఎన్నోరోజుల నుండీ నా మనసులో ఉన్న సందేహాలు తీర్చుకోవడానికే!
‘‘అవును సారూ, ఇదివరలో ఉన్న ఇల్లు కిరాయి ఎక్కువై ఇక్కడకు వచ్చాం’’ తలొంచుకుని చెప్పాడాయన.
‘‘మీ ఇంటి విషయాలు అడుగుతున్నానని ఏమీ అనుకోకండి... ఎక్కడికి రోజూ ఈ సంచులు మోసుకుని వెళ్తుంటారు... ఈ వయసులో అంత బరువులు ఎలా మోస్తారు? ఇక మీ ఆడవాళ్లు అనుకుంటా... ఇంటిపని చేస్తూ వంట చేస్తూ చిన్నపిల్లని ఎత్తుకుని తిప్పుతూ ఉంటారు. ఇంకో అమ్మాయి మీ కోడలా... ఎప్పుడోగానీ గుమ్మంలోకి రాదు. ఏ పనీ చేసినట్లు కనబడదు. చిన్నపిల్లే కదా, రోజంతా ఇంట్లోనే కూర్చుని ఏం చేస్తుంది, పెద్దవాళ్లు మీరు ఇన్ని పనులు చేస్తుంటే...’’ కోపంగా అడిగాను.
ఆయన తలపైకెత్తి నావైపు చూశాడు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా ’’అవును బాబూ, ఆ అమ్మాయి నా కోడలే. పేరు రేణుక. కానీ ఆ పిల్ల దేవత బాబూ’’ రుద్ధకంఠంతో చెప్పాడు.
ఒక్క నిమిషం మౌనంగా ఉండి మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు...
‘‘సారూ, నా పేరు జక్రయ్య. మాది ఖమ్మం దగ్గర చిన్న ఊరు. అక్కడ నాకొక చిన్న ఇల్లూ, కొంత పొలం ఉండేవి. ఉన్నంతలో గౌరవంగానే బతికాము. నాకు ఒక్కడే కొడుకు. వాడు ఇంటర్‌ చదివి ఊళ్లో బలాదూర్‌ తిరుగుతుంటే పనిలో పడితేనన్నా దారికి వస్తాడేమోనని తెలిసిన వాళ్లని పట్టుకుని ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం వేయించాను. బాగుపడలేదు సరికదా, చేతిలో నాలుగు డబ్బులు ఆడుతుండేసరికి దురలవాట్లు పెరిగాయి. మాకు తెలీకుండా ఈ రేణుకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈలోగా ఊళ్లో సరిగా పంటలు పండక, వ్యవసాయంలో నష్టం వచ్చి అప్పులపాలై ఉన్న కాస్త పొలం, ఇల్లూ అమ్మి అప్పులు తీర్చి మిగిలిన కాసిని డబ్బులూ పట్టుకుని నేనూ మా ఆవిడా కూడా ఈడి కాడికే వచ్చేశాము.
ఇక్కడకు వచ్చాక తెలిసింది... రేణుకకు ఒక కాలు పోలియో, కొద్దిగా కాలు ఎత్తివేస్తుందని. అది తప్ప ఆ అమ్మాయికి ఏ వంకాలేదు. కళగా లచ్చిందేవిలా ఉంటుంది. మమ్మల్ని ప్రేమగానే చూసుకుంటుంది. కానీ మా ఆవిడకి అవిటి కోడలు నచ్చలేదు. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడన్న కోపం, కట్నకానుకలు దక్కలేదన్న ఉక్రోషం... ఇవన్నీ మనసులో పెట్టుకుని కోడల్ని సూటీపోటీ మాటలనేది. ఎన్నో రకాలుగా ఆరళ్లు పెట్టింది. ఏ మాటకామాట చెప్పుకోవాలి... ఏవో ఆడోళ్ల గొడవల్లే అని నేను కూడా పట్టించుకోలేదు.
ఇక మావోడి సంగతి చెప్పనక్కరలేదు. ప్రేమ మోజు తీరిపోయిందేమో తాగొచ్చి ఆ పిల్లని చితకబాదేవాడు. వాడి సంపాదన సగం తాగుడికే తగలేసేవాడు. ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తూ గుడ్లనీరు కుక్కుకునేది గానీ నోరెత్తేది కాదు నా కోడలు. ఉన్నంతలోనే జాగ్రత్తగా ఇంట్లోనే పచ్చళ్లూ, అప్పడాలూ తయారుచేస్తూ, సంసారం నడిపేది. ఈలోగా ఆడపిల్ల పుట్టింది. అయినా మా వాడికి బాధ్యత తెలిసిరాలేదు. చివరికి ఒకరోజు ఆ పిల్లని కొట్టడంతో ఇక సహించలేక ఎదురు తిరిగింది. దాంతో ఆ అమ్మాయిని ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. బిడ్డతో సహా ఇంట్లోంచి వెళ్లిపోయింది రేణుక.
మేము మౌనంగానే ఉండిపోయాం కానీ వాడిని మందలించలేదు. ఆ పిల్లకి వత్తాసు పలికితే కొడుకు దూరం అవుతాడని మేము నోరైనా ఎత్తలేదు.
ఒకరోజు మావాడు తాగి లారీకింద పడి చచ్చిపోయాడు. మేము గుండెలు బాదుకుని ఏడ్చాము. కొడుకు మీద బెంగతో మా ఆడది జబ్బు పడింది. చేతిలో డబ్బులన్నీ అయిపోయాయి. మూడునెల్లు గడిచాయి. ఇంటద్దె కూడా కట్టలేకపోయాం. ఇంటి ఓనరు- ఉన్న సామాన్లు అద్దె బాకీ కింద జమకట్టుకుని మమ్మల్ని వెళ్లగొట్టాడు. కట్టుబట్టలతో ఏడికి పోవాలో తెలియని మేము బస్టాండ్‌కి చేరుకున్నాము. పొద్దున్నుండీ ఏమీ తినలేదు. మా ఆవిడ నీరసంగా బెంచీమీద పడుకుంది. ఊరికి వెళ్లాలన్నా ఛార్జీకి డబ్బుల్లేవు. నేను మనసు చంపుకుని నలుగురినీ అడుక్కున్నాను.
ఛార్జీ డబ్బులన్నా వస్తే మా ఊరికి పోయి కూలి చేసుకుని, కలో గంజో తాగొచ్చు అనుకున్నాను. ఈలోగా రేణుక కనిపించింది. మమ్మల్ని ఆ స్థితిలో చూసి బాధపడింది. నా కొడుకు చచ్చిపోయిన విషయం తెలిసి గోడుగోడున ఏడ్చింది. మమ్మల్ని వచ్చి తనతో ఉండమనీ, మనవరాలిని దగ్గరుండి చూసుకోమనీ, ఎవరూలేని తనకు పెద్దదిక్కుగా ఉండమనీ కోరింది. ఆ అమ్మాయి మంచితనానికి మాకు నోటమాట రాలేదు.
నా కొడుకు గెంటేశాకా ఒంటరిగా ఉండలేక దూరపు చుట్టాల దగ్గర తలదాచుకుందంట... ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ. మమ్మల్ని కూడా అక్కడ ఉంచలేక తక్కువ అద్దెలో ఈ ఇల్లు తీసుకుంది. ‘మీ అబ్బాయే లేనప్పుడు ఈ గొలుసు ఎందుక’ని సూత్రాల గొలుసు అమ్మేసి కావలసిన సరుకులన్నీ కొని, ఇంటి అడ్వాన్సు కట్టింది. ఇంట్లోనే పచ్చళ్లూ, పొడులూ తయారుచేస్తే నా వంతుగా అవి బయటకు తీసుకెళ్లి షాపుల్లో అమ్ముతుంటాను. మా ఆడది ఇంటిపనీ, వంటపనీ చేస్తూ మనవరాలిని చూసుకుంటుంది.
ఆ పిల్ల చేసినదానికి మేం చేసేది ఎంతసారూ? చాలా మంచిపిల్ల. నా కొడుకుని ఇష్టపడి చేసుకుని దగా పడింది. మా ఆదరణ కూడా దక్కలేదు. అయినా అవేవీ మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని చేరదీసి అమ్మా నాన్నల్లా చూసుకుంటోంది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటూ కష్టపడి సంపాదిస్తోంది. ఇంకొకరు అయితే మేము చేసిన పాపానికి కన్నెత్తి కూడా మమ్మల్ని చూసేవారు కాదు.
అందుకే ఆ పిల్ల అంత కష్టపడతా ఉంటే ఏదో మేం మాకు తోసిన సాయం చేస్తన్నాం బాబూ. ఇలాగన్నా మా పాపాల్ని కడిగేసుకోవాలి గదా’’ కళ్లు తుడుచుకుంటూ పూర్తి చేశాడు జక్రయ్య.
అంతా విన్న నేను ఆశ్చర్యపోయాను. నిజమా, ఆ అమ్మాయిని నేను ఎంత అపార్థం చేసుకున్నాను. అందుకేనేమో ఎప్పుడూ నాణేనికి రెండు పక్కలా చూడాలంటారు. నా తెలివితేటలూ, చదువూ, అనుభవం అన్నీ ఏమైపోయాయి అని సిగ్గేసింది.

‘‘వెళ్లొస్తా సారూ, బాగా ఆలీసమయ్యింది’’ లేచాడు జక్రయ్య.
‘‘ఉండు జక్రయ్యా, నేనూ నీతో వస్తాను. ఒక్కసారి రేణుకతో మాట్లాడాలి’’ అని లేచాను.
‘‘అయ్యా! మీబోటి పెద్దోళ్లు మా ఇంటికొస్తారా, రండి సారూ ‘‘సంతోషంగా ఇంటికేసి నడిచాడు. డోర్‌ లాక్‌చేసి నేనూ అనుసరించాను.
ఇద్దరం ఇంట్లో అడుగుపెడుతుండగానే ‘‘ఏడికి పోయినావయ్యా. కూడు తినే ఏళైతే’’ అంటూ ఆదుర్దాగా ఎదురొచ్చిన జక్రయ్య భార్య నన్ను చూసి సంకోచంగా ఆగిపోయింది.
‘‘రండి సారూ’’ అంటూ లోపలికి తీసుకెళ్లాడు జక్రయ్య. లోపల ఒక పెద్ద గది, పక్కన చిన్నగది ఉన్నాయి. ఆ పెద్ద గదిలో ఒక పక్కగా వాళ్ల సామాన్లు ఉన్నాయి. ఇంకో పక్కగా కూర్చుని పచ్చళ్లు ప్యాకింగ్‌ చేస్తోంది రేణుక. అన్నీ అక్కడే అవడంతో ఇల్లు బాగా ఇరుకుగా ఉంది. వెనక ఆవరణలో అప్పడాలు ఆరబెట్టి ఉన్నాయి. గోడవారకి పచ్చడి జాడీలూ, ప్యాకెట్లూ సర్ది ఉన్నాయి. మమ్మల్ని చూసిన రేణుక లేచి నిలబడే ప్రయత్నం చేసింది.
‘‘ఆఁ ఆఁ కూర్చోమ్మా’’ వారిస్తూ, జక్రయ్య వేసిన చిన్న స్టూలు మీద కూర్చున్నాను. పిల్ల చక్కగా ఉంది, ఆ కళ్లల్లో ఆత్మవిశ్వాసం, చురుకుదనం కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి.
‘‘చాలా సంతోషమమ్మా, అత్తమామల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నావు’’ అభినందనగా అన్నాను.
‘‘వాళ్లేగా సారూ నాకూ నా బిడ్డకీ మిగిలిన పెద్దదిక్కు. వాళ్ల నీడన ఉంటూ నా బిడ్డని చదివించుకుంటాను’’ చెప్పింది రేణుక.
ఈలోగా పాప వచ్చింది అక్కడికి... దగ్గరికి తీసుకుని ‘‘నీ పేరేంటమ్మా’’ అని అడిగాను.
‘‘మహాలక్ష్మి’’ ముద్దుగా చెప్పింది పాప.
‘‘ఇంకో నాలుగు నెలల్లో స్కూళ్లు తెరుస్తారు. నాకు తెలిసిన స్కూలుంది. పాపని అక్కడ చేర్పిద్దాం, ఫీజు సంగతి నేను చూసుకుంటాను’’ అంటూ లేచాను. చేతులు జోడించింది రేణుక. పాప చేతిలో రెండువేల నోటు పెట్టి బయటకు వచ్చాను.
‘‘సాయంత్రం ఒకసారి ఇంటికి రండమ్మా, మా ఆవిడకి పరిచయం చేస్తాను. మీ దగ్గర ఉన్న పచ్చళ్లూ, అప్పడాలూ కూడా తీసుకురండి’’ పెద్దావిడతో అన్నాను. కాస్త వాళ్ల మంచీ చెడూ కనిపెట్టి చూడమని అరుణకు చెప్పాలి అనుకుంటూ ఇంట్లోకి వచ్చాను.
అరుణ నాకు వంటచేసి పెట్టి ఫంక్షన్‌కి వెళ్లింది. భోజనం చేస్తూ కూడా రేణుక గురించే ఆలోచించాను. ఆమెలాంటి కోడళ్లు చాలా అరుదుగా ఉంటారు ఈ రోజుల్లో.
ఆస్ట్రేలియా నుండి హైదరాబాద్‌ వచ్చి మాకు తెలియకుండా తన తల్లిదండ్రులను కలిసి వెళ్లిపోయిన నా కోడలూ... ఏడాదికొకసారి కొడుకునీ కోడల్నీ చూడాలని వచ్చి ఓ నాలుగురోజులు ఉంటున్నందుకు తన అత్తమామల్ని తెగ తిట్టుకునే నా కూతురూ... ఆర్నెల్లకోసారి కూడా వృద్ధాశ్రమంలో ఉన్న అత్తమామలని పలుకరించే తీరుబడిలేని మా కింది పోర్షన్‌లో అద్దెకుండే అమ్మాయీ... ఇంకా మా బంధువుల్లో ఉన్న ఇలాంటి కోడళ్లు చాలామందే గుర్తుకువచ్చారు నాకు.
వీళ్లంతా మెరిసే రంగురాళ్లు అయితే రేణుక అసలు సిసలైన వజ్రం కదూ! భోజనం పూర్తిచేసి చేతులు కడుక్కుని ఫోన్‌ తీశాను... అరుణ వచ్చేవరకూ ఆగలేక... కాల్‌చేసి వెంటనే రేణుక గురించి చెప్పాలని..!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు