close
లిథియం బ్యాటరీ సృష్టికర్తలకు నోబెల్‌

అత్యున్నత పురస్కారానికి ఎంపికైన గుడెనవ్‌, విట్టింఘమ్‌, యోషినో
రసాయన శాస్త్ర విభాగంలో ప్రకటన
నోబెల్‌కు ఎంపికైన అతిపెద్ద వయస్కుడిగా గుడెనవ్‌ రికార్డు

స్టాక్‌హోం: మానవాళి చరిత్రలో విప్లవాత్మక ఆవిష్కరణల్లో ఒకటిగా పేరుగాంచిన ‘లిథియం అయాన్‌ బ్యాటరీ’ సృష్టికర్తలు జాన్‌ గుడెనవ్‌, స్లాన్లీ విట్టింఘమ్‌, అకీరా యోషినోలకు సముచిత గౌరవం లభించింది. తమ పరిశోధనలతో ఎన్నెన్నో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీకి, శిలాజ ఇంధన రహిత సమాజానికి బాటలు పరిచినందుకుగాను రసాయన శాస్త్ర విభాగంలో అత్యున్నత నోబెల్‌ పురస్కారం వారిని వరించింది. గుడెనవ్‌ అమెరికాకు చెందినవారు కాగా, విట్టింఘమ్‌ బ్రిటన్‌ పౌరుడు. యోషినో జపాన్‌కు చెందిన పరిశోధకుడు. స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోంలో ఈ ఏడాది డిసెంబరు 10న జరగనున్న వేడుకలో ఈ ముగ్గురు ‘నోబెల్‌’ను స్వీకరిస్తారు. పురస్కారంతోపాటు అందే రూ.6.50 కోట్ల నగదు బహుమతిని సంయుక్తంగా పంచుకుంటారు. గుడెనవ్‌ వయసు 97 ఏళ్లు. అతిపెద్ద వయసులో నోబెల్‌ పురస్కారం గెల్చుకున్న వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు.

 

‘‘తేలికైన, రీఛార్జ్‌ చేసుకోదగిన, శక్తిమంతమైన లిథియం అయాన్‌ బ్యాటరీని మొబైల్‌ ఫోన్‌ల దగ్గరి నుంచి ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు.. ఇలా అన్నింటిలో ఉపయోగిస్తున్నాం. సౌర, పవన విద్యుత్తు శక్తిని గణనీయ పరిమాణంలో నిల్వ చేసేందుకూ అది దోహదపడుతోంది. తద్వారా శిలాజ ఇంధన రహిత సమాజానికి బాటలు పరుస్తోంది. 1991లో లిథియం బ్యాటరీలు తొలిసారి విపణిలోకి ప్రవేశించాయి. నాటి నుంచి మానవ జీవితాల్లో అవి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. మానవాళికి ఈ బ్యాటరీ అత్యంత గొప్ప బహుమానం’’ అని నోబెల్‌ పురస్కారాల కమిటీ కితాబిచ్చింది. యోషినో ప్రస్తుతం టోక్యోలోని అసాహి కసీ కార్పొరేషన్‌లో పనిచేస్తున్నారు. నగోయాలోని మీజో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గానూ సేవలందిస్తున్నారు. గుడెనవ్‌ టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. బింఘమ్‌టన్‌ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా విట్టింఘమ్‌ విధులు నిర్వర్తిస్తున్నారు.

ఆవిష్కరణ ఇలా
ఒకప్పుడు ప్రపంచమంతటా చమురు అతిపెద్ద శక్తి వనరుగా ఉండేది. 1970ల్లో దాని ధరలు భారీగా పెరిగాయి. తీవ్ర సంక్షోభం తలెత్తింది. ప్రత్నామ్నాయ శక్తి వనరు కోసం అన్వేషణ ముమ్మరమైంది. అందులో భాగంగానే.. లిథియంలోని అంతర్గత శక్తిని మెరుగ్గా ఉపయోగించుకునే ఉపాయాన్ని స్లాన్లీ విట్టింఘమ్‌ కనుగొన్నారు. లిథియం అనేది నీటిపై తేలియాడేటంత తేలికైన లోహం. పాక్షికంగా లిథియం మూలకాన్ని ఉపయోగించి ఓ బ్యాటరీని ఆయన తయారు చేశారు. ఎలక్ట్రాన్లను కోల్పోవడం ద్వారా అందులో శక్తిని లిథియం ప్రసరింపజేసింది. అస్థిరత్వం కారణంగా ఆ బ్యాటరీ వినియోగానికి మాత్రం పనికిరాలేదు.

వాణిజ్య వినియోగానికి అనుకూలంగా..
విట్టింఘమ్‌ తయారుచేసిన బ్యాటరీ తరహా నమూనానే ఆపై గుడెనవ్‌ తయారుచేశారు. అందులో లిథియంతోపాటు భిన్నమైన లోహ సమ్మేళనాన్ని ఉపయోగించడం ద్వారా బ్యాటరీ పొటెన్షియల్‌ ఎనర్జీని రెట్టింపు చేశారు. శక్తిమంతమైన, మన్నికైన బ్యాటరీల తయారీకి ఈయన కృషి మార్గం సుగమం చేసింది. అనంతరం లిథియం అయాన్లను నిల్వ చేసే కర్బన ఆధారిత పదార్థాన్ని ఉపయోగిస్తూ 1985లో యోషినో బ్యాటరీని తీర్చిదిద్దారు. ఫలితంగా బ్యాటరీ వాణిజ్యపరమైన వినియోగానికి అనుకూలంగా మారింది. ఇలా ముగ్గురు శాస్త్రవేత్తల కృషితో అత్యంత శక్తిమంతమైన, తేలికైన, రీఛార్జ్‌ చేసుకునేందుకు వీలైన లిథియం అయాన్‌ బ్యాటరీ ఆవిష్కృతమైంది.

దశ-దిశను మార్చిన ఆవిష్కరణ
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ మనుషుల చేతికి ఆరో వేలుగా మారింది! అది లేకపోతే ఒక పూట కాదు కదా.. క్షణం కూడా గడవదన్నట్లు ప్రస్తుత పరిస్థితి ఉంది. ఇక ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు.. ఇలా ఎన్నెన్నో ఉపకరణాలు మానవాళికి దాదాపు నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. లిథియం అయాన్‌ బ్యాటరీ ఆవిష్కరణే వీటన్నింటి అభివృద్ధికి దోహదపడిందంటే అతిశయోక్తి కాదు!


నోబెల్‌ శాంతి రేసులో గ్రెటాథెన్‌బర్గ్‌!

ఓస్లో: ‘‘ఒట్టి మాటలతో నా స్వప్నాలను, బాల్యాన్ని హరించిన మీ కెంత ధైర్యం?’’ అంటూ ప్రపంచ దేశాల నేతలనే ప్రశ్నించి, వాతావరణ మార్పులపై ఉద్యమించిన చిన్నారి గ్రెటా థెన్‌బర్గ్‌కు ‘నోబెల్‌ శాంతి’ లభించవచ్చన్న అభిప్రాయాలు కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే, కొందరు మాత్రం ఆ వాదనతో ఏకీభవించడం లేదు. ఇప్పటికే థెన్‌బర్గ్‌ ప్రతిష్ఠాత్మక ‘రైట్‌ లైవ్‌లీహుడ్‌ అవార్డు’ను అందుకున్న విషయం గమనార్హం. ‘లాడ్‌బ్రోక్స్‌’ వంటి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సైట్‌లు థెన్‌బర్గ్‌కు నోబెల్‌శాంతి వస్తుందంటుంటే.. ఓస్లోలోని ‘పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ సంచాలకులు హెన్రిక్‌ ఉర్దల్‌ వంటివారు తద్భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘స్టాక్‌హోం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ’(సిప్రి) సంచాలకులు డాన్‌స్మిత్‌ మాత్రం థెన్‌బర్గ్‌ను ‘నోబెల్‌శాంతి’కి పరిగణించవచ్చని పేర్కొన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.