ఈ కూరగాయలు పాడైపోవు! - Sunday Magazine
close

ఈ కూరగాయలు పాడైపోవు!

మార్కెట్లో కొన్నవైనా తోటలోనుంచి తాజాగా తెంపినవైనా ఫ్రిజ్‌లో పెడితే మహా అయితే పది రోజుల వరకూ ఉంటాయి. కానీ ఇప్పుడు రెండు మూడు నెలల వరకూ తాజాగా ఉండే కూరగాయలు... అదీ ముక్కలుగా కోసి మరీ వస్తున్నాయి.

పండ్ల మాదిరిగానే కూరగాయలకీ సీజన్‌ ఉంటుంది. ఉదాహరణకు కాలీఫ్లవర్‌, పచ్చి బఠాణీ, స్వీట్‌కార్న్‌, బ్రకోలి... వంటివి అన్ని కాలాల్లోనూ దొరకవు. అయితే ఆధునిక వ్యవసాయ పద్ధతులతో దాదాపుగా అన్ని కూరగాయల్నీ అన్ని కాలాల్లో పండిస్తున్నప్పటికీ, తరచూ మార్కెట్‌కి వెళ్లడం కుదరక ఒకేసారి తెచ్చుకుంటే, ఎంత ఫ్రిజ్‌లో పెట్టినా సగం పాడైపోతుంటాయి. అలాగే పాలకూర, చుక్కకూర, తోటకూర వంటివి ఎంత చల్లదనంలో ఉంచినా సూపర్‌మార్కెట్లలో కూడా రెండురోజులకే వాడిపోతాయి. అదీగాక అన్నీ అన్నిచోట్లా పండవు కూడా. మార్కెట్లో దొరికినా బిజీ జీవితంలో వాటిని శుభ్రం చేసి కడిగి కోసుకునే తీరికా ఉండకపోవచ్చు. ఆ సమస్య లేకుండా ఉండేందుకే బెండ, దొండ, సొర, కాకర... వంటి కూరగాయలన్నింటినీ ముక్కలుగా కోసి రెండుమూడు నెలల నుంచి ఏడాదివరకూ నిల్వ ఉండేలా శీతలీకరిస్తున్నారు.

ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో చేపలు, రొయ్యలు, మాంసం... వంటి వాటిని ఫ్రీజ్‌ చేసేవారు. క్రమంగా కూరగాయల్నీ అదే పద్ధతిలో నిల్వ చేయడం పెరిగింది. ఈ పద్ధతి ఇప్పుడు మనదగ్గరా రావడం విశేషం. శివార్లలో గేటెడ్‌ కమ్యూనిటీలూ హైరైజ్‌ భవంతుల కారణంగా తరచూ మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు తెచ్చుకోలేని వాళ్లు ఈ ఫ్రోజెన్‌ వెజిటబుల్స్‌ కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు.

ఎలా చేస్తారు?

సీజన్‌లో మాత్రమే దొరికే మామిడి, ఉసిరి.. వంటి వాటిని ఉప్పురాసి ఎండబెట్టి నిల్వ చేసి కూరల్లో వాడుకునే విధానం మనకీ వాడుకలో ఉంది. అదే పద్ధతిలో కూరగాయల్నీ ఎండబెట్టి నిల్వ చేసే పద్ధతి వాడుకలోకి వచ్చింది. అయితే అవి తాజాగా మారాలంటే మళ్లీ నీళ్లలో ఉడికించి వాడుకోవాలి. అదే ఈ ఫ్రోజెన్‌ వెజిటబుల్స్‌తో ఆ ఇబ్బంది ఉండదు. ఇందుకోసం కూరగాయలు లేదా ముక్కల్ని ముందుగా మరిగించిన నీటిలోగానీ వేడి ఆవిరిలోగానీ ఉంచుతారు. కొద్ది నిమిషాల్లోనే తీసి చల్లని నీటిలో వేయడం లేదా చల్లని గాలి తగిలేలా చేస్తారు. దాంతో అవి వేడికి ఉడకకుండా తాజాగా ఉంటాయి. ఈ పద్ధతినే బ్లాంచింగ్‌ అంటారు. ముందు వేడినీళ్లలో వేయడం వల్ల కూరగాయలమీద ఉన్న క్రిమిసంహారక మందులూ క్రిములూ చాలావరకూ తొలగిపోతాయి. కూరగాయల్లోపల ఉండే గాలి బయటకు పోవడంతో ఆక్సీకరణ ప్రక్రియ జరగదు. కూరగాయల్లో కుళ్లిపోవడానికి కారణమయ్యే కొన్ని ఎంజైమ్‌లూ క్రియాహీనమవుతాయి. కెటలాజ్‌, పెరిడాక్సిడేజ్‌... వంటి ఎంజైమ్‌లకు గురిచేయడం వల్ల కూరగాయల రంగూ రుచీ పోషకాలూ అన్నీ యథాతథంగా ఉంటాయి. ఇప్పుడు వాటిని ప్యాక్‌ చేసి ఫ్రీజర్లలో ఉంచడంతో కొన్ని నెలలపాటు తాజాగా ఉంటాయి. మనదగ్గర శాఫల్‌, గొద్రెజ్‌ యుమ్మీయెజ్‌, వాడిలాల్‌, ఫామ్‌ల్యాండ్‌, ఫ్రెషో... వంటి కంపెనీలు ఈ పద్ధతిలో కూరగాయల్ని ప్యాక్‌ చేసి సూపర్‌మార్కెట్ల ద్వారా అమ్ముతున్నాయి. మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కూరకోసం అయితే క్యారెట్లు, బఠాణీ, స్వీట్‌కార్న్‌, కాలీఫ్లవర్‌ వంటి వాటిని మిక్స్‌ చేసి కూడా ప్యాక్‌ చేస్తున్నాయి.

పోషకాలన్నీ ఉంటాయా?

సాధారణంగా కోసిన వెంటనే కూరగాయల్ని ఫ్రీజ్‌ చేసేస్తారు కాబట్టి పోషకాలు దాదాపుగా ఉంటాయి. అయితే మొక్కజొన్న, బఠాణీల్లాంటి వాటిల్లో సి-విటమిన్‌ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. నిజానికి చెట్టు నుంచి కోసిన 24 గంటల్లోనే బఠాణీల్లో విటమిన్‌-సి సగం తగ్గిపోతుందట. బీన్స్‌, పాలకూర వంటివాటిల్లో మాత్రం పెద్ద తేడా లేదనీ, తాజా బ్రకోలీకన్నా ఫ్రీజ్‌ చేసిన బ్రకోలీలోనే రిబోఫ్లేవిన్‌ శాతం ఎక్కువగా ఉందనీ ఓ పరిశోధనలో తేలింది. కేల్‌.. వంటి మరికొన్ని రకాల్లోనూ యాంటీఆక్సిడెంట్ల శాతం పెరిగినట్లు గుర్తించారు. అయితే చెట్టు నుంచి కోసిన కూరగాయలైనాగానీ ఉడికించినప్పుడో వేయించినప్పుడో వాటిల్లోని కొన్ని పోషకాలు దెబ్బతింటుంటాయి. కాబట్టి అవసరమైనప్పుడు ఫ్రీజ్‌ చేసిన వాటిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. పైగా సీజన్‌లోనే కాకుండా ఏడాది పొడవునా బఠాణీ, మొక్కజొన్న, కాలీఫ్లవర్‌... వంటివి తినడం వల్ల ఆరోగ్యకరమైన పోషకాలన్నీ అందుతాయి. ఏమంటారు?

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న