... అను నేను!  

విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ ప్రక్రియకు సరైన ఎస్‌ఓపీని సంధిస్తే తిరుగే ఉండదు. మీలోని ఆసక్తి, అంకితభావం, ప్రేరణలను మీకు మీరుగా ఆవిష్కరించుకొని విద్యాసంస్థలను ఆకట్టుకోడానికి ఇదో చక్కటి అవకాశం.  అప్పటి వరకు కెరియర్‌లో సాధించిన విజయాలను వివరిస్తూ.. భవిష్యత్తులో మీరు గురిపెట్టిన మీ స్థానాన్ని కళ్లముందు కనిపించేలా ..

Updated : 18 Oct 2018 05:43 IST

విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ ప్రక్రియకు సరైన ఎస్‌ఓపీని సంధిస్తే తిరుగే ఉండదు. మీలోని ఆసక్తి, అంకితభావం, ప్రేరణలను మీకు మీరుగా ఆవిష్కరించుకొని విద్యాసంస్థలను ఆకట్టుకోడానికి ఇదో చక్కటి అవకాశం.  అప్పటి వరకు కెరియర్‌లో సాధించిన విజయాలను వివరిస్తూ.. భవిష్యత్తులో మీరు గురిపెట్టిన మీ స్థానాన్ని కళ్లముందు కనిపించేలా తెలియజేసేందుకు  మంచి సాధనం.  చక్కగా ప్రాక్టీస్‌ చేసి సూటిగా ఎస్‌ఓపీ అస్త్రాన్ని ప్రయోగిస్తే మీకు సీటు ఖరారు కావడం ఖాయం. 

... అను నేను!  

స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (ఎస్‌ఓపీ).. విద్యార్థి తన లక్ష్యాలు, ఉద్దేశాలను వివరిస్తూ అడ్మిషన్‌ కమిటీకి రాసే లేఖ.   ఒకరకంగా ఇంటర్వ్యూ సమయంలో అడిగే ‘మీ గురించి చెప్పండి?’ ప్రశ్న లాంటిదన్నమాట. విద్యార్థి దరఖాస్తు చేసుకున్న విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందగలడా లేదా అని నిర్ణయించడంలోనూ దీని పాత్ర కీలకమే. కొన్నిచోట్ల దీన్ని పర్సనల్‌ స్టేట్‌మెంట్‌గానూ వ్యవహరిస్తున్నారు. దీనిలో విద్యార్థి తన ఆలోచనలు, ఎంచుకున్న కెరియర్‌ పట్ల అంకితభావం, ఎంచుకోవడానికి ప్రేరణ కలిగించిన అంశాలు, తన ప్రత్యేకతలు.. మొదలైనవాటిని పొందుపరుస్తారు. 
ఇది ఎందుకు అంటే.. విద్యార్థి దరఖాస్తు  చేసుకున్నపుడు విదేశీ విశ్వవిద్యాలయం/ కళాశాల దీనిని రాయమని కోరుతుంది. విద్యార్థికి ఎంచుకున్న కోర్సుపై నిజంగా ఆసక్తి ఉందా? కోర్సు పూర్తి చేయగల సామర్థ్యం ఉందా? లాంటి అంశాల గురించి తెలుసుకోవడమే దీని వెనుక ఉన్న ఉద్దేశం. మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలన్న ప్రశ్నకు మీ  తరపున ఎస్‌ఓపీ సమాధానం ఇస్తుంది. కేవలం మార్కులు, చేసిన ప్రాజెక్టు బట్టి అభ్యర్థి వ్యక్తిత్వం అంచనా వేయడం సాధ్యం కాదు. అందుకే అభ్యర్థిపై లోతైన అవగాహనను  ఏర్పరచుకోవడానికి విదేశీ విద్యాసంస్థలు ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాయి. ఉద్యోగంలో చేరడానికి దరఖాస్తు ఎలా ఉపయోగపడుతుందో ఎంచుకున్న కోర్సులో చేరడానికి ఎస్‌ఓపీ కూడా అంతే తోడ్పడుతుంది. అయితే విద్యార్థులు తమ అభిరుచిని, సామర్థ్యాన్ని చక్కటి పదాల్లో వ్యక్తీకరించాల్సి ఉంటుంది.

ఈ ఎనిమిదీ ఉండాలి!

... అను నేను!  

* వ్యక్తిగతం (పర్సనల్‌ టచ్‌): ఎస్‌ఓపీ విద్యార్థి తన వ్యక్తిత్వాన్ని అడ్మిషన్స్‌ కమిటీకి వివరించేలా రాసే స్టేట్‌మెంట్‌. కాబట్టి ఎంచుకున్న కోర్సుకు తాను ఎలా సరైన వ్యక్తో చెప్పాల్సి ఉంటుంది. అందులో భాగంగా తను ఉదహరించే విజయాలు, తన కోరికలు అతడు/ ఆమె వైఖరిని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతాయి. 
*కారణం (పర్పస్‌): ఇది కీలకమైంది. దరఖాస్తు చేస్తున్న విద్యార్థి తాను ఎందుకు ఆ కోర్సులో స్పెషలైజేషన్‌ చేయదలుచుకున్నారో, ఆ విశ్వవిద్యాలయం/ కాలేజీనే ఎంచుకోవడానికి కారణాలేంటో, కెరియర్‌ పరంగా తన లక్ష్యం ఏమిటో వివరించాలి. విద్యార్థి ఆలోచనలను వ్యక్తీకరించడంలో స్పష్టత ముఖ్యం. సుశిక్షితులు, అనువజ్ఞులు అయిన నిపుణుల బృందం ఎస్‌ఓపీని పరిశీలిస్తుంది. కాబట్టి మీరు చెప్పేది వాస్తవికంగా ఉండేలా కూడా చూసుకోవాలి. 
*అభిరుచి (పాషన్‌): ఎస్‌ఓపీ గొప్పగా ఉండాలంటే పొందుపరచాల్సిన ముఖ్యమైన లక్షణం ఇది. విద్యార్థి ఎంచుకున్న కోర్సు పట్ల తనకున్న అభిరుచిని ప్రదర్శించాలి. ఏ రంగంలోనైనా అభిరుచి ఉన్నవారు మాత్రమే విశేషమైన ప్రతిభ చూపగలరు. అందుకే విద్యార్థి తాను ఎంచుకున్న కోర్సులో తనకున్న అభిరుచిని ఆసక్తికరంగా, ఒప్పించగలిగేలా చెప్పగలగాలి. 
* సంసిద్ధత (ప్రిపేర్డ్‌నెస్‌): ఏదైనా కోర్సు చదవాలంటే ఆసక్తి, అభిరుచి ఉంటే సరిపోదు. దానికి తగిన సంసిద్ధత కూడా ఉండాలి. ఎంచుకున్న రంగంలో ఉన్న అభిరుచిని నిలబెట్టుకునేందుకు ఎలా సిద్ధమవుతారో విద్యార్థి వివరించగలగాలి. ఇప్పటివరకూ చేసిన సన్నద్ధతనూ పేర్కొనాలి. 
* శక్తిసామర్థ్యాలు (పొటెన్షియల్‌): దేన్నైనా సాధించడానికి సామర్థ్యం అవసరం. అభ్యర్థి తాను ఎంచుకున్న ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేయడానికి కావాల్సిన సామర్థ్యం తనకుందని ఎస్‌ఓపీలో స్పష్టంగా చెప్పగలగాలి. నమ్మకం కలగడానికి కోర్సు/ రంగానికి సంబంధించి సాధించిన విజయాలను ప్రస్తావించాలి. అప్పుడే అతడికి/ ఆమెకు అవకాశం ఇస్తే తప్పకుండా ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేస్తారనే భావన అడ్మిషన్‌ కమిటీకి కలుగుతుంది. 
* ప్రణాళిక (ప్లానింగ్‌): దేనికైనా ముందస్తు ప్రణాళిక ఉండాలి. ఇందులో భాగంగా అభ్యర్థి ఆ విశ్వవిద్యాలయం/ కళాశాలను ఎంచుకోవడం ద్వారా కెరియర్‌ను ఎలా ప్లాన్‌ చేసుకున్నారో వివరించాలి. దానికి సంబంధించిన వెబ్‌సైట్‌ చూడటం ద్వారా అందులో పనిచేసే ప్రొఫెసర్ల వివరాలు, ప్రోగ్రామ్‌కి సంబంధించిన సమాచారం, పరిశోధన అవకాశాలు లాంటి సమాచారం తెలుసుకోవచ్చు. వీటిని ప్రస్తావిస్తే మీకు ఆ కోర్సు/ ప్రోగ్రామ్‌ పట్ల ఉన్న ఆసక్తి, దానికి అనుగుణంగా మీరు వేసుకున్న ప్రణాళికలు అడ్మిషన్స్‌ కమిటీకి అర్థమవుతాయి. 
* సరళ భాష (ప్లెయిన్‌ ఇంగ్లిష్‌): భాష సరళంగా ఉంటే అర్థం చేసుకోవడం తేలికవుతుంది. వ్యాసంలో స్పష్టత, సంక్షిప్తత, పెద్ద పదాలు/ పదబంధాలు వాడకపోవడం లాంటివి పాటించాలి. భాష సాధారణంగా, సూటిగా ఉండాలి. 
* సానుకూలత (పాజిటివిటీ): ఎంచుకున్న విశ్వవిద్యాలయం సాధించిన విజయాలు, అక్కడి ప్రొఫెసర్ల సామర్థ్యం, చక్కటి పాఠ్య ప్రణాళికలను చూసి అక్కడ తన కెరియర్‌కు బాటలు వేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలపాలి. అది అభ్యర్థిపైనా సానుకూల ప్రభావాన్ని ఏర్పరుస్తుంది.

ఎలా రాయాలి?  

... అను నేను!  

ఎస్‌ఓపీ మీకు ప్రతినిధిగా ఉండాలి. మీ వ్యక్తిత్వం, ఆశయాలను ప్రతిబింబించేలా ఉండాలి. కాబట్టి, మీకు చాలా స్ఫూర్తి కలిగించిన మంచి వాక్యంతోనో, ఉదాహరణతోనో ప్రారంభించవచ్చు. అయితే పూర్తిగా వాటితోనే నింపేయకూడదు. అలాగే చిన్నచిన్న పేరాలుగా విభజించి, 700-800 పదాల్లో పూర్తయ్యేలా రాయాలి. విశ్లేషకుడు (ఎవాల్యుయేటర్‌) మీ ఎస్‌ఓపీ చదవడానికి నిమిషం కంటే ఎక్కువ సమయం పడితే విసుగుగా భావించే ప్రమాదముంది. కాబట్టి ప్రతి పేరాలో మొదటి, చివరి వాక్యాల మీద దృష్టిసారించాలి. ఎస్‌ఓపీ రాయడంలో భాషకి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. కాబట్టి, స్పష్టత ఉండాలి. అలాగే ఉపయోగించే భాషలో గౌరవం కనిపించాలి. 
మొదటి పేరాలో.. ఇప్పటికీ కొనసాగుతున్న మీ చిన్ననాటి ఆసక్తుల గురించి రాయొచ్చు. అయితే ఇప్పటికీ అవి కొనసాగడానికి గల కారణాలను వివరించాలి. 
రెండో పేరాలో.. విద్యాభ్యాసంలో మీరు సాధించిన పెద్ద విజయాలను క్లుప్తంగా చెప్పాలి. దాంతోపాటు ఎంచుకున్న కోర్సుకు ప్రేరేపించిన కారణాలు, ఆసక్తి కలిగించిన సబ్జెక్టుల గురించి తెలియజేయాలి. మీ ఆసక్తికి వెనుకనున్న కారణాన్నీ పొందుపరచాలి. 
మూడో పేరాలో.. మీరు చేసిన ప్రాజెక్టుల గురించి తెలియజేయాలి. వీలైనంత క్లుప్తంగా రాయాలి. దాన్నుంచి మీరేం నేర్చుకున్నారో, అది మీకు ఎంతవరకూ సాయపడిందో కూడా తెలియజేయాలి. అలాగే మీ ప్రచురణలు, ఇంటర్న్‌షిప్‌ల గురించీ ప్రస్తావించొచ్చు. 
నాలుగో పేరా.. ఇది చాలా కీలకమైంది. ఇది పూర్తిగా దరఖాస్తు చేసుకున్న విశ్వవిద్యాలయానికి సంబంధించింది. అనవసరమైన పొగడ్తలకు చోటివ్వకూడదు. రిసెర్చ్‌ వర్క్‌, ల్యాబ్స్‌, ఫ్యాకల్టీ, ప్రస్తుత ప్రాజెక్టులపరంగా యూనివర్సిటీ పట్ల మీకున్న ఆసక్తిని వ్యక్తం చేయాలి. మీరు ఫలానా దేశం, విద్యాసంస్థను ఎందుకు ఎంచుకున్నారు? ఆ కోర్సును చేయాలనుకోడానికి కారణం ఏమిటి? ఆ యూనివర్సిటీలో నచ్చిన అంశాలు.. వంటి ప్రాథమిక ప్రశ్నలకు జవాబు ఇస్తున్నట్లుగా ఉండాలి. 
అయిదో పేరాలో.. మీ స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను వివరించాలి. ఈ పేరా ఆకట్టుకునే విధంగా చూసుకోవాలి. ఇదే చివరి పేరా  కాబట్టి.. ఆ విశ్వవిద్యాలయానికి, మీ స్వదేశానికి విలువ పెంచేలా పని చేస్తానని తెలిపేలా రెండు మూడు వాక్యాలు రాసి, ముగించేయాలి.

ఇవి చేయకూడదు

... అను నేను!  

* పెద్ద పెద్ద పదాల జోలికి పోకూడదు. పెద్ద పదాలను ఉపయోగిస్తేనే ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉన్నట్లుగా కొందరు భావిస్తుంటారు. అది అపోహ మాత్రమే. అలాగే Yeah!, chuks మొదలైన పదాలను, మెసేజీల్లో ఉపయోగించే భాషను వాడకూడదు. 
* ఎస్‌ఓపీ అనేది విద్యార్థుల రాత నైపుణ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించింది కాదు. కాబట్టి, పొడవైన  వ్యాసాలుగా రాయకూడదు. ఒక అంశాన్నే ఎక్కువగా వివరిస్తున్నట్టు కూడా ఉండకూడదు. చదివేవారికి విసుగు తెప్పిస్తుంది. 
* ఇంటర్నెట్‌ నుంచి కాపీ చేయడం, వేరేవాళ్లతో రాయించడం లాంటివి చేయకూడదు. మీ జీఆర్‌ఈ లేదా జీమ్యాట్‌ స్కోర్‌ పరిశీలకులకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి భాష విషయంలో మీ స్థాయిని వారు అంచనా వేయగలరు. 
* వ్యాకరణ పరమైన తప్పులు దొర్లకుండా చూసుకోవాలి. దోషాలు అభ్యర్థి నిర్లక్ష్యాన్ని సూచిస్తాయి. 
* విజయాలను ప్రస్తావించొచ్చు కానీ, సొంతడబ్బాలానో, అతిగా చెబుతున్నారన్న భావనో కలిగించకూడదు. 
* మీ లక్ష్యానికి ఎంచుకున్న కోర్సు మార్గమవుతుందని సూచించేలా ఉండాలి తప్ప.. ఎంఎన్‌సీల్లో పనిచేయడం, బాగా డబ్బులు సాధించాలి.. వంటి కోరికలు వ్యక్తమయ్యేలా రాయకూడదు. 
* దరఖాస్తు చేసుకున్న విశ్వవిద్యాలయాలన్నింటికీ ఒకే ఎస్‌ఓపీని పంపొద్దు. సంస్థను బట్టి, తగిన మార్పులు చేశాకే పంపాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని