వ్యర్థ జల విద్యుత్తు
close

Updated : 29/09/2021 06:15 IST

వ్యర్థ జల విద్యుత్తు

ట్టణాలు విస్తరిస్తున్నకొద్దీ వ్యర్థ జలాలూ ఎక్కువైపోతున్నాయి. వీటిని సమర్థంగా, తక్కువ ఖర్చుతో శుద్ధి చేయటానికి కొత్త కొత్త పద్ధతుల కోసం శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిజానికి సేంద్రియ వ్యర్థ పదార్థాల్లో నిగూఢంగా చాలా ఇంధనం దాగుంటుంది. ఇళ్ల నుంచి వెలువడే వ్యర్థ జలాల్లో వీటిని శుద్ధి చేయటానికి అవసరమైన దాని కన్నా 9 రెట్లు ఎక్కువ ఇంధనం ఉంటుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఒడిసి పట్టుకోవటంపై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది.  ఈ నేపథ్యంలో ఐఐటీ జోధ్‌పుర్‌ పరిశోధకుల అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.  వృక్ష ఆధారిత మైక్రోబియల్‌ ఫ్యూయెల్‌ సెల్స్‌తోనూ (ఎంఎఫ్‌సీ) వ్యర్థ జలాల నుంచి లాభదాయకంగా విద్యుత్తును సృష్టించొచ్చని తొలిసారిగా నిరూపించారు. ఎంఎఫ్‌సీలు సూక్ష్మజీవుల సాయంతో వ్యర్థ జలంలోని సేంద్రియ పదార్థాన్ని నేరుగా విద్యుత్తుగా మారుస్తాయి. విద్యుత్తు తయారీకి సూక్ష్మక్రిములను ఉపయోగించుకోవచ్చని 1911లోనే మైఖేల్‌ పాటర్‌ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. కాకపోతే ఈ సిద్ధాంతాన్ని ఫ్యూయెల్‌ సెల్స్‌లో వాడుకోవటం ఇటీవలే మొదలైంది. ఎంఎఫ్‌సీలో సజీవ సూక్ష్మక్రిములు వ్యర్థ సేంద్రియ పదార్థంలోని ఎలక్ట్రాన్‌ బంధాలను విడగొట్టి, ఎలక్ట్రాన్లు విడుదలయ్యేలా చేస్తాయి. ఇవి యానోడ్‌ నుంచి కాథోడ్‌కు చేరుకునే క్రమంలో విద్యుత్తును పుట్టిస్తాయి. కిరణజన్య సంయోగక్రియ మైక్రోబియల్‌ ఫ్యూయెల్‌ సెల్స్‌ సాధారణంగా ఆల్గే లేదా మొక్కలను ఉపయోగించుకుంటాయి. మొక్కల వేళ్ల నుంచి ఉత్పత్తయ్యే సేంద్రియ పదార్థంలోని ఎలక్ట్రాన్లను సూక్ష్మక్రిములు విడగొడతాయి. ఇవి ఫ్యూయెల్‌ సెల్స్‌లోని కాథోడ్‌ వద్ద విద్యుత్తుగా మారతాయి. ఇటీవలి కాలంలో ఆల్గే ఆధారిత పద్ధతుల మీదే ఎక్కువగా అధ్యయనాలు జరిగాయి. ఎందుకంటే ఆల్గే త్వరగా పెరుగుతుంది. కానీ ఇది చాలా సున్నితమైంది. అన్ని చోట్లా పెంచటం కుదరదు. ఇక వృక్ష ఆధారిత ఎంఎఫ్‌సీలను అంత త్వరగా నిర్మించటం కుదరదు. వీటితో ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి కాదు కూడా. అయితే మెట్ట తామరతో (కానా ఇండికా) ఎక్కువ విద్యుత్తును సృష్టించొచ్చని ఐఐటీ జోధ్‌పుర్‌ పరిశోధకులు గుర్తించటం విశేషం. మొక్కలతో కూడిన ఎంఎఫ్‌సీలతోనూ విద్యుత్తును బాగానే ఉత్పత్తి చేయొచ్చని దీంతో రుజువైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న