భక్తుల కొంగు బంగారం... శమీ వృక్షం! - Sunday Magazine
close
భక్తుల కొంగు బంగారం... శమీ వృక్షం!

శరదృతువులో వచ్చే దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో అలంకారంతో కొలిచి, చివరిరోజైన దశమినాడు మాత్రం జమ్మిచెట్టుని పూజిస్తారు భక్తులు. అనంత శక్తిస్వరూపమైన శ్రీ చక్రానికి అధిష్టాన దేవతగా కొలిచే అపరాజితాదేవి శమీవృక్షంలో కొలువై ఉంటుందన్న విశ్వాసమే అందుకు కారణం. పరమ పవిత్రమైనదిగా భావిస్తూ సురభి (బంగారం)గా పిలుచుకునే ఆ జమ్మిచెట్టు ప్రాశస్త్యం గురించి..!

ఆశ్వయుజ శుద్ధ దశమిరోజున... శమీ వృక్షం వద్ద అపరాజితాదేవిని పూజించి...‘శమీ శమయతే పాపం శమీ శతృవినాశనీ అర్జునస్య ధనుర్ధారీరామస్య ప్రియదర్శినీ...’ అన్న శ్లోకాన్ని స్మరిస్తూ ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. శమీ అంటే శమింపచేసేది. కాబట్టి ఆ రోజున అపరాజితాదేవిని ఈ చెట్టు రూపంలో కొలిస్తే పాపాలన్నీ పోయి విజయం వరిస్తుందనే అర్థంతో ఈ శ్లోకం పఠిస్తారు. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందనీ, శని దోషాలు తొలగిపోతాయనీ, విజయం సిద్ధిస్తుందనీ విశ్వసిస్తారు భక్తులు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోని అనేకచోట్ల దసరా పండుగనాడు జమ్మిచెట్టును పూజిస్తారు. రాజస్థాన్‌, తెలంగాణలకు ఇది రాష్ట్ర వృక్షం కూడా. తెలంగాణలో పూజ అయ్యాక వచ్చేటప్పుడు కాస్త జమ్మి ఆకుని తెచ్చి, ఆ ఆకుని బంగారం అంటూ చిన్నవాళ్లు దాన్ని పెద్దవాళ్ల చేతుల్లో ఉంచి, దీవెనలు అందుకుంటారు. ఐక్యతకు సూచనగా స్నేహితులూ చుట్టుపక్కలవాళ్లూ ఈ ఆకుని ఒకరి చేతిలో ఒకరు ఉంచి అలయ్‌ బలయ్‌ అనుకుంటూ ఆత్మీయంగా కౌగిలించుకుంటారు.

పౌరాణిక ప్రాశస్త్యం!
క్షీరసాగర మథనంలో ఉద్భవించిన దేవతా వృక్షాల్లో జమ్మి ఒకటనీ, త్రేతా యుగంలో రాముడు రావణుడితో యుద్ధానికి వెళ్లేముందు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించాడనీ రావణుడితో తొమ్మిదిరోజులపాటు యుద్ధం చేసి దశమినాడు గెలిచాడనేది పురాణ కథనం. పాండవులు అజ్ఞాతవాసంలో ఆయుధాలను జమ్మిచెట్టుపైన దాచి, పూర్తవగానే శమీవృక్ష రూపంలోని అపరాజితాదేవిని పూజించి, ఆయుధాలను తీసుకుని కురుక్షేత్రంలో విజయం సాధించారని మహాభారతం చెబుతోంది. అందుకే జమ్మిచెట్టుని జయాల్ని చేకూర్చేదిగా భావించి, విజయదశమి రోజున శమీపూజతోపాటు వాహనాలకూ యంత్రాలకూ పూజలు చేస్తుంటారు. బిల్వాష్టకాలలో ఒకటైన జమ్మి ఆకుతో వినాయకుడినీ అర్చిస్తారు. దశమిరోజున జమ్మిచెట్టు పూజానంతరం పాలపిట్టను చూడటం ఆచారంగా వస్తోంది. లంకకు బయలుదేరేముందు శ్రీరాముడికీ, అరణ్యవాసం పూర్తయ్యాక రాజ్యానికి తిరిగి వస్తుండగా పాండవులకీ పాలపిట్ట కనిపించిందట. అందుకే దశమినాడు పాలపిట్టను చూడటం శుభసంకేతంగా భావిస్తారు.

జమ్మికాయలతో...
పూజనీయమైనదన్న కారణంతోనే కాదు, ఏదీ పెరగని ఎడారి ప్రాంతీయులకి జమ్మిచెట్టే కల్పవృక్షం. దీని పొడవాటి వేళ్లు లోపలికంటా వెళ్లి నీటిని గ్రహించడం వల్ల నేల సారవంతంగా ఉంటుంది. వేసవి ఎండల్లో వాళ్లకి ఇదే నీడనిస్తుంది. ఈ చెట్టు కాయలు మంచి పోషకాహారం కూడా. సాంగ్రియాగా పిలిచే వీటితో రక రకాల కూరలు వండుతారు. గింజల్ని ఎండబెట్టి ఏడాది పొడవునా కూరల్లో వాడుతుంటారు. జమ్మిచెట్టు ఆకుల్నీ పువ్వుల్నీ బెరడునీ వ్యాధుల నివారణలోనూ వాడతారు. ఆకుల పసరుతో పుండ్లు తగ్గుతాయట. జమ్మిపూలను పంచదారతో కలిపి తింటే గర్భస్రావం కాదట. దగ్గు, ఆస్తమా వంటి వ్యాధులకు బెరడు ఔషధంగా పనిచేస్తుంది. జమ్మి ఆకూ, బెరడూ, మిరియాలూ కలిపి చేసిన మాత్రల్ని మజ్జిగతో వేసుకుంటే అతిసారం తగ్గుతుంది. బెరడుతో చేసిన పొడిని నీళ్లలో వేసి మరిగించి, పుక్కిలిస్తే గొంతునొప్పీ, పంటినొప్పీ తగ్గుతాయి. లేతాకులతో చేసిన కషాయం అమీబిక్‌ డీసెంట్రీకి మంచి మందు. ఇక, స్కిజోఫ్రీనియా, శ్వాసకోశ సమస్యల నివారణకీ వాడతారు ఆయుర్వేద వైద్యులు. అందుకే జయాలనిచ్చే జమ్మిచెట్టు సకలపాపహరణం మాత్రమే కాదు, సర్వ రోగనివారిణి కూడా.


అరటిపళ్లూ కొబ్బరికాయలే ఎందుకు?

పండుగలూ, వ్రతాలూ, నోముల సమయంలో అరటిపళ్లూ, కొబ్బరికాయలకే అగ్రతాంబూలం ఎందుకు?
పండుగ సమయాల్లోనూ, శుభకార్యాలప్పుడూ పూజా ద్రవ్యాలతోపాటు ప్రప్రథమంగా కొనేది అరటిపండ్లూ, కొబ్బరికాయల్నే. ఇవి భగవంతునికి ప్రీతిపాత్రమైనవిగా చెబుతారు. అలానే వీటిని దేవుడికి నివేదించడానికి మరో కారణం కూడా ఉంది. మనం ఏ పండు తిన్నా అందులో గింజలు వస్తాయి. కొన్నిటిని తీసేసినా కొన్ని నోట్లోకి వచ్చేస్తుంటాయి. వాటిని చప్పరించి ఊసేస్తుంటాం. అలా తినడం వల్ల ఈ విత్తనాలు ఎంగిలి పడిపోతాయి. తరవాత మొక్కలుగా మొలిచి మళ్లీ మనకు ఫలాలను ఇస్తాయి. ఎంగిలి విత్తనం నుంచి వచ్చిన పండ్లు కూడా ఎంగిలిపడిపోయినట్టే లెక్క. అదే అరటి పండ్ల విషయానికొస్తే గింజలతో పని ఉండదు. అరటిచెట్టు నుంచే పిలకగా బయటకు వచ్చి పెద్ద చెట్టు అయి కాయలు కాస్తుంది. అదే విధంగా కొబ్బరి కూడా కాయ నుంచే పిలక వస్తుంది కాబట్టి ఎంగిలి పడే ఆస్కారం ఎక్కడా ఉండదు. పైగా ఈ రెండూ అన్ని కాలాల్లోనూ దొరుకుతాయి. చౌకగా కూడా లభిస్తాయి. కాబట్టి దేవుడికి నివేదిస్తారు. అలానే ఈ చెట్లకి కూడా పండగల్లో, ఇతర శుభకార్యాలప్పుడూ అంతే ప్రాధాన్యమిస్తారు. పందిళ్లలో, మండపాల అలంకరణలో భాగం చేస్తారు.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న