ఒక్క టీపాయ్‌ మూడు రకాలుగా! - Sunday Magazine
close

ఒక్క టీపాయ్‌ మూడు రకాలుగా!

దైనా ఒక వస్తువు ఒకేలా పనికొచ్చేకన్నా మూడురకాలుగా ఉపయోగపడుతుందంటే గొప్పేగా. అలాంటిదే ‘మోడర్న్‌ రౌండ్‌ కాఫీ టేబుల్‌ విత్‌ స్టోరేజ్‌ లిఫ్ట్‌టాప్‌’. మొత్తం మూసి ఉన్నప్పుడు ఇది మామూలు టీపాయ్‌లా చిన్నగా ఉంటుంది. కానీ దీనికి అడుగు వైపున్న తెలుపు భాగాన్ని బయటికి లాగి, సోఫాలో కూర్చున్నప్పుడు కాళ్లు దానిమీదికి చాపుకోవచ్చు. లేదా స్నాక్స్‌లాంటివీ పెట్టుకోవచ్చు. ఇలా కాఫీ టేబుల్‌ మధ్యలో ఉన్న చెక్క భాగాన్ని కూడా విడిగా లాగొచ్చు. ఇక, వీటిలో ఉన్న అరల్లో ల్యాప్‌టాప్‌లూ పుస్తకాల్లాంటి వాటిని ఎంచక్కా సర్దుకోవచ్చు. బాగుంది కదూ..!

చిటికెలో తీసుకోవచ్చు!

హ్యాండ్‌ బ్యాగు ఒకటే కానీ అందులో ఉండే వస్తువులు ఎన్నో. క్రెడిట్‌ కార్డులు, ఐడీ కార్డులు, డబ్బులు, తాళాలు, లిప్‌స్టిక్‌, దువ్వెన, కళ్లజోడు, ఫోను, వాటర్‌ బాటిల్‌... ఇలా చిన్నచిన్న వాటినెన్నిటినో అందులో సర్దేస్తారు అమ్మాయిలు. కానీ అరలేమో అన్నేసి ఉండవు. దాంతో అవసరమైంది ఏదైనా ఠక్కున తియ్యాలంటే అది తప్ప చేతికి అన్నీ దొరుకుతాయి. ‘డ్రీమ్‌ వుమెన్‌ ఆర్గనైజర్‌ బ్యాగ్‌’ ఉంటే ఆ బాధంతా ఉండదులెండి. చుట్టూ జిప్‌లు ఉండే ఈ హ్యాండ్‌బ్యాగుని పెట్టెని తెరిచినట్లూ రెండువైపులా పూర్తిగా తెరవొచ్చు. అంతేకాదు, దీన్లో చిన్న వస్తువులన్నిటినీ విడివిడిగా పెట్టుకునేందుకు చాలా అరలుంటాయి. కాబట్టి, ఫొటోలో చూపినట్లు బ్యాగుని పూర్తిగా తెరిచి, ఏది కావాలన్నా చిటికెలో తీసుకోవచ్చు.

ఇక కారు వేడెక్కదు!

మామూలుగానే ఎండలో ఉంచితే కారు లోపలి భాగం వేడెక్కిపోతుంది. వేసవిలో అయితే, ఆ వేడిని భరించడం మనవల్ల కాదు. కానీ బయటికెళ్లి నప్పుడు పార్కింగ్‌కి ఎప్పుడూ నీడ ఉన్న ప్రదేశమే కావాలంటే దొరకదు. ఈ సమస్యకుపరిష్కారంగా కొత్తగా మార్కెట్లోకి వస్తున్నదే ఈ ‘ఆటో కూల్‌ వెంటిలేషన్‌ ఫ్యాన్‌’. కారుని ఎండలో ఉంచాల్సొచ్చినప్పుడు ఈ ఫ్యాన్‌ని దానికున్న క్లిప్‌ సాయంతో ఫొటోలో చూపినట్లు కారు అద్దానికి అమర్చి బటన్‌ నొక్కితే చాలు. ఇది వెంటిలేషన్‌ ఫ్యాన్‌లా పనిచేసి లోపల వేడెక్కకుండా చేస్తుంది. ఈ ఆటోకూల్‌ ఫ్యాన్‌ తిరగడానికి బ్యాటరీలు కూడా అవసరం లేదు. దీని వెనక ఉన్న సోలార్‌ ప్యానెల్‌ద్వారా ఇది సూర్యరశ్మి నుంచి కరెంటుని తయారుచేసుకుంటుంది మరి. ఈ ఫ్యాన్‌లు ఆన్‌లైన్‌లోనూ దొరుకుతున్నాయి.

పగలు అందం... రాత్రి వెలుగు!

హజమైనవే కాదు, కృత్రిమమైన పువ్వులైనా వాటి అందం వాటిదే. ఎన్నెన్నో వర్ణాల్లో ఆకర్షణీయమైన రూపాల్లో కనిపించే ఆ సుమాల గుత్తుల్నీ మొక్కల్నీ ఇంట్లో పెడితే వేరే అలంకరణతో పనే ఉండదు. అందుకే, ఈమధ్య నిజమైన వాటిలానే కనిపించే కృత్రిమ పువ్వులను చిన్న బొకేలతో పాటు చాలా పెద్ద సైజుల్లోనూ రూపొందిస్తున్నారు. ఇవి పగటి పూటే కాదు, చీకట్లోనూ అందాలను విరజిమ్ముతాయి. లైట్లనే ఆ రూపాల్లో తయారు చేస్తున్నారు మరి. వీటిలో చెట్లలా పెద్దగా ఉండే పూల లైట్లు వైర్ల సాయంతో కాంతులీనుతాయి. చిన్నగా ఉండే ‘పియోనీ బొకెట్‌ లైట్లు’ బ్యాటరీలతోనూ సెన్సర్లతోనూ పనిచేస్తూ ఎవరైనా అటువైపు రాగానే వెలుగుతాయి.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న