close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బూజు పట్టిన బ్రెడ్డు... కొత్త ట్రెండు!

బ్రెడ్డుని చాలా రోజుల పాటు అలా వదిలేస్తే దానిమీద ఫంగస్‌ పచ్చగా పట్టేసినట్లుంది కదూ... ఈ ఫొటోలను చూస్తుంటే. కానీ చైనాలో వీటిని తెగ కొనుక్కుని తినేస్తున్నారట. అసలు విషయం ఏంటంటే... ఇక్కడ కనిపించే బ్రెడ్‌ అసలు పాడవ్వనే లేదు. ‘నాంజింగ్‌ వైకన్‌ ఫుడ్స్‌’ అనే కంపెనీ అచ్చం ఫంగస్‌ పట్టేసినట్లుండేలా ఆకుపచ్చటి గ్రీన్‌టీ మాచా, పాల పొడులతో ఈ ‘చీజ్‌ మాచా’ బన్‌లను తయారుచేస్తోంది.ఇవి చూడ్డానికి తినబుద్ధయ్యేలా లేవు గానీ తింటే మాత్రం రుచి వదిలేలాలేదట.

సోనూసూద్‌కి సెల్యూట్‌!

కొవిడ్‌-19 సృష్టించిన విలయంతో ప్రభుత్వాలు గతేడాది అత్యవసరంగా లాక్‌డౌన్‌ విధించాల్సి రావడం తెలిసిందే. అయితే, ఆ సమయంలో నగరాల్లో చిక్కుకున్న రోజు కూలీలూ చిన్నస్థాయి కార్మికులూ అటు పని లేక పస్తులుండలేకా, ఇటు సొంతూరికి రాలేకా ఎన్నో అవస్థలు పడ్డారు. ఆ దీనస్థితిని గుర్తించి నటుడు సోన్‌సూద్‌ వారికోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి, ఎంతోమందిని సొంత ప్రాంతాలకు పంపించారు. వారి ఆకలి తీర్చారు. ఇంకెన్నో సేవాకార్యక్రమాలూ చేశారు. అందుకోసం ముంబైలో పదికోట్ల విలువైన తన స్థలాన్నీ అమ్మాడట. ఈ సేవలకు గానూ ఆయనకు ఈమధ్య ఓ అరుదైన గౌరవం దక్కింది. స్పైస్‌జెట్‌ కంపెనీ తమ బోయింగ్‌ 737 విమానం మీద పెద్దగా కనిపించేలా సోనూసూద్‌ ఫొటోనీ ఆ పక్కనే ‘ఎ సెల్యూట్‌ టు ద సేవియర్‌ సోనూసూద్‌’ అనీ వేయించింది. ఓ భారతీయ నటుడికి ఇలాంటి గౌరవం దక్కడం ఇదే తొలిసారట. గొప్పే కదూ..!

కొబ్బరినీళ్లలో పండ్లు

ఉదయం రకరకాల పండ్ల ముక్కల్ని ఎక్కువ తింటే మంచిదంటారు. కానీ అన్నన్ని ముక్కల్ని ఒట్టిగా తినలేక వాటిని పాలతోనో కస్టర్డ్‌లో వేసుకునో తింటుంటారు. అయితే, పాలూ అందులో వేసే పంచదారలోనూ క్యాలరీలు అధికం. దానికి తోడు పాలు కొందరికి అరగవు. దీనికి పరిష్కారంగానే ఓ కొత్త ట్రెండ్‌ పుట్టుకొచ్చింది. అదే ‘నేచర్‌ సెరీల్‌’. కొబ్బరినీళ్లలో పండ్ల ముక్కలను వేసి చేసే ఈ సెరీల్‌ వీడియోను ఎవరో టిక్‌టాక్‌లో పెట్టగా దానికి కోట్ల వ్యూస్‌ వచ్చాయట. కొబ్బరినీళ్ల వల్ల శరీరానికి కావల్సిన పొటాషియం అందుతుంది, క్యాలరీలూ ఎక్కువ చేరవు, మధుమేహ రోగులకూ ఇది మంచిదే. ఇంకా బోలెడు ఉపయోగాలు... అంటూ ఆహార నిపుణులూ దీనికి ఓటెయ్యడంతో నేచర్‌ సెరీల్‌ ప్రస్తుతం అంతర్జాతీయ ట్రెండ్‌ అయిపోయింది.

చివరి కోరిక తీర్చేందుకు..!

అమెరికాలోని వెర్మాంట్‌ రాష్ట్రంలో ఉండే ఓ మహిళకు మేరీల్యాండ్‌ రాష్ట్రం, బాల్టిమోర్‌లో ఉండే ఎకిబెన్‌ హోటల్‌లోని టెంపురా బ్రకోలీ వంటకం అంటే తెగ ఇష్టమట. ఆ నగరానికి వచ్చిన ప్రతిసారీ దాని రుచి చూడకుండా ఉండేది కాదట. దురదృష్టవశాత్తూ ఆమె ప్రస్తుతం స్టేజ్‌-4 క్యాన్సర్‌తో బాధపడుతోంది. దాంతో బాల్టిమోర్‌లో ఉండే అల్లుడు ఆమెను చూసేందుకు వెళ్తూ ఆమెకి ఎంతో ఇష్టమైన టెంపురా బ్రకోలీ వంటకాన్ని తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ బాల్టిమోర్‌ నుంచి వెర్మాంట్‌కి దాదాపు 850 కిలోమీటర్ల దూరం. ఎన్నో గంటల ప్రయాణం చేసి వెళ్లేసరికి ఆ వంటకం రుచి పాడైపోతుందేమో అని అతడికి సందేహం వచ్చింది. అదే విషయాన్ని ఎకిబెన్‌ హోటల్‌ యజమానులైన స్టీవ్‌ చు, ఎఫ్రెమ్‌ అబీబ్‌లకు తెలిపి, ఏదైనా సలహా ఇమ్మన్నాడు. ఆయన చెప్పిందంతా విన్న వాళ్లు ‘మేమే ఆమె దగ్గరకి వచ్చి వేడివేడిగా వండి పెడతాం’ అన్నారట. అన్నట్లే అంత దూరం ప్రయాణం చేసి, ఆ మహిళ ఇంటికొచ్చి ఆమె ఆఖరి కోరికను తీర్చారట. అంతేకాదు, దారి ఖర్చులకూ వంటకానికీ దేనికీ డబ్బు తీసుకోలేదట. ఈ రోజుల్లో కూడా ఇలాంటివారుంటారా... అనిపిస్తోంది కదూ..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు