close

తాజా వార్తలు

నిబంధనలపైనిర్లక్ష్యమేల?

ఇష్టారాజ్యంగా మద్యం దుకాణాల నిర్వహణ

చోద్యం చూస్తున్న అధికారులు

కొత్త వాటికైనా పాటించాలంటున్న ప్రజలు

ఈనాడు, వరంగల్‌

పాత మద్యం దుకాణాల గడువు ముగిసింది. కొత్తవి నవంబరు 1 నుంచి ఏర్పాటు కానున్నాయి. ఈ క్రమంలో నిబంధనలు పాటించకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు. నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమవుతుండడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత ఇటు ఆబ్కారీ, అటు పోలీసు శాఖలపై ఉన్నా.. పట్టించుకోవడం లేదు. ఇకనైనా ఓ కన్నేస్తే బాగుంటుంది.

అడ్డగోలు పర్మిట్‌లు

మద్యం దుకాణాలకు అనుమతి గదులను ఎక్సైజ్‌ శాఖ ఇస్తోంది. పేరుకు పర్మిట్‌ రూంలు ఉన్నా, మందుబాబులు రోడ్లపైనే మద్యం తాగుతున్నారు. అలా వందలాది మంది గుమిగూడడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. సామాన్యులు ఎవరైనా నిలదీస్తే తమకు పర్మిట్‌ రూం ఉందని సాకు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం లోపలే తాగాలి. బయటికి వస్తే అవి ఉల్లంఘించినట్టే. దీనిపై సంబంధిత శాఖలు చర్యలు తీసుకొనే అధికారం ఉన్నా... ఆ దిశగా అడుగులు మాత్రం వేయడం లేదు. ఈసారైనా పర్మిట్‌రూం వ్యవస్థను పటిష్ఠం చేస్తే ప్రజలకు అవస్థలు తప్పుతాయి.

వంద మీటర్ల దూరంలోనే..

మద్యం దుకాణాలను పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ప్రార్థనాలయాలు, దేవాలయాలు, తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేయడం నిషేధం. వీటికి వంద మీటర్ల దూరంలోనేే పెట్టాలి. ఈ నిబంధన నగరాలు, పట్టణాల్లో సరిగా అమలు కావడం లేదు. ఏర్పాటుకు ముందే అధికారులు పరిశీలించి అనుమతి ఇవ్వాలి. పైపై తనిఖీలు చేసి అనుమతి ఇస్తుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.

పక్కా నిఘా మధ్య..

ప్రతి చోట మూడు సీసీ కెమెరాలు ఉండాలి. పట్టణాల్లో కొంత వరకు పెడుతున్నా... గ్రామీణ ప్రాంతాల్లో పట్టించుకోవడం లేదు. 21 ఏళ్ల లోపు వారికి విక్రయించకూడదు. ఇటీవల తరచూ మందుబాబులు తాగి గొడవలకు దిగుతున్నారు. నిఘా నేత్రాలు పక్కాగా ఉంటే ఈ నిబంధనలన్నీ అమలయ్యేందుకు దోహదపడతాయి. పేరుకు ఒకటి రెండు చూపుతున్నా, అవి సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేది చూడడం లేదు.

జాతీయ రహదారులకు దూరమేది..

జాతీయ రహదారులకు దూరంగా పెట్టాలనే నిబంధన ఉంది. కనీసం 250 మీటర్ల దూరంలో నిర్వహించాలి. మున్సిపాలిటీలు, మహానగర పాలక సంస్థల్లో ఈ నిబంధన వర్తించదు. కాకపోతే అనేక చోట్ల జాతీయ రహదారులకు సమీపంలో పెడుతున్నారు. వాహనదారులకు మద్యం విరివిగా లభ్యమవుతోంది. తాగి ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.

వేళాపాళా లేకుండా..

అమ్మకాలకు వేళాపాళా ఉండట్లేదు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకే విక్రయాలు కొనసాగించాల్సి ఉన్నా, రాత్రి 11.30 దాటినా అమ్ముతున్నారు. ముఖ్యంగా వరంగల్‌ నగరంలో వైన్స్‌కు, బార్లకు సమయం లేకుండా పోతోంది. రాత్రి 12 తర్వాత కూడా నడుస్తుండడంతో గొడవలు జరుగుతున్నాయి. హత్యలు చోటుచేసుకుంటున్నాయి. సమయ నిబంధన మీద నజర్‌ వేయాలి.

ప్రతి గ్రామంలో..

గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. కారణం అడ్డగోలుగా పుట్టుకొస్తున్న బెల్టు దుకాణాలే. ఊళ్లలో ఎక్కడా వాటికి అనుమతి లేదు. ప్రతి పల్లెలో కనీసం అయిదారు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శాంతిభద్రతల సమస్యలు ఎదురవుతున్నాయి. ఆగడాలు పెరుగుతున్నా పోలీసులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్క వరంగల్‌ అర్బన్‌ జిల్లా అబ్కారీ శాఖకే గొలుసు దుకాణాలపై 250 ఫిర్యాదులు అందాయి. ఇలా చూస్తే ఉమ్మడి జిల్లాలో వెయ్యికిపైగా ఉన్నాయి. అధికారులు ఉక్కుపాదం మోపితేనే గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.