గణితం, కంప్యూటర్‌లలో మేటి కోర్సులు

గణితం, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు జాతీయ స్థాయిలో మేటి సంస్థ చెన్నై మ్యాథమేటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఐ). ఇందులో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నారు. ప్రకటన వెలువడింది.

Published : 30 Mar 2020 01:44 IST

దరఖాస్తులకు చెన్నై మ్యాథమేటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆహ్వానం

గణితం, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు జాతీయ స్థాయిలో మేటి సంస్థ చెన్నై మ్యాథమేటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఐ). ఇందులో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నారు. ప్రకటన వెలువడింది. రాతపరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి. కోర్సుల్లో చేరినవారికి ప్రతి నెలా స్టైపెండ్‌ అందుతుంది.

మ్యాథమేటికల్‌ సైన్సెస్‌ కోర్సుల్లో దేశంలో బోధన, పరిశోధనలకు అగ్రగామి సంస్థగా సీఎంఐని చెప్పుకోవచ్చు.యూజీసీ 2006లో ఈ సంస్థకు విశ్వవిద్యాలయ హోదా ఇచ్చింది. ఇక్కడి విద్యార్థులు దేశీయంగానే కాకుండా ప్రపంచస్థాయి సంస్థల్లో బోధన, పరిశోధనలో గొప్ప అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. కోర్సులన్నీ రెసిడెన్షియల్‌ విధానంలో అందిస్తున్నారు.

నేషనల్‌ సైన్స్‌ ఒలింపియాడ్‌లో ప్రతిభ చూపినవారికి నేరుగా యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. అన్ని కోర్సులకూ ట్యూషన్‌ ఫీజు ప్రతి సెమిస్టర్‌కూ రూ.లక్ష చెల్లించాలి. ఎమ్మెస్సీ డేటా సైన్స్‌కు మాత్రం రూ.2 లక్షలు. విద్యార్థుల ఆర్థిక నేపథ్యం బట్టి పూర్తిగా లేదా పాక్షికంగా ఫీజు మినహాయింపు లభిస్తుంది. ప్రతిభావంతులకు ప్రతి నెలా రూ.5000 ఫెలోషిప్‌ కింద చెల్లిస్తారు. ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరినవారికి రూ.6000 ఫెలోషిప్‌ అందుతుంది. పీహెచ్‌డీ కోర్సులకు ఎంపికైనవారికి మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000 తర్వాత రెండేళ్లు రూ.35,000 చొప్పున చెల్లిస్తారు.

అన్ని కోర్సుల్లోనూ రాతపరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం కల్పిస్తారు. పీజీ, పీహెచ్‌డీలకు ఇంటర్వ్యూలూ ఉంటాయి. ఫిజిక్స్‌లో పీహెచ్‌డీకి మాత్రం జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (జెస్ట్‌) స్కోర్‌తో నేరుగా ఇంటర్వ్యూ అవకాశం లభిస్తుంది.
* బీఎస్సీ ఆనర్స్‌: మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌; మ్యాథ్స్‌ అండ్‌ ఫిజిక్స్‌
అర్హత: ఇంటర్‌ ఉత్తీర్ణులు, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

* ఎమ్మెస్సీ: మ్యాథ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, డేటా సైన్స్‌
అర్హత: డిగ్రీలో మ్యాథ్స్‌ లేదా బీస్టాట్‌ లేదా బీటెక్‌ చదువుకున్నవారు ఎమ్మెస్సీ మ్యాథ్స్‌కు అర్హులు. కంప్యూటర్‌ సైన్స్‌ నేపథ్యంతో బీఎస్సీ, బీటెక్‌ కోర్సులు చదివినవారు ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ లేదా కంప్యూటర్‌ సైన్స్‌ నేపథ్యంతో యూజీ కోర్సులు చదివినవారు ఎమ్మెస్సీ డేటా సైన్స్‌కు అర్హులు. సంబంధిత సబ్జెక్టుల్లో ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.

* పీహెచ్‌డీ: మ్యాథ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఫిజిక్స్‌
అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ ఉత్తీర్ణులూ, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష ఇలా...
రెండు బీఎస్సీ కోర్సులకూ పరీక్షను ఉమ్మడిగానే నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. పార్ట్‌- ఎలో కనీస పాయింట్లు సాధిస్తే పార్ట్‌- బి మూల్యాంకనం చేస్తారు. ప్రశ్నలన్నీ ఇంటర్‌ మ్యాథ్స్‌ నుంచే అడుగుతారు.

ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోసం నిర్వహించే పరీక్షల్లోనూ రెండు పార్టులుంటాయి. ప్రశ్నలన్నీ సంబంధిత సబ్జెక్టుల్లో యూజీ పాఠ్యాంశాల నుంచి వస్తాయి. ఎమ్మెస్సీ డేటా సైన్స్‌ ప్రశ్నలు మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ నుంచి అడుగుతారు. పాత ప్రశ్న    పత్రాలు, సొల్యూషన్లు సీఎంఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

దరఖాస్తుల గడువు: ఏప్రిల్‌ 11
పరీక్ష తేదీ: మే 15
వెబ్‌సైట్‌: https:// cmi.ac.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని