CUET PG 2024: సీయూఈటీ (పీజీ) దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఈ మార్పులు తెలుసా?

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (CUET-PG) దరఖాస్తుల గడువును ఎన్టీఏ మరోసారి పొడిగించింది.

Updated : 31 Jan 2024 18:53 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (CUET-PG) దరఖాస్తుల గడువును ఎన్టీఏ మరోసారి పొడిగించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం డిసెంబర్‌ 17న ప్రారంభమైన దరఖాస్తుల గడువు ఇటీవల పొడిగించగా.. నేటితో ఆ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7వరకు మరోసారి పొడిగిస్తూ తాజాగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నిర్ణయం తీసుకుంది. దీంతో అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 7 అర్ధరాత్రి  11.50గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు గడువు ఇచ్చింది. మార్చి 11 నుంచి 28వ తేదీ ఎంట్రన్స్‌ పరీక్ష వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు అడ్వాన్స్‌ సిటీ ఇన్ఫర్మేషన్‌ను మార్చి 4న విడుదల చేస్తారు. అడ్మిట్‌ కార్డుల్ని మార్చి 7నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  అయితే, గతేడాదితో పోలిస్తే ఈసారి ఈ పరీక్షలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

రైల్వేలో 5,696 ఉద్యోగాలకు వయో పరిమితిలో మార్పు.. పరీక్షల టైం లైన్‌ ఇదే..!

దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి

ఆ మార్పులివే..

  • గతేడాది సీయూఈటీ- పీజీ పరీక్షను రెండు గంటల పాటు నిర్వహించగా.. ఇప్పుడు ఆ సమయాన్ని 1.45 గంటలకు కుదించారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష మూడు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. షిఫ్టుల వారీగా సమయాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
  • పరీక్షలో మొత్తం ప్రశ్నల సంఖ్యను 100 నుంచి 75కి తగ్గించారు. 
  • అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌ ఫీజును భారీగా పెంచారు. గతేడాది జనరల్‌ కేటగిరీ విద్యార్థులు రూ.1000 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించగా.. ఈసారి దాన్ని రూ.1200కు పెంచారు. అలాగే, ఓబీసీ-ఎన్‌సీఎల్‌/జనరల్‌- ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1000; ఎస్సీ/ఎస్టీ/హిజ్రాలు రూ.900; దివ్యాంగులు రూ.800 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
  • 2023లో గరిష్ఠంగా 20 పేపర్ కోడ్‌లను విద్యార్థులు ఎంపిక చేసుకొనే అవకాశం ఉండగా.. ఈసారి మాత్రం ఆ సంఖ్యను 4 పేపర్‌ కోడ్‌లకు మాత్రమే పరిమితం చేశారు.
  • ఒక్కో సమాధానానికి నాలుగు మార్కులు ఇస్తారు. తప్పుడు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని