చేద్దామా.. చిల్లీ ఫిష్‌ - Sunday Magazine
close

చేద్దామా.. చిల్లీ ఫిష్‌

చేపలతో పులుసూ, కూరా కాకుండా ఇంకేం చేయొచ్చూ అని సందేహం కలిగితే... స్టార్టర్‌ లేదా కుర్మా రుచుల్లో వండి చూడండి. మార్పుగానూ ఉంటుంది. చపాతీ, రైస్‌ లాంటివాటికీ బాగుంటాయి.


లసూనీ మచ్చీ టిక్కా

కావలసినవి: ముల్లులేని చేప: అరకేజీ, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, నిమ్మకాయ: ఒకటి, ఉప్పు: తగినంత, ఆవనూనె: నాలుగు టేబుల్‌స్పూన్లు, సోంపు: పావుచెంచా, వెల్లుల్లి రెబ్బలు: పది, పచ్చిమిర్చి: రెండు, సెనగపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, కారం: చెంచా, పసుపు: పావుచెంచా, గరంమసాలా: చెంచా, పెరుగు: పావుకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా, పచ్చిమిర్చి ముద్ద: చెంచా.

తయారీ విధానం: ముందుగా అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముద్ద, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి కలిపిన మసాలాను చేపముక్కలకు పట్టించి పెట్టుకోవాలి. ఇరవై నిమిషాలయ్యాక స్టౌమీద పాన్‌ పెట్టి ఆవనూనె వేయాలి. అది వేడెక్కాక సోంపు, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, సెనగపిండి వేసి వేయించి ఓ గిన్నెలోకి తీసు కోవాలి. అందులో కారం, కొద్దిగా ఉప్పు, పసుపు, గరంమసాలా, పెరుగు, కాసిని నీళ్లు పోసి కలిపి చేపముక్కలు వేసి వాటికి ఈ మిశ్రమం పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌమద పాన్‌పెట్టి... నూనె వేస్తూ ఈ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించుకోవాలి. లేదంటే గ్రిల్‌పాన్‌పైన కూడా కాల్చుకోవచ్చు.


చిల్లీ ఫిష్‌

కావలసినవి: ఏదయినా ఒకరకం చేప: చిన్నది (ముక్కల్లా కోసుకోవాలి), మొక్కజొన్న పిండి: మూడుటేబుల్‌ స్పూన్లు, మైదా: నాలుగు టేబుల్‌స్పూన్లు, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, మిరియాలపొడి: చెంచా, క్యాప్సికం: ఒకటి, ఉల్లిపాయ: ఒకటి, సోయాసాస్‌: టేబుల్‌స్పూను, గ్రీన్‌చిల్లీసాస్‌: చెంచా, టొమాటోసాస్‌: చెంచా, ఉల్లికాడల తరుగు: రెండు చెంచాలు, కొత్తిమీర: కట్ట, నూనె: వేయించేందుకు సరిపడా, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: ఓ గిన్నెలో మూడు టేబుల్‌స్పూన్ల మొక్కజొన్నపిండి, మైదా, అల్లంవెల్లుల్లి ముద్ద, కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి తీసుకుని నీళ్లు పోస్తూ బజ్జీల పిండిలా చేసుకోవాలి. చేపముక్కల్ని మైదా మిశ్రమంలో ముంచి కొంచెం కొంచెంగా నూనె వేస్తూ ఎర్రగా వేయించుకోవాలి. అదే పాన్‌లో మరో రెండు పెద్ద చెంచాల నూనె వేసి ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కల్ని వేయించుకుని అన్నిరకాల సాస్‌లు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇది చిక్కగా అయ్యాక వేయించిపెట్టుకున్న చేప ముక్కల్ని వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. మిగిలిన మొక్కజొన్న పిండిలో కొద్దిగా నీళ్లు పోసి గరిటె జారుగా చేసుకుని చేపముక్కలపైన వేసి కలుపుతూ ఉంటే కాసేపటికి పొడిపొడిగా అవుతుంది. అప్పుడు ఉల్లికాడల తరుగు, కొత్తిమీర వేసి దింపేయాలి.


టొమాటో ఫిష్‌ కర్రీ

కావలసినవి: ఏదయినా ఒక రకం చేప: కేజీ, పసుపు: రెండు చెంచాలు, ఆవాలు: రెండు చెంచాలు, జీలకర్ర: చెంచా, మిరియాలు: చెంచా, టొమాటోలు: మూడు, ఉల్లిపాయలు: రెండు, అల్లం: చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, పచ్చిమిర్చి: అయిదు, ఉప్పు: తగినంత, యాలకులు: నాలుగు, దాల్చినచెక్క: ఒకముక్క, కరివేపాకు రెబ్బలు: నాలుగు, కొబ్బరిపాలు: కప్పు, చింతపండు గుజ్జు: టేబుల్‌స్పూను.

తయారీ విధానం: చేపముక్కలపైన చెంచా చొప్పున ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. స్టౌమీద పాన్‌పెట్టి చెంచా ఆవాలు, జీలకర్ర, మిరియాలు వేయించుకోవాలి. ఆ తరువాత సగం టొమాటో ముక్కలు, ఒక ఉల్లిపాయ తరుగు, అల్లం, రెండు వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేయించుకుని తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి మిగిలిన ఆవాలు, యాలకులు, దాల్చినచెక్క, వేయించి... మిగిలిన ఉల్లిపాయముక్కలు, వెల్లుల్లి తరుగు, పసుపు, తగినంత ఉప్పు, చేసిపెట్టుకున్న మసాలా వేసి వేయించాలి. తరవాత మిగిలిన టొమాటో ముక్కలు కూడా వేసి కప్పు నీళ్లు పోయాలి. ఈ మిశ్రమం చిక్కగా అవుతున్నప్పుడు కొబ్బరిపాలు, కరివేపాకు, చేప ముక్కలు వేయాలి. ఆ ముక్కలు ఉడికాక చింతపండు రసం వేసి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.


షాహీ ఫిష్‌ కుర్మా

కావలసినవి: ముల్లులేని చేప: కేజీ, ఉల్లిపాయలు: రెండు, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, క్రీమ్‌: టేబుల్‌స్పూను, జీలకర్ర: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా, అల్లం: చిన్న ముక్క, గసగసాల ముద్ద: టేబుల్‌స్పూను, జీడిపప్పు ముద్ద: రెండు టేబుల్‌స్పూన్లు ఎండుకొబ్బరి తరుగు: పావుకప్పు, పసుపు: అరచెంచా, కారం: మూడు చెంచాలు, దనియాలపొడి: రెండు చెంచాలు, జీలకర్రపొడి: చెంచా.

తయారీ విధానం: చేపను శుభ్రం చేసుకుని ముక్కల్లా కోసుకుని నూనెలో ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో టేబుల్‌స్పూను నూనె వేసి ఉల్లిపాయముక్కల్ని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. మళ్లీ నాలుగు టేబుల్‌స్పూన్ల నూనె వేసి జీలకర్ర వేయించి గసగసాల ముద్ద, జీడిపప్పు ముద్ద వేసి బాగా వేయించి పావుకప్పు నీళ్లు పోయాలి. నిమిషమయ్యాక అల్లం, వెల్లుల్లి, కొబ్బరి కలిపి చేసుకున్న మసాలా, పసుపు, కారం, దనియాలపొడి, జీలకర్రపొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇది ఉడికి దగ్గరకు అయ్యాక క్రీమ్‌, వేయించిపెట్టుకున్న చేపముక్కలు వేసి బాగా కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న