స్మార్ట్‌ డోర్‌బెల్‌! - Sunday Magazine
close

స్మార్ట్‌ డోర్‌బెల్‌!

ఇంట్లో పిల్లలో, మరీ పెద్దవాళ్లో ఉండి మనం బయటకు వెళితే చాలా కంగారుపడిపోతుంటాం. వారి భద్రత కోసమే ఎక్కువగా ఆలోచిస్తుంటాం. బోలెడన్ని ఆప్షన్లతో వస్తున్న స్మార్ట్‌ డోర్‌బెల్స్‌తో ఆ ఆలోచనకు చెక్‌ పెట్టొచ్చు. ఎక్కడున్నా మన ఇంటి కాలింగ్‌ బెల్‌ నొక్కిందెవరో తెలుసుకోవచ్చు. కావాలంటే మనం వాళ్లతో అక్కడినుంచే మాట్లాడొచ్చు కూడా. స్మార్ట్‌ డోర్‌ బెల్‌ని ఇంట్లో వైఫైకికనెక్ట్‌ చేసుకుని దానికి సంబంధించిన యాప్‌ని మన ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరి. కాలింగ్‌ బెల్‌ నొక్కగానే ఆ శబ్దంఇంట్లో ఉన్నవాళ్లకి వినిపించడంతో పాటూ సమాచారం మన ఫోన్‌ ద్వారా తెలిసిపోతూ వీడియో కనిపిస్తుంది. తలుపు తీయకుండానే వాళ్లకు జవాబు ఇచ్చే ఈ సెక్యూరిటీ బెల్‌ బాగుంది కదూ!


అందంగా ఆరేద్దామా!

హాల్లో అందరికీ కనిపించే అలంకరణ వస్తువైనా సరే వంటగదిలో వాడుకునే చిన్న వస్తువైనా సరే ప్రతిదీ వచ్చీపోయే అతిథుల్ని ఆకట్టుకునేలా ఉండాలనుకునే గృహిణులే ఎక్కువ. అందుకే కొనే ప్రతిదాంట్లోనూ నయాలుక్కూ, వెరైటీతో పాటూ దాని రూపురేఖలూ చూస్తుంటారు. మీరూ ఆ కోవకే చెందితే మార్కెట్లోకి కొత్తగా వస్తున్న ‘సర్కస్‌ వింటేజ్‌ ఆఫ్‌ ఓల్డ్‌ ఫ్యాషన్‌ లుక్‌ లాండ్రీ పిన్స్‌, మ్యూజిక్‌ నోట్‌ పిన్స్‌’ కొనేయండి. ఆరుబయట దండానికి ఆరేసిన దుస్తులపైనా కాస్తంత అందాన్ని ఒలకబోసేయండి. ఎప్పుడూ మామూలు క్లాత్‌ క్లిప్పుల్నే చూసినవారంతా వీటిని చూసి కచ్చితంగా ఆశ్చర్యపోతూ ‘బట్టల్ని కూడా భలే అందంగా ఆరేశారే’ అంటూ మీ అభిరుచిని మెచ్చుకుంటూ కితాబు ఇచ్చితీరుతారంతే!


ఈ వేరుసెనగ వింటుంది!

క్కడున్న ఫొటో దేనిదో చెప్పగలరా అంటే... ‘మాకేమైనా కళ్లు కనిపించవా ఏంటి? వేరుసెనక్కాయా, అందులోని పప్పులూ’ అనేస్తారు ఎవరైనా సరే. కానీ అక్షరాలా అది తప్పు సమాధానం. ఎందుకంటే ఆ ఫొటో మనం రోజూ పాటలు వినడానికో, ఫోను మాట్లాడ్డానికో వాడే ఇయర్‌ఫోన్స్‌ది. జపాన్‌కు చెందిన ‘సూపర్‌మార్కెట్‌ కకమూ’ అనే కంపెనీ వినూత్నమైన ఆలోచనతో ఈ ‘పీనట్‌ ఇయర్‌ఫోన్స్‌’ను తయారుచేసింది. ఇయర్‌ఫోన్సే కాదూ... వాటిని భద్రపరిచే కేసూ అచ్చుగుద్దినట్టు వేరుసెనక్కాయలానే ఉండేలా తీర్చిదిద్దింది. సరికొత్త రూపంతో గుటుక్కుమని నోట్లో వేసుకోవాలనిపించేలా ఉన్న ఈ ఇయర్‌ఫోన్స్‌ త్వరలో మార్కెట్లోకి రానున్నాయట!


సమోసా కాదండీ బాబూ!

‘అరె.. పేపర్‌పైన టీ గ్లాసు పెట్టారు. బాబోయ్‌ అది పడిపోతుందేమో! సమోసాని అలా కాగితం మీద ఉంచారేంటో’ అనుకుంటారు ఈ పేపర్‌ వెయిట్స్‌ని కొత్తగా చూసినవాళ్లు. చాలాచోట్లా కనిపించే పూలతో నిండిన గాజుపేపర్‌ వెయిట్స్‌కు భిన్నంగా ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాలవి కొత్తగా వస్తున్నాయి. సమోసా, బర్గరూ, టీ గ్లాసూ, పిజ్జా, వడాపావ్‌, బిస్కెట్లూ, ఎన్నెన్నో పండ్లూ... ఇలా బోలెడన్ని ఆహార పదార్థాల్లా ఈపేపర్‌ వెయిట్స్‌ కనిపిస్తూ చూసేవారిని ఆకట్టుకుంటున్నాయి.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న