ఏఐ రౌండ్‌కి సిద్ధమేనా?

కంపెనీలో ఖాళీల గురించి తెలిసి అప్లికేషన్‌ పెట్టారు. కాల్‌ వచ్చింది. కాసేపు ఇంటర్వ్యూ అయ్యింది. ఉద్యోగానికి ఆన్‌లైన్‌లో అప్లై చేశారు. వెంటనే రిప్లై వచ్చింది. ఇంటర్వ్యూలు, ఇంతలోనే ఫలితాలు.. ఇవన్నీ మనుషులే చేస్తున్నారనుకుంటే పొరపాటు పడినట్లే.

Published : 12 Sep 2019 00:09 IST

నియామకాల్లో నూతన ధోరణి

మెలకువలు పెంచుకుంటే సులువే

కంపెనీలో ఖాళీల గురించి తెలిసి అప్లికేషన్‌ పెట్టారు. కాల్‌ వచ్చింది. కాసేపు ఇంటర్వ్యూ అయ్యింది. ఉద్యోగానికి ఆన్‌లైన్‌లో అప్లై చేశారు. వెంటనే రిప్లై వచ్చింది. ఇంటర్వ్యూలు, ఇంతలోనే ఫలితాలు.. ఇవన్నీ మనుషులే చేస్తున్నారనుకుంటే పొరపాటు పడినట్లే. ఆ పనులన్నింటినీ కొన్ని ప్రసిద్ధ సంస్థల్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ చేసేస్తోంది. రెజ్యూమెల స్కానింగ్‌, ఇంటర్వ్యూ షెడ్యూలింగ్‌లను దాటి ఏకంగా మౌఖిక పరీక్షలూ నిర్వహించేస్తోంది. వీటిలో విజయం సాధించాలంటే ఈ ఆటోమేషన్‌ యుగానికి అనుగుణంగా అభ్యర్థులు సిద్ధం కావాలి.

ఖాళీలు పదుల్లో.. దరఖాస్తులు వందల్లో.. నియామకాలు నెలల్లో.. ఇప్పటిదాకా పరిస్థితి ఇది. ఇక ముందు ఇలా ఉండబోదు. ఎన్ని పోస్టులు ఉన్నా.. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా.. రోజుల్లోనే ఖాళీల భర్తీ ఖాయం. రోబోలే రిక్రూట్‌మెంట్‌ ఆఫీసర్లు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సాయంతో, ఆటోమేషన్‌తో సంస్థలు నాణ్యమైన సిబ్బంది నియామక ప్రక్రియలను వేగంగా పూర్తి చేస్తున్నాయి. వార్తాపత్రికలు, వెబ్‌సైట్లలో ప్రకటనలు, సోషల్‌ మీడియాలో సమాచార సేకరణ.. ఇలా ఉద్యోగుల ఎంపికలో సంస్థలు ఎన్నో పద్ధతులను పాటిస్తున్నాయి. ఇప్పుడు ట్రెండ్‌ మారుతోంది. టెక్నాలజీ సాయంతో ఎంపిక ప్రక్రియల్లో మెరుగైన విధానాలను అనుసరిస్తున్నాయి. వేల దరఖాస్తులను వేగంగా పరిష్కరించి సరైన సిబ్బందిని ఎంచుకుంటున్నాయి.

ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ - కృత్రిమ మేధ) ఆధారిత రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియతో కంపెనీలకు సమయం ఆదా అవుతోంది. ఖర్చును తగ్గిస్తోంది. మెరుగైన మానవ వనరులను ఎంపిక చేయటానికి సాయపడుతోంది. పక్షపాత ధోరణికి ఆస్కారం ఉండదు. సంస్థకు సంబంధించి వ్యక్తిగత డేటాబేస్‌ను ఏర్పరచుకునే వీలుంటుంది. దీంతో అప్పటికి అవసరమైన అభ్యర్థులను ఎంచుకోవడంతోపాటు భవిష్యత్తుకి పనికొచ్చేవారి వివరాలనూ అందుబాటులో ఉంచుకోవచ్ఛు ఏఐ అభ్యర్థుల నాణ్యతను కనిపెట్టడంలో కచ్చితత్వాన్ని పాటిస్తుంది.

అభ్యర్థులేం చేయాలి?

నియామకాల్లో ఏఐ వినియోగం పెరుగుతోంది. అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని నైపుణ్యాలను పెంపొందించుకోవాలి.

దరఖాస్తు: దరఖాస్తు సమయంలో పోస్టుకు తగ్గ పదాలను రెజ్యూమెలో ఉపయోగించాలి. వాటిని జాబ్‌ డిస్క్రిప్షన్‌ నుంచి పొందవచ్ఛు పోస్టుకు అవసరమైన నైపుణ్యాలను పరిశీలించుకుని, దరఖాస్తులో వాటికి స్థానం కల్పించాలి. పరిమితంగా కాకుండా వాటిని వివరంగా చెప్పగలగాలి. ఉదాహరణకు ‘నాయకత్వ లక్షణాలు’ అని క్లుప్తంగా వదిలేయకుండా.. ‘కళాశాలలో నిర్వహించిన ఫెస్ట్‌లో బృందానికి నాయకత్వం వహించాను, ఫలానా పని సమయం కంటే ముందుగా పూర్తి చేయగలిగాను, బడ్జెట్‌ను మిగల్చగలిగాను’- ఈ తరహాలో రాయాలి.

వచ్చిన లేదా అదనపు అంశాలన్నీ చేర్చకుండా, వేటిలో నిష్ణాతులో వాటికే స్థానం కల్పించాలి. విషయం ఏదైనా స్పష్టంగా తెలియజేయాలి. స్పెల్లింగుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఇందుకు అవసరమైతే ఆన్‌లైన్‌ టూల్స్‌ సాయాన్నీ తీసుకోవచ్ఛు రెజ్యూమెలో పొందుపరిచిన ప్రతి విషయంపై అభ్యర్థికి అవగాహన ఉండితీరాలి.

స్కిల్‌ టెస్ట్‌: వీటిల్లో ఎక్కువ శాతం అభ్యర్థి రాసిన కంటెంట్‌/ మాట్లాడిన అంశాన్ని ఏఐ పరిశీలిస్తుంది. అందుకే చెప్పాలనుకున్న అంశాన్ని వర్ణనాత్మకంగా కాకుండా సూటిగా చెప్పాలి. ఒక్కోసారి ఏదైనా టాస్క్‌ ఇచ్చి చేయమని చెప్పవచ్ఛు ఉదాహరణకు- కస్టమర్‌ నుంచి ఫీడ్‌బ్యాక్‌ ఎలా తీసుకుంటారు? ఈ ఏడాది మార్కెటింగ్‌ డేటాను కస్టమర్లకు ఎలా వివరిస్తారు? లేదా పరిశ్రమకు సంబంధించి నచ్చిన ఏదైనా అంశం, అందుకు కారణాలు.. ఇలా వేటినైనా అడగవచ్ఛు ఇందుకోసం పరిశ్రమ, సంస్థల గురించి అవగాహన పెంచుకోవాలి. ఒక సంస్థ ప్రొడక్ట్‌, మార్కెట్‌, కస్టమర్లు, ఫీడ్‌బ్యాక్‌..తదితర రియల్‌ టైం వర్క్‌కు సంబంధించిన అంశాల గురించి తెలుసుకోవాలి.

ఇంటర్వ్యూ: వోకల్‌ టోన్‌కూ, జాబ్‌ డిస్క్రిప్షన్‌లోని కీవర్డ్‌లకు ప్రాధాన్యమివ్వాలి. ఏం చెబుతున్నారనే దానిపైనే కాకుండా ఎలా చెబుతున్నారన్న దానిపైనా ఏఐ దృష్టిపెడుతుందని గమనించాలి. ఇతర అర్హతలు ఉన్న అభ్యర్థులతో పోల్చి, దాని ఆధారంగా ర్యాంకు ఇస్తుంది. కాబట్టి, ఆత్మవిశ్వాసం తప్పనిసరి. సాధారణ ఇంటర్వ్యూలాగానే చిరునవ్వు, శరీర భాషలకు ప్రాధాన్యమివ్వాలి. అందుకు తగ్గట్టుగా ముందుగానే సాధన చేయాలి. సరైన దుస్తులను ధరించడం, చెప్పాలనుకున్న విషయాలకు సంబంధించి ముందస్తుగా సిద్ధమవడం వంటి వాటిపై దృష్టిపెట్టాలి.

కొద్దిపాటి సాధనతో ఇవన్నీ నేర్చుకోవడం సులువే. ఇప్పుడు ఎన్నో ఆన్‌లైన్‌ వేదికలు అందుబాటులో ఉన్నాయి. మాక్‌ ఇంటర్వ్యూను వీడియో తీసుకుని, ఎక్కడ మార్పులు చేసుకోవాలో గమనించవచ్ఛు ఏ వాక్యాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు వంటి వాటిని చెక్‌ చేసుకోవచ్ఛు తద్వారా సంభాషణ తీరును మెరుగుపరచుకోవచ్ఛు

నియామక ప్రక్రియలో ఏఐ ఎలా?

కొన్ని ఉద్యోగాలకు సంబంధించి హెచ్‌ఆర్‌ బృందానికి వెయ్యి ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయనుకుంటే వాటిని పరిష్కరించడానికి వాళ్లకు సమయం పడుతుంది. నిర్దిష్ట నైపుణ్యాలు, అనుభవం వంటివి అవసరమైతే వచ్చిన ప్రతి రెజ్యూమెలో వాటిని పరిశీలించడానికి మరిన్ని రోజులు అవసరమవుతాయి. దీని వల్ల కష్టం, కాలహరణం రెండూ ఉంటాయి. ఏఐ ఆధారిత ప్రక్రియలో ఇవన్నీ తేలిగ్గా జరిగిపోతాయి. అందుకు ఆ టెక్నాలజీ ఎన్నో పద్ధతులను అనుసరిస్తుంది.

సోర్సింగ్‌: ఇంటర్నెట్‌/ సంస్థ డేటాబేస్‌ల్లోని రెజ్యూమెలు, ప్రొఫైళ్లను ఏఐ కీలక పదాల (కీ వర్డ్స్‌) ద్వారా పరిశీలించి, సంబంధిత పోస్టులకు ఎవరు సరైనవారో గ్రహిస్తుంది. వాటి ఆధారంగా ఎంపికైనవారికి ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను నిర్ణయించి, ఆ వివరాలను మెయిల్‌ లేదా కాల్‌ రూపంలో అందజేస్తుంది. ఎంపిక కాని వారికీ ఆ విషయాన్ని తెలియజేస్తూ మెయిల్‌ పంపుతుంది. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న పోస్టుకి కాకుండా వేరేదానికి అర్హులైతే వారితో మాట్లాడి, ఎలా దరఖాస్తు చేసుకోవాలో కొన్ని ఏఐ టూల్స్‌ సూచిస్తాయి.

స్క్రీనింగ్‌: కొన్ని టూల్స్‌.. అభ్యర్థుల రెజ్యూమెలోని కీ వర్డ్స్‌, నైపుణ్యాలను స్క్రీనింగ్‌ చేస్తాయి. మరికొన్ని స్కిల్‌ టెస్ట్‌ ఫలితాల ఆధారంగా ఎంపికచేసి, తరువాతి రౌండ్‌కు పంపుతాయి. పక్షపాత ధోరణి లాంటి మానవ తప్పిదాలకు ఈ ప్రక్రియలో ఆస్కారమే ఉండదు.

ఇంటర్వ్యూలు: ఇవి రెండు రకాలు. మొదటిదాన్ని ఆపిల్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటివి ఉపయోగిస్తున్నాయి. దీనిలో ప్రీ రికార్డెడ్‌ వీడియో ఇంటర్వ్యూలను ఏఐ పరిశీలిస్తుంది. అభ్యర్థి వ్యక్తిగత లక్షణాలను స్వరం, ముఖ కవళికల ఆధారంగా అంచనా వేస్తుంది. తద్వారా రిక్రూటర్లకు సమయాన్ని ఆదా చేస్తుంది. ఫేస్‌ రికగ్నిషన్‌ ద్వారా నిమిషాల వ్యవధిలో అభ్యర్థిని ఎంపిక చేయడానికి వీలవుతుంది. రెండో రకంలో- ప్రీ రికార్డెడ్‌ వీడియో ఇంటర్వ్యూలో అభ్యర్థి సమాధానాలను విశ్లేషిస్తారు. ఉదాహరణకు- స్కిల్‌ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థిని పరిశ్రమకు సంబంధించి ఏదో ఒక అంశంపై వ్యాసం రాయమన్నారు. తర్వాత ప్రీ-రికార్డెడ్‌ వీడియో ఇంటర్వ్యూలో ఆ అంశాన్ని ఎంచుకోవడానికి కారణాలను అడిగారు. అప్పుడు అభ్యర్థి ఇంకా విపులంగా, అదనపు సమాచారంతో వివరిస్తే విజయం పొందే వీలుంది. ఇవన్నీ ఏఐ విధానాల్లో కొన్ని మాత్రమే. ఇలాంటి వాటిని సంస్థలు ఉపయోగించుకుంటే టాలెంట్‌ను తేలిగ్గా పట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

లాభాలేంటి?

ఏఐ టెక్నాలజీని రిక్రూటింగ్‌ ప్రక్రియలో ఉపయోగించడం వల్ల సంస్థలకు, అభ్యర్థులకూ చాలా ఉపయోగాలున్నాయి.

ఒక సంస్థ ఉద్యోగులు ప్రపంచవ్యాప్తంగా ఉండటం ఇప్పుడు సర్వసాధారణమైంది. అందువల్ల ఆటోమేటెడ్‌ ఇంటర్వ్యూల ద్వారా ప్రస్తుత ధోరణులకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయడం ఆధునిక టెక్నాలజీ ద్వారా సులభమవుతుంది. వ్యక్తిగత ఇంటర్వ్యూల నిర్వహణకు పరిమితమైతే నష్టం జరుగుతుంది. ఆటోమేటెడ్‌ ఇంటర్వ్యూల ద్వారా ప్రదేశంతో సంబంధం లేకుండా, సమయం వృథా కాకుండా ప్రతి అభ్యర్థి పనితీరుపై అవగాహన ఏర్పడుతుంది.

దరఖాస్తులు వేలల్లో ఉంటాయి. వీటన్నింటినీ విశ్లేషించడానికి చాలామంది అవసరమవుతారు. ఒక్కోదాన్ని పరిశీలించడానికి ఎక్కువ సమయం కావాలి. అలాంటప్పుడు ఆటోమేటెడ్‌ ఇంటర్వ్యూతో కాలం ఆదా అవుతుంది. ఖర్చు తగ్గుతుంది.

ప్రస్తుత ఇంటర్వ్యూ విధానంలో ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌తో అభ్యర్థిని పరీక్షిస్తున్నారు. ఆపై ఇంకొన్ని రౌండ్లలో పరీక్షించి ఫలానా ఉద్యోగానికి ఎంతమేరకు సరిపోతాడో అంచనా వేస్తున్నారు. ఆటోమేటెడ్‌ ఇంటర్వ్యూలో నేరుగా ఆన్‌ ద జాబ్‌ టాస్క్‌లను ఇస్తారు. దానిలో అభ్యర్థి ప్రదర్శనను బట్టి అతడి నైపుణ్యాలను అంచనా వేస్తారు.

ఆటోమేటెడ్‌ విధానంలో అభ్యర్థి దూరం ప్రయాణించడం, ఎక్కువ సమయంపాటు పరీక్షల కోసం వేచివుండటం లాంటివి ఉండవు. పారదర్శకత ఉంటుంది. త్వరితగతిన కమ్యూనికేషన్‌ జరుగుతుంది.

‘ఓకే గూగుల్‌.. హలో సిరీ.. అలెక్సా!..’ అంటూ స్మార్ట్‌ ఫోన్లలో పిలవగానే ఒక స్వరం పలుకుతుంది. అడిగిన సమాచారం అందిస్తుంది. అవన్నీ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (కృత్రిమ మేధ) మాయలే. ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేసే ఆ గొంతు కూడా ఏఐదే కావచ్ఛు

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని