ప్యాకేజింగ్‌లో పీజీ డిప్లొమా

నాణ్యతతోపాటు ప్యాకింగ్‌కీ ప్రాధాన్యం ఉంటుంది. అందుకే అన్ని సంస్థలూ వస్తువులను భద్రంగా, ఆకర్షణీయంగా వినియోగదారులకు అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో ప్యాకింగ్‌ రంగంలో నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది....

Published : 07 Apr 2020 01:31 IST

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ ప్రకటన విడుదల
ఒక వస్తువు మార్కెటింగ్‌ మంచిగా సాగాలంటే

నాణ్యతతోపాటు ప్యాకింగ్‌కీ ప్రాధాన్యం ఉంటుంది. అందుకే అన్ని సంస్థలూ వస్తువులను భద్రంగా, ఆకర్షణీయంగా వినియోగదారులకు అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో ప్యాకింగ్‌ రంగంలో నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది.
బిస్కెట్లు, చాక్లెట్లు, ఔషధాలు, ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసే వస్తువులు, గృహోపకరణాలు, ఆఫీస్‌ సామగ్రి, వాణిజ్య పరికరాలు...ఉత్పత్తి ఏదైనప్పటికీ చక్కటి ప్యాకింగ్‌లో మన ముందుకొస్తున్నాయి. దుకాణాల్లో ఆకర్షణీయంగా కనిపించే వస్తువుల మీదే ముందుగా అందరి కళ్లుపడతాయి. దాన్ని ప్యాకింగ్‌ చేసిన విధానమే అందుకు కారణం. వస్తువులను నాణ్యంగా, ప్రమాణాల ప్రకారం రూపొందించడం ఒక ఎత్తయితే, వాటిని భద్రంగా ఉంచుతూ, సులువుగా ఇమిడిపోయేలా, చూసేవారిని ఆకట్టుకునే విధంగా ప్యాక్‌ చేయడం మరో ఎత్తు. ఇందుకోసం కొన్ని ప్రత్యేక సంస్థలు ప్యాకింగ్‌లో కోర్సులు అందిస్తున్నాయి.

కేంద్రంలో కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ నెలకొల్పారు. ఈ సంస్థ రెండేళ్ల వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ప్యాకేజింగ్‌ కోర్సు అందిస్తోంది. ఇందులో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఈ కోర్సును ముంబయి, దిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌ క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు. దీన్ని పూర్తి చేసినవారికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా అవకాశాలు లభిస్తున్నాయి. ఔషధ కంపెనీలు, ఆహార తయారీ సంస్థలు, ప్యాకేజింగ్‌ సంస్థలు, వస్తు తయారీ, ఈ-కామర్స్‌, శీతలపానీయాలు, సౌందర్య సాధనాలు, గృహోపకరణాలు.. ఇలా ఉత్పత్తులను తయారుచేస్తున్న సంస్థలు, పరిశ్రమల్లో ప్యాకేజింగ్‌ నిపుణులకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మన దేశంలో ప్యాకేజింగ్‌ పరిశ్రమ ప్రపంచంతో పోల్చుకుంటే వేగంగా వృద్ధి చెందుతోంది. 7000 వ్యవస్థీకృత సంస్థలు, 4.5 లక్షల చిన్న పరిశ్రమలు పలు రకాల ఉత్పత్తులను భారత్‌లో నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలన్నింటికీ ప్యాకేజింగ్‌ నిపుణుల సేవలు తప్పనిసరి. ఉత్పత్తులకు సరిపోయే ప్యాకేజింగ్‌ రూపొందించడం వీరి విధుల్లో భాగం. ఉదాహరణకు ఔషధాలకు ఆ మందు కాలపరిమితి ప్రకారం చెక్కుచెదరని ప్యాకింగ్‌ చేయాలి. అందుకోసం ఎలాంటి పదార్థాలు ఉపయోగించాలో అవగాహన ఉండాలి. ఆ వస్తువు లేదా ఉత్పత్తికి ఉన్న విలువ, దాని ప్రాధాన్యం ప్రకారం ప్యాకింగ్‌ చేయాలి. అది పటిష్టంగా ఉంటూనే, తేలికగా, తక్కువ స్థలంలో, తక్కువ పెట్టుబడితో పూర్తయ్యే విధంగా చూడాలి. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటించాలి.

ఎంపిక విధానం
రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
పరీక్ష విధానం: ఇది ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంజినీరింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో ప్రతిభ చూపినవారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది ఎంపికలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. పదోతరగతి మార్కులకు 10 శాతం, ఇంటర్‌ మార్కులకు 10 శాతం, డిగ్రీ మార్కులకు 30 శాతం, ప్రవేశపరీక్షకు 30 శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
సీట్ల వివరాలు: మొత్తం 500 సీట్లు ఉన్నాయి. ముంబైలో 280,     దిల్లీ 100, కోల్‌కతా 80, హైదరాబాద్‌ 40.
అర్హత: రెగ్యులర్‌ విధానంలో ఇంటర్‌, డిగ్రీల్లో సైన్స్‌ కోర్సులు చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ లేదా బయో టెక్నాలజీ వీటిలో ఏదైనా ఒక సబ్జెక్టును డిగ్రీలో చదివుండాలి. అగ్రికల్చర్‌, ఫుడ్‌ సైన్స్‌, పాలిమర్‌ సైన్స్‌ కోర్సుల్లో ద్వితీయ శ్రేణితో ఉత్తీర్ణులూ అర్హులే. సంబంధిత కోర్సుల్లో ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: మే 29, 2020 నాటికి ముప్పై ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.


దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 5, 2020.
పరీక్ష తేదీ: జూన్‌ 11, 2020.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై

వెబ్‌సైట్‌:
www.iipnin.com


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని