CUET UG 2024: హైబ్రిడ్‌ పద్ధతిలో సీయూఈటీ (యూజీ) ఎగ్జామ్‌.. దరఖాస్తులు షురూ

సీయూఈటీ (యూజీ) 2024 పరీక్షకు దరఖాస్తులు మొదలయ్యాయి. 

Published : 27 Feb 2024 21:08 IST

CUET UG 2024 Exam: దేశవ్యాప్తంగా సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ- యూజీ (CUET UG 2024) పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ పరీక్షను హైబ్రిడ్‌ పద్ధతి (ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌)లో నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) మంగళవారం రాత్రి ప్రకటించింది. కొన్ని సెంటర్లలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT), మరికొన్నింటిలో పేపర్‌, పెన్ను విధానంలో నిర్వహిస్తామని స్పష్టం చేసింది. గతంలో మాదిరిగా 10 సబ్జెక్టులు కాకుండా ఈసారి ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా ఆరు సబ్జెక్టుల్ని మాత్రమే ఎంచుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. (సమాచార బులిటెన్‌)

సీయూఈటీ (యూజీ) పరీక్షకు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 26న అర్ధరాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ పరీక్షను మే 15 నుంచి 31 మధ్య వివిధ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో 27 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 380 పట్టణాలు, విదేశాల్లోని 26 పట్టణాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. CUET UG 2024 Exam ఫలితాలను జూన్‌ 30న విడుదల చేస్తారు. 

దరఖాస్తు రుసుం మూడు సబ్జెక్టుల వరకైతే జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు ₹1000, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ ₹900, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్‌ జెండర్‌ ₹800, ఇతర దేశాల్లో అభ్యర్థులు ₹4,500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా ఒక్కో సబ్జెక్టుకు జనరల్‌ అభ్యర్థులకు ₹400, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ ₹375, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్‌జెండర్‌ ₹350, ఇతర దేశాల్లో ₹1,800ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని