Published : 28 Dec 2020 00:59 IST

సీమ్యాట్‌ రూటులో..

డిగ్రీ ఉంటే చాలు 
వయసుతో నిమిత్తం లేదు 

కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (సీమ్యాట్‌)  జాతీయస్థాయి పరీక్ష. దీని స్కోరు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బీ స్కూళ్లలో ప్రవేశం పొందొచ్చు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ద్వారా నోటిఫికేషన్‌ ఇటీవలే  విడుదలైంది. ఉత్తమ విద్యాసంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సు అభ్యసించాలని భావించేవారికి క్యాట్‌ తరువాత మంచి ప్రత్యామ్నాయమిది! 
సీమ్యాట్‌ను  2018 వరకూ ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) నిర్వహించేది. ప్రస్తుతం ఎన్‌టీఏ నిర్వహిస్తోంది. ఈ స్కోరు ఆధారంగా దేశవ్యాప్తంగా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన 1000కిపైగా బీ స్కూళ్లు ఎంబీఏ/ పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తున్నాయి. ఏటా 70,000కుపైగా అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకుంటున్నారు. సంవత్సరానికి ఒకసారి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష. ఈ ఏడాది కొవిడ్‌ కారణంగా రెండు షిఫ్టుల్లో (షిఫ్ట్‌-1 ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 12గం. వరకు; షిఫ్ట్‌-2: మధ్యాహ్నం 3 గం. నుంచి సాయంత్రం 6గం.వరకు) నిర్వహించనున్నారు.
ఏదైనా విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసినవారు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఆఖరి సంవత్సరం పరీక్ష రాయబోయేవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అడ్మిషన్‌ సమయానికి సంబంధిత ధ్రువపత్రాలను పొంది ఉండటం తప్పనిసరి. వయః పరిమితి ఏమీ లేదు. ఎస్‌సీ, ఎస్‌టీ, ఇతర వెనుకబడినవర్గాల వారికి సీట్ల కేటాయింపులో రిజర్వేషన్‌ ఉంటుంది. 


ఇలా సన్నద్ధం కావాలి
మొదటి దశ: సిలబస్‌ పూర్తిచేయటం 
ప్రతి సెక్షన్ల మధ్య తేడాలను గమనించుకుంటూ చదవాలి. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ కాన్సెప్ట్‌ ఆధారితమైనవి. కాబట్టి, దీనికి సన్నద్ధమయ్యేటపుడు కాన్సెప్టులు, థీరమ్‌లను గుర్తుంచుకునేలా చూసుకోవాలి. లాజికల్‌ రీజనింగ్‌ సాధన ఆధారితం కాబట్టి, వీటిని చదవకూడదు. ఎక్కువగా ప్రశ్నలను సాధన చేయడంపై దృష్టిపెట్టాలి. వెర్బల్‌ ఎబిలిటీకి వచ్చేసరికి కొన్ని గుర్తుంచుకునే తరహావి కాగా కొన్ని సాధన సంబంధమైనవి. అలాగే జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాలూ జ్ఞాపకశక్తి ఆధారితమైనవే. ముందుగా కష్టమైన విభాగానికి మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రారంభించినది పూర్తవకుండా కొత్తదాన్ని ప్రయత్నించొద్దు. పూర్తిగా చదవడం లేదా పూర్తిగా సాధనకే పరిమితం కావొద్దు. రెండింటికీ సమప్రాధాన్యం ఉత్తమం. 
రోజువారీ ప్రణాళిక వేసుకుని దాన్ని పూర్తిచేసేలా చూసుకోవాలి. ప్రతి కాన్సెప్టుకు రఫ్‌ నోట్స్‌ రాసుకుంటుండాలి. ఇది పునశ్చరణకు సాయపడుతుంది. సాధనలో సులువు, మధ్యస్థం, కఠినమైనవాటితోపాటు తికమక పెట్టే  ప్రశ్నలనూ ప్రయత్నించాలి.

రెండో దశ: మాక్‌ టెస్ట్‌లు, ప్రశ్నపత్రాలు
మొదటి దశలో నేర్చుకున్న కాన్సెప్టులపై ఎంతవరకూ పట్టు సాధించారో ఈ దశలో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మాక్‌ టెస్ట్‌లు, గత ప్రశ్నపత్రాలు ఇందుకు సాయపడతాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి. ఎన్నో వెబ్‌సైట్లూ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వాటి సాయం తీసుకోవచ్చు. పరీక్ష సమయంలోనే పూర్తిచేసేలా చూసుకోవాలి. ఇది అభ్యర్థి వేగం, కచ్చితత్వాన్ని అంచనా వేసుకోవడానికి తోడ్పడుతాయి. అయితే సిలబస్‌ పూర్తిచేయకముందు మాత్రం మాక్‌ టెస్ట్‌ల జోలికి పోవొద్దు. పరీక్ష పూర్తయ్యాక చేసిన తప్పులను విశ్లేషించుకుని వాటినీ నోట్‌ చేసుకుంటుండాలి.
మూడో దశ: పునశ్చరణ
చివరి నాలుగు, ఐదు రోజులను ఇందుకు ఉపయోగించుకోవాలి. ఈ సమయంలో కొత్త అంశాలను ప్రయత్నించవద్దు. ఎక్కువగా కష్టంగా భావించినవాటిని చూసుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. అలాగని తేలికగా భావించినవాటిని వదిలేయకూడదు. అంతకుముందు చదివిన ప్రతి కాన్సెప్టు, థీరమ్‌లు, షార్ట్‌కట్‌లు అన్నింటినీ చూసుకోవాలి. మొత్తంగా పరీక్ష ముందు రోజులోగా పునశ్చరణ పూర్తయ్యేలా చూసుకోవాలి. పరీక్ష ముందు రోజు చాలావరకూ విశ్రాంతికే ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా పరీక్ష రోజు ఏమాత్రం చదవకుండా చూసుకోవాలి.


పరీక్ష ఎలా ఉంటుంది?
పరీక్ష సిలబస్‌ను ఏఐసీటీఈ ఆధ్వర్యంలో రూపొందించారు. మొత్తం నాలుగు విభాగాలు- లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున మొత్తం 100 ప్రశ్నలుంటాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. సాధారణంగా ప్రశ్నలు సులభం నుంచి మధ్యస్థ స్థాయిలో ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇస్తారు. మొత్తం మార్కులు 400. రుణాత్మక మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్లమాధ్యమంలో ఉంటుంది.
ముఖ్య తేదీలు
* దరఖాసుకి చివరితేదీ: జనవరి 22, 2021 * పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరితేదీ: జనవరి 23, 2021 * అడ్మిట్‌ కార్డుల లభ్యత: ఫిబ్రవరి 2021 మొదటివారం నుంచి. * సీమ్యాట్‌ జరిగే తేదీలు: 2021 ఫిబ్రవరి 22, 27. * ఫలితాలు: మార్చి మొదటివారంలో. * పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 153 కేంద్రాల్లో. * తెలుగు రాష్ట్రాల్లో: గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం,  హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ 


ఆన్‌లైన్‌ (https://cmat.nta.nic.in) లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర విధానాలో పంపిన వాటిని తిరస్కరిస్తారు. ఒకటికి మించిన దరఖాస్తు ఫారాలూ తిరస్కరణకు గురవుతాయి. ఒకవేళ దరఖాస్తులో ఏవైనా పొరబాట్లు దొర్లితే సరిదిద్దుకోవడానికి సమయమిస్తారు. ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబరుతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఆపై విద్యార్హతల వివరాలతోపాటు కొన్ని ధ్రువపత్రాలు, స్కాన్‌డ్‌ ఫొటోగ్రాఫ్‌, సంతకంతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని