మరోసగం - Sunday Magazine
close
మరోసగం

- దివ్య మురళి

నీవల్ల వచ్చే ఈ కన్నీళ్లు కూడా తియ్యగానే ఉంటాయి... స్నిగ్ధ నుంచి మెసేజ్‌. చిర్రెత్తుకొచ్చింది నాకు. అసలే లోన్‌ గురించిన టెన్షన్‌లో సతమతమైపోతూ ఉంటే మధ్యలో ఇదో గోల. తను ఈ జన్మకి మారదా అనిపిస్తుంది ఒక్కోసారి. ఎలా ఉండగలుగుతుంది ఇలా ఏమాత్రం బాధ్యత లేకుండా... అసలు కొంచెం కూడా విచక్షణ ఉండదా... అనిపించింది. ఫోన్‌చేసి తిట్టి పారేయాలనిపించినా తమాయించుకొని రిప్లై చేశాను, ‘ఐయామ్‌ వెరీ బిజీ ఇన్‌ ది వర్క్‌’ అని. అందులోనే ‘నన్ను విసిగించకు’ అనే అర్థం ధ్వనిస్తుందిలే అనుకున్నా. మరుక్షణంలో రిప్లై అటునుంచి, ‘ఎదురుచూస్తూ ఉంటాను, చిరునవ్వుతో వచ్చే నీకోసం’ అని. హు! చిరునవ్వు- ఇప్పుడు అదొక్కటే తక్కువ అనుకుని, ఫోన్‌ సైలెంట్‌లో పెట్టేసి డ్రాలో పడేశాను.

పెళ్లై రెండేళ్లవుతోంది. ఊహల్లో ఇలా తేలిపోతూ బతికేయడం నావల్ల కాదు. నేనే కాదు, బాధ్యత తెలిసిన ఎవ్వరూ అలా ఉండలేరు. అయితే ఏడుపూ లేదా ఇలా పనికిమాలిన ఓవరాక్షన్‌. రాత్రి ‘ఏదో న్యూస్‌ చూశాను భయంగా ఉంది నీ గదిలో పడుకుంటాను’ అంటుంటే కొంచెం చిరాకు పడ్డాను. ఆ మాత్రం ధైర్యం లేనప్పుడు ఆ న్యూస్‌లూ అవీ చూడ్డం మానేయమని గట్టిగా చెప్పాను. ఒక భర్తగా ఎంత వరకూ ఉండాలో అంత వరకూ ఒకే, మరీ నెత్తినెక్కించుకోవడం నా వల్ల కాదు. దగ్గరకు తీసుకొని హత్తుకుని పడుకోవడానికి తనేమీ పసిపాప కాదు కదా. ఎంత భార్యాభర్తలైనా ఒక పర్సనల్‌ స్పేస్‌ లేకపోతే మరీ ఊపిరాడనట్టు అయిపోతుంది జీవితం అని నా అభిప్రాయం. ఆ మాత్రానికే రాత్రంతా ఏడుస్తూ జాగారం చేస్తూ కూర్చోవాలా? మళ్లీ పొద్దున్న లేచి నేను పట్టించుకోలేదన్నట్టు నిరసనొకటీ. అక్కడికి నేనేదో ఆఫీసూ, టైమూ, ట్రాఫిక్కూ ఇలా ఏ టెన్షన్లూ లేక తాపీగా ఉన్నట్టు. సాధ్యమైనంత త్వరలో హోమ్‌లోన్‌ తీర్చేసి మరో అస్సెట్‌ ఏదైనా ఇంకాస్త మంచి లొకాలిటీలో తీసుకోవాలని నా ఆలోచన. ‘ప్రస్తుతానికి మనకంటూ ఓ సొంతిల్లుంది కదా? మళ్లీ మరొకటి కొనడం కోసం ఎందుకంత హైరానా. కొన్నాళ్లైనా లైఫ్‌ని ఎంజాయ్‌ చేద్దాం’ అంటుంది. ఈలోగా ఏ ఆడపిల్లో పుడితే? పైగా లోను తీరగానే మళ్లీ పెరిగిపోయే టాక్స్‌ మాటేంటి? సరే పోనీ ఆ మాట అటుంచితే రేపు మలి వయసులో అయినా హాయిగా బ్రతికే భరోసా కావాలిగా అంటే ఏ మాత్రం ఎక్కదు ఆ మొండిఘటానికి. పైగా ‘ఇప్పుడు మంచి వయసులో, ఆరోగ్యంగా ఉండి కూడా సంతోషంగా ఉండడం ఎలాగో తెలియని నువ్వు రేపెప్పుడో వయసు మళ్లాక హాయిగా ఉండడం కోసం ప్లానింగా? చాలా తమాషాగా ఉందే!’ అని వెటకారం చేస్తుందా? అసలు నా కష్టం, నా ప్లానింగ్‌, డెడికేషన్‌ ఇవేవీ పట్టని ఆ చులకనేంటో నాకు అర్థంకాదు.

అర్థరాత్రికి ఇంకా పావుగంటే ఉంది. బెల్‌ శబ్దానికి నిద్ర కళ్లతో వచ్చి తలుపు తీసింది. భోజనం వడ్డిస్తూ మళ్లీ ఇంకేదైనా గోల మొదలెడుతుందేమో అని చూశాను. అదేం లేకుండా మౌనంగానే తింటోంది. ‘‘రేపు హౌస్‌ క్లీనింగ్‌, గ్రోసెరీ షాపింగ్‌ అయిపోతుంది కదా, ఎల్లుండి ఎలాగూ ఖాళీనేగా, ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఏదో వాటర్‌ ఫాల్స్‌ ఉందట. మన సొసైటీలో ఓ నాలుగైదు ఫ్యామిలీస్‌ వెళుతున్నాయి. మనం కూడా వెళ్దాం మనూ, ప్లీజ్‌! వారమంతా మళ్లీ ఒంటరిగా పడుండాలి, ఏదో జైల్లో బంధించేసినా ఇలా ఉండదేమో. మనం కూడా సరదాగా ఎటైనా వెళ్లి చాలా కాలమైంది కదా’’ పెట్టింది టెండరు.

చిరాకుని అణచుకొని సాధ్యమైనంత శాంతంగా చెప్పాను. ‘‘నాకు కుదరదు కావాలంటే నువ్వెళ్లిరా! వారమంతా అలసిపోయి ఆ రోజు కూడా అర్ధరాత్రి వరకూ తిరగడం నా వల్ల కాదు. ఆ రోజైనా కాస్త ప్రశాంతంగా గడపకపోతే మళ్లీ వారం, పనిలో చురుగ్గా ఉన్నట్లు అనిపించదు నాకు.’’
‘‘పోనీ రేపెళ్దామా? వాళ్లందరినీ నేనెలాగోలా ఒప్పిస్తాను, వచ్చాక గ్రోసెరీ షాపింగ్‌, క్లీనింగ్‌ అన్నీ నేనే మేనేజ్‌ చేస్తాగా. ఎల్లుండి, నువ్వు రెస్ట్‌ తీసుకోవచ్చు. ప్లీజ్‌!’’ గారాలు మొదలెట్టబోయింది.

ఇక లాభంలేదని ‘‘నాకిలాంటివి అంతగా ఇంట్రస్ట్‌ ఉండదని ఎన్నిసార్లు చెప్పాలి? రెండ్రోజులు దొరగ్గానే సరదాగా షికార్లు చేయడానికి మిగిలిన రోజులంతా నేను ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నాననుకున్నావా?’’ ఆఖరు మాట కాస్త వత్తి పలికి చేయి కడుక్కుని నా గదిలోకి వెళ్లిపోయాను.

‘‘నువ్వొక్కడివే ఉద్యోగం చేస్తున్నావా? అయినా ప్రతివారం బయటకి వెళ్దామని నేనెప్పుడూ అడగలేదుగా! అయితే అత్తయ్య వాళ్లింటికీ లేదా అమ్మవాళ్లింటికీ తప్ప మనమెక్కడికైనా వెళ్తున్నామా అసలు? రేపు ఆ ట్రిప్‌కి వెళ్ళే వాళ్లందరూ కూడా నీలా వారంలో ఐదు రోజులూ కష్టపడే వాళ్లేగా?

కానీ ఫ్యామిలీతో సరదాగా గడపడంలోనే వాళ్ల సంతోషాన్నీ, విశ్రాంతినీ వెతుక్కుంటున్నారు. నీలాగా ‘నా ఉద్యోగం, నా నిద్ర, నా జీవితం’ అంటూ గిరి గీసుకోకుండా ఫ్యామిలీని కూడా వాళ్ల జీవితాలలో భాగంగానే భావిస్తున్నారు’’

తన మాటలు వినపడుతున్నా కూడా తలుపు లాక్‌ చేసి మంచంమీద వాలిపోయాను. ‘నా నిద్రట...’ దెప్పుతోంది. పగలంతా కష్టపడి రాత్రికి హాయిగా నిద్రపోవాలి అనుకోవడం కూడా తప్పేనా? నేను నా జీవితం సినిమాలూ కథల్లోలా రొమాంటిక్‌గా ఉండాలి అని ఏరోజూ కోరుకోలేదు. వాస్తవానికి దగ్గరగా ఆలోచించే మనిషిని నేను. తను నా స్వభావానికి విరుద్ధం. కనీసం నిద్ర పోయినప్పుడైనా ఎలాంటి డ్రామాలకీ తావులేకుండా ప్రశాంతంగా ఉండాలని నా ఆశ. అందుకే ఇద్దరికీ ప్రత్యేకంగా గదులు. అలాగని తనేనాడూ నా అభిప్రాయాలను కాదని ఇబ్బంది పెట్టింది లేదు. కానీ ఈ గారాలు పోవడాలూ, ప్రేమ ఒలకబోయడాలూ ఇవన్నీ నాకెందుకో అసహజమైనవిగా, నాటకీయంగా తోస్తాయి. తనలో నాకు మరీ చిరాకనిపించే విషయం... ఏడవడం. ఇలా ఆలోచనలతో పాటే నిద్రలోకి జారిపోయాను.

రెండు వారాలైంది. ఆ రాత్రి తరువాత తను మళ్లీ నాకు ఎమోషనల్‌గా కనపడలేదు గానీ, ఎక్కువ మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉంటోంది. అలాఅని ముభావంగా, నిరసనగా కూడా ఏమీ లేదు. టీవీ చూస్తుండగా ఏదో కవర్‌ ఇచ్చింది చూడమని. ఏంటిది అంటూనే ఓపెన్‌ చేశాను. ఏదో ఆఫరింగ్‌ లెటర్‌లా ఉంది. నేనది చూస్తుంటే తను నాకు ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చుని చెప్పడం మొదలెట్టింది. ‘‘మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను ఇన్నాళ్లూ, మీరంటున్న ఆ అలసట, అలా విశ్రాంతి ఎరగకుండా పనిచేయడం ఇవన్నీ నాకూ అనుభవంలోకి వస్తే అయినా సరిగ్గా అర్థం చేసుకోగలనేమోనని ఒక చిన్న ప్రయత్నం అంతే. వాళ్ల మెయిన్‌ బ్రాంచ్‌కి దగ్గర్లో, ఒక ఆర్నెల్లపాటూ ట్రైనింగ్‌ ఉంటుంది. ఆ తర్వాత మన ఆప్షన్‌ మేరకు పోస్టింగ్‌, 60వేల శాలరీ. మీక్కూడా కాస్త ఏకాంతంగా, ప్రశాంతంగా ఉంటుందిగా’’ అని అమాయకంగా మొహం పెట్టి చూస్తోంది.

‘‘నేను చెప్పానా నువ్వుంటే నాకు ప్రశాంతంగా ఉండదని? అయినా ఆరునెలలు నువ్వు ఇంట్లో లేకుండా- అదీ వేరే సిటీలో ఉండడం అంటే నా పరిస్థితేంటనేది కొంచెమైనా ఆలోచించావా నువ్వసలు? నేనొక్కడినే ఎలా మేనేజ్‌ అవ్వగలను అన్న ఆలోచనగానీ, నా గురించి ఏమాత్రమైనా కన్సర్న్‌గానీ రెస్పాన్సిబిలిటీగానీ ఉంటే నువ్విలాంటి డెసిషన్‌ తీసుకోవు’’ కఠినంగా, నిష్టూరంగా అనిపించింది నా గొంతు నాకే.

‘‘మీరు కనీసం ‘ఒంటరిగా అక్కడ నువ్వెలా? అసలు మేనేజ్‌ చేయగలవా?’ అనడిగుంటే నేను నిజంగా ఇది వదులుకొని ఉండేదాన్ని... ఇన్నాళ్లకైనా నామీద కన్సర్న్‌, రెస్పాన్సిబిలిటీ ఫీలైనందుకు. ఇది మన లైఫ్‌ మనూ, కేవలం నీ ఒక్కడి లైఫే కాదు. మనిద్దరం కలిసి జీవించడం మొదలుపెట్టిన క్షణం నుంచీ నా అన్న ప్రతీదీ చంపేసుకుని నీకోసమే, నిన్ను సుఖంగా సంతోషంగా ఉంచడం కోసమే నేను బ్రతకడానికి చాలా ప్రయత్నించాను. కానీ నా మనసుందే- అది చావనంటుంది ఎంత చంపుకొందామన్నా. ఇరవైనాలుగ్గంటలూ నీకు అన్నీ అమరుస్తూ సదా మీ సేవలో అన్నట్టున్నా ‘ఇంట్లో ఖాళీగా కూర్చున్నట్టు’ అనిపిస్తుంది నీకు. సరే నేనూ ఉద్యోగం చేస్తానంటే ‘ఏం తక్కువని నువ్వూ సంపాదించాలి ఇప్పుడు’ అంటావు. అయినా ఈ విలాసవంతమైన వస్తువుల్లో సుఖసంతోషాల్ని వెతుక్కొనే స్థాయికి నేను రాలేనేమోలే! రేపు నేను మా అమ్మావాళ్లింటికి వెళుతున్నా. అక్కడ ఒక వారం ఉండి ముంబైకి వెళ్తాను జాయిన్‌ అవడానికి. నీకు వీలైతే సెండాఫ్‌ ఇవ్వడానికి రా!’’ తన నిర్ణయంలో ఏ మార్పూ ఉండదన్నట్టు స్థిరంగా చెప్పేసి తన రూమ్‌లోకి వెళ్లిపోయింది.

పొద్దున్నే నాకు బ్రేక్‌ఫాస్ట్‌ లంచ్‌ అన్నీ రెడీ చేసేసి, బస్టాండ్‌కి వెళ్లడానికి అనుకుంటా క్యాబ్‌ బుక్‌ చేసుకుని బయల్దేరింది. ‘‘ఎందుకివన్నీ చేయడం ఇప్పుడు?’’ అన్నాను. ఏమీ మాట్లాడలేదు కాసేపు. ‘‘రేపట్నుంచీ మీకు నచ్చింది తిందురుగానీ ఈ ఒక్కరోజుకి భరించండి’’ అదోలాంటి నవ్వుతో అంటూ బయలుదేరిపోయింది.

***

ఆఫీసుకి సెలవు కావడంతో పొద్దున్నే కాస్త ఆలస్యంగా లేచి ఫ్రెష్‌ అయ్యి కాఫీ కలుపుకుని బాల్కనీలోకి వచ్చాను. స్నిగ్ధ వెళ్లి మూడు రోజులేనా అయ్యింది అనిపించింది ఎందుకో. ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దం ప్రశాంతంగా మాత్రం లేదు. నేను బాగా ప్రాక్టికల్‌గా, పక్కా ప్లానింగ్‌గా ఉండాలనుకుంటానే తప్ప మెకానికల్‌గా ఉండాలని కోరుకునే మనిషిని కాను. భార్యని మరీ బానిసగా చూసేంత దుర్మార్గుణ్ణి ఏమాత్రం కాను. కానీ నా మీద నాకున్న అభిప్రాయాలు కూడా తప్పేమో అనిపిస్తోంది ఇప్పుడు. పని రాక్షసుడిలా కొట్టుకుపోయానా ఇన్నాళ్లూ? యాంత్రికంగా నా కోణంలో నుంచే జీవితాన్ని చూస్తూ బతికేశానా? భార్యతో రొమాంటిక్‌గా ఉంటే నా విలువ దిగజారి పోతుందని తప్పుగా భావించానా?

ఆలోచనల్లో పడి టైం కూడా గమనించలేదు. వెళ్లి స్నానం చేసి వచ్చి కూర్చున్నాను. ఏ పుస్తకం తీసినా చదవాలనిపించలేదు. ఎక్కడికీ ఎవరింటికీ వెళ్లే అలవాటు కూడా లేదు. ఎప్పుడూ నాదైన లోకంలో బతికేసే నన్ను ఈ ఒంటరితనం మొదటిసారిగా భయపెడుతోంది. ముసురుతున్న ఆలోచనల నుండి బయటపడడానికి నాకిష్టమైన ప్లేలిస్ట్‌ ఆన్‌ చేశాను. ‘‘ప్రియే... చారుశీలే...’’ అంటూ ఉన్నికృష్ణన్‌ గొంతులోంచి అత్యంత మధురంగా వస్తోంది జయదేవుని అష్టపది. చివర్న ‘‘జయతి పద్మావతి రమణ జయదేవ కవి’’ అన్న మాటల దగ్గరే ఆగిపోయి తిరుగుతోంది నా ఆలోచనంతా. జయదేవుడు, దైవికమైన ప్రేమతత్వాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించిన గొప్ప పండితుడు. కొన్ని శతాబ్దాల క్రితంవాడు. అయినా తన భార్య పట్ల అపారమైన ప్రేమను కలిగుండేవాడు. తన కావ్యాలలోనూ ‘పద్మావతి పతి’ అని తనను తాను చెప్పుకొన్నాడు. ఆ ఆలోచనల్లోనే మొన్న ఎక్కడో భారతియార్‌ గురించి చదివిన ఒక విషయం కూడా గుర్తొచ్చింది. భార్యను ప్రేయసిగానే కాదు తల్లిలా, కూతురిలా, ఇష్టసఖిలా, ఆరాధ్యదేవతలా భావించిన భారతియార్‌ను యుగానికెప్పుడో గానీ జన్మించని అరుదైన మహాజ్ఞాని, గొప్పకవి అంటారు తప్ప ఎవ్వరూ భార్య కొంగు పట్టుకు తిరిగాడు అనలేదు కదా?

భార్యతో రిజర్వుడుగా ఉండడం పురుష లక్షణం అనుకున్నాను. నేను అలాగే ఉంటున్నా అనుకున్నాను. భార్యతో చనువుగా ఒక స్నేహితుడిగా రొమాంటిక్‌గా మసలడం అనేది ఆధునిక అతి పోకడల్లో భాగం అని నా నమ్మకం.

భార్యతో రిజర్వుడుగా ఉండడం పురుష లక్షణం అనుకున్నాను. నేను అలాగే ఉంటున్నా అనుకున్నాను. భార్యతో చనువుగా ఒక స్నేహితుడిగా రొమాంటిక్‌గా మసలడం అనేది ఆధునిక అతి పోకడల్లో భాగం అని నా నమ్మకం. అందుకే, చేయీ చేయీ పట్టుకుని నడవడాలూ, ఒకరి ఒళ్లో మరొకరు పడుకుని ఊసులాడుకోవడాలూ ఇవన్నీ అర్థంలేని పనికిమాలిన డ్రామా అని తీసిపారేసేవాణ్ణి. నేను ఎన్నో గ్రంథాలు చదివాను, చదువుతున్నాను అని గర్వపడుతుంటాను ఎప్పుడూ. కానీ పెళ్లై ఇన్నాళ్లైనా ‘నేను’ అనే భావాన్ని ‘మనం’గా మార్చుకోలేకపోయాను. ఎందులోనైనా నేను అన్న భావన రానివ్వడమే దుఃఖానికి కారణం అని చాలాచోట్ల చదివాను. నా చుట్టూ ఉన్న కొందరు మనుషుల్లో ఆ స్వార్థ భావన చూసి జాలిపడి నవ్వుకునేవాణ్ణి కూడా. కానీ జీవితంలో స్నిగ్ధకి చెందిన ఆ మరోసగాన్ని నేనే ఆక్రమించేసిన అత్యంత స్వార్ధపరుణ్ణి అయిపోయానా? నా మనసులో నిజంగానే ఏ భావమూ లేదా స్నిగ్ధ పట్ల? స్నిగ్ధ ఎప్పుడూ నాకోసం ఏవేవో చేసేయాలని ఆరాటపడే పిచ్చిపిల్ల. తనేం కోరుకుంది అయినా... నాతో గడిపే సంతోషమయమైన క్షణాల కోసమే కదా ఎప్పుడూ తపిస్తూ ఉంటుంది. ఆమె కోపం, అలకా, ఆ కన్నీళ్ళూ అన్నీ నా కోసమే. అవును, ఆమె సర్వస్వం నాకోసమే అన్నట్టు బతుకుతోంది. మరి ఆమె కోసం నేను?

నా ఆలోచనల్ని భగ్నం చేస్తూ కాలింగ్‌ బెల్‌ మోగింది. తలుపు తీయగానే ఎదురుగా స్నిగ్ధ. మోగుతోన్న తన ఫోన్‌ నా చేతిలో పెట్టేసి మెల్లగా జారుకుంది. ఫోన్లో అమ్మ ‘‘ఏరా నాన్నా! స్నిగ్ధ ఇల్లు చేరిందా? మూడు రోజులైంది వచ్చి, నీకిష్టమని నేను చేసే వెజ్‌ బిర్యానీ, కట్‌లెట్స్‌ నేర్చుకుందామని వచ్చిందట. మొత్తానికి అనుకున్నది సాధించికానీ కదిలింది కాదు’’ అంటూ నవ్వుతోంది.

అమ్మతో మాట్లాడి వెంటనే ఫోన్‌ పెట్టేసి ఇల్లంతా వెతికాను. తను ఎక్కడా కనిపించలేదు. స్నానానికి వెళ్లిందేమో అనుకుంటూ సోఫాలో కూర్చున్నాను. సడన్‌గా వెనుక నుంచి వచ్చి నా కళ్లు మూసింది. చేయి పట్టి ముందుకి లాక్కున్నాను. ఆ ఊపుకి నా చేతుల్లో వాలిపోయింది. ఊహించని నా తీరుకి ఆశ్చర్యంగా చూస్తోంది. అంతలో తేరుకుని నా చేయిపట్టి లాక్కుపోయింది బాల్కనీలోకి. అక్కడ వెన్నెల్లో రెండు కుర్చీలూ చిన్న టీపాయ్‌ వేసి అందంగా డిన్నర్‌ రెడీ చేసి ఉంది. ఊరెళ్తానని నాతో చెప్పి, ఈ ఊళ్లోనే మరో చివర్న ఉండే మా అమ్మావాళ్లింటికి వెళ్లి, నాకిష్టమైన బిర్యానీ కష్టపడి నేర్చుకుని, ఇవన్నీ చేసుకుని తీసుకొచ్చిందన్నమాట. విషయమంతా నాకు అర్థమైనా ఏమీ తెలియనట్టు ‘‘ఎప్పుడు బయల్దేరుతున్నావు ఇంతకీ?’’ అన్నాను. ‘‘ఎక్కడికి?’’ అంది నేనూ ఏమీ తక్కువ తినలేదన్నట్లుగా. ‘‘అదే! ముంబై వెళ్తున్నావుగా?’’ అన్నాను. ‘‘ఇక్కడ మా బాస్‌ని వదిలి రాలేనని చెప్పాలే’’ అంది తను కొంటెగా. ‘‘పోనీ ఆ బాస్‌ ఉన్న ఊళ్లోనే ఇంకా ఎన్నో అవకాశాలున్నాయని కూడా చెప్పాల్సింది’’ అన్నాను. ఈసారి మరింత ఆశ్చర్యంగా చూసింది.

నేనదేం పట్టించుకోనట్టుగా ‘‘రెండు ప్లేట్లలో వద్దు ఒకదాన్లోనే పెట్టు చాలు’’ అన్నాను. ‘‘అదేంటీ వద్దా నీకు?’’ అంటూ బిక్క మొహం వేసిన ఆమె దగ్గరకు వెళ్లి కింద కూర్చుని తన ఒళ్లో తల పెట్టి ‘‘నాకు వద్దు అనడంలేదు, తినడమెలాగో రాదంటున్నాను అంతే’’ గోముగా అంటూ తలెత్తి ఆమె ముఖంలోకి చూశాను. నక్షత్రాలన్నీ రాశిగా వచ్చి దాక్కున్నంత వెలుగు ఆమె కళ్లలో.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న