సమయం... ఎంత కేటాయించాలి?

సమయం అందరికీ రోజుకి 24 గంటలే. కొంతమంది అదే సమయంతో విజయం సాధిస్తే మరికొంతమంది అపజయం పొందుతున్నారు. కారణాలు ఏమిటి? సమయ ప్రణాళిక పోటీ పరీక్షల

Updated : 25 Oct 2021 06:19 IST

సమయం అందరికీ రోజుకి 24 గంటలే. కొంతమంది అదే సమయంతో విజయం సాధిస్తే మరికొంతమంది అపజయం పొందుతున్నారు. కారణాలు ఏమిటి? సమయ ప్రణాళిక పోటీ పరీక్షల అభ్యర్థులకు ఏవిధంగా ఉపకరిస్తుంది?

ఏ పోటీ పరీక్షకి సిద్ధపడాలో నిర్ణయించుకుని ఆపై సిలబస్‌, ప్రశ్నపత్రాల పరిశీలన, తగిన పుస్తకాల ఎంపిక జరిగాక సమయ సద్వినియోగ ప్రణాళికను రచించుకోవాలి. దీన్ని పకడ్బందీగా రూపొందించుకుంటే సగం విజయం సాధించినట్లే.

ప్రిపరేషన్‌కి ఎంత సమయం పడుతుందనేది అభ్యర్థి గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మొదలైన లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. పోటీ పరీక్ష స్థాయి, పోటీ పడే అభ్యర్థుల సంఖ్య, లభ్యమయ్యే పోస్టుల సంఖ్య మొదలైన అంశాల మీద ఆధారపడి ప్రిపరేషన్‌ సమయాన్ని నిర్థ్ధారించుకోవాలి. బ్యాంక్‌ క్లరికల్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ పరీక్షలు మొదలైనవాటికి పూర్తి స్థాయిలో చదివితే నాలుగు నుంచి ఆరు నెలల సమయంలో పట్టు సాధించవచ్చు. డీఎస్సీ, ఎస్‌ఐ, పోలీస్‌ లాంటి పరీక్షకు కూడా ఆరు నెలలు పడుతుంది. గ్రూప్‌-2 పరీక్షకు కనీసం ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు పడుతుంది. గ్రూప్‌-1, యూపీఎస్సీ పరీక్షలకు పూర్తిస్థాయిలో తయారవ్వాలంటే 1 లేదా 2 సంవత్సరాలను వెచ్చించక తప్పదు. అభ్యర్థుల వ్యక్తిగత లక్షణాలను బట్టి ఈ సమయం పెరగవచ్చు, తగ్గవచ్చు. అందువల్ల ఈ స్థాయిలో సమయం కేటాయించగలం అనుకున్నప్పుడే పరీక్షకు సిద్ధం కావాలి. సాధ్యం కాదనుకున్నప్పుడు ఆ ప్రయత్నాన్ని వదిలివేయడం, ప్రత్యామ్నాయాలను ఎంచుకుని ఇతర రంగాల్లో స్థిరపడటం చేయొచ్చు. చాలా మందికి ఈ అంశాలపైన సరైన అంచనాలు లేక సమయాన్ని వృథా చేసుకుంటారు. కెరియర్‌ను సరిగా నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో పడతారు.

రోజులో ఎంత సమయం?

నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం అభ్యర్థి ఎంపిక చేసుకున్న పరీక్ష, అభ్యర్థి గత జ్ఞానం, అనుభవం.. అలాగే ప్రస్తుతం అభ్యర్థి చేస్తున్న ఇతర పనులు మొదలైనవాటిపై ఆధారపడి ఉంటుంది. అనేక అధ్యయనాల ప్రకారం ఒక వ్యక్తి సగటున ఒక రోజులో తొమ్మిది గంటలకు మించి పూర్తిస్థాయి ఏకాగ్రతతో చదవడం సాధ్యం కాదు. చాలామంది 16 గంటలు.. 18 గంటలు చదివామని భావిస్తారు. కానీ నిజానికి మెదడు అంగీకరిస్తుందా లేదా అని పరిశీలించరు. సివిల్స్‌లో టాప్‌ ర్యాంకు సాధించినవారు చాలామంది ఈ తొమ్మిది గంటల భావనను సమర్థించారు. అందువల్ల అభ్యర్థులు 9 నుంచి 10 గంటల సమయం కేటాయించేందుకు కచ్చితమైన ప్రణాళిక రచించుకోవాలి. బ్యాంకు క్లరికల్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ దిగువ స్థాయి ఉద్యోగాల కోసం పోటీపడుతూ ఒక సంవత్సరం తర్వాత పరీక్ష రాద్దాం అనుకునేవారు రోజుకు మూడు నుంచి ఐదు గంటల సమయం కేటాయించుకోవచ్చు. గ్రూప్‌ 1, సివిల్స్‌ పరీక్షలకు హాజరవుతున్నవారు మాత్రం తప్పకుండా ప్రతి రోజూ సగటున తొమ్మిది గంటల సమయాన్ని కేటాయించుకుని సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధం అయితే మంచి ఫలితాలు వస్తాయి.

ఉదయం వేళా? రాత్రా? 

ప్రభాత సమయంలో మెదడు మీద అధిక ఒత్తిడి ఉండదు కాబట్టి ఎక్కువ గ్రహణశక్తి ఉంటుందనేది చాలామంది అభిప్రాయం. ప్రపంచమంతా నిద్రించే సమయంలో..అంటే మన కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల తరువాత చదివినట్లయితే ఇతర జోక్యాలు ఉండవు కాబట్టి బాగా చదవచ్చని మరికొంతమంది అభిప్రాయపడుతుంటారు. నిజానికి ఇది వ్యక్తిగత సామర్థ్యంతో ముడిపడిన అంశమే గాని ఉదయమా, సాయంత్రమా, రాత్రా అని నిర్ధారించలేము. అందువల్ల అభ్యర్థులు తాము ఏ సమయంలో ప్రశాంతంగా చదవగలమనుకుంటే ఆ సమయంలో చదవటమే మంచిది. ఇతరులను అనుసరించడం వృధా. ఏ సమయంలో చదివినా చదివిన అంశం సరిగా గ్రహిస్తున్నామా, జ్ఞాపకం ఉంటోందా లేదా అనేది ప్రామాణికం.

ఆరంభ శూరత్వం అవరోధం

సన్నద్ధత ఆరంభ దశలో చాలామంది అభ్యర్థులు బ్రహ్మాండమైన ప్రణాళిక తయారు చేసుకుంటారు. ఒకటి రెండు రోజులు కఠినంగా అమలు చేస్తారు కూడా. సరైన నిబద్ధత లేని చాలామంది మాత్రం అతి స్వల్పకాలంలోనే సమయపట్టికను వివిధ కారణాల వల్ల ఉల్లంఘిస్తుంటారు. ప్రేరణ బలహీనపడుతుంది. పర్యవసానంగా అనంతరం చేయాల్సిన కృషిలో విఫలమవుతుంటారు. ఈ సత్యాన్ని గ్రహించి సమయ పట్టిక తయారు చేసుకునేటప్పుడు సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకసారి సమయ పట్టిక తయారుచేసుకున్నాక వెనకడుగు వేయకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్ణయించుకున్న దానికనుగుణంగా పఠన ప్రస్థానం జరిగినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతారు.


పార్ట్‌ టైం ఉద్యోగులు..

ప్రైవేటు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉండటం.. కెరియర్‌ను నిర్మించుకునే క్రమంలో ఉన్నత చదువులు చదవడం మొదలైన పరిస్థితులు ఉన్నప్పుడు పోటీ పరీక్షలకు సమయ ప్రణాళిక రచించుకోవటం కొంత ఇబ్బందే. పైగా మనదేశంలో నిరుద్యోగ సమస్య వల్ల తీవ్రమైన పోటీ ఉంటుంది. అందువల్ల పూర్తి సమయం వెచ్చించడం తప్పనిసరి. ఒకవేళ సాధ్యం కాకపోతే అభ్యర్థులు తమ పని గంటల సమయాన్ని పెంచుకోవాలి. అందుకోసం ఉదయం 4 గంటలకే నిద్ర లేవటం, రాత్రి 10...12 గంటల వరకు చదవటం లాంటి ప్రక్రియలతో కఠోరశ్రమతో లక్ష్యసాధన వైపు పయనించాలి. సగటున మనిషికి 6 నుంచి 8 గంటల నిద్ర సరిపోతుంది కాబట్టి ఇలాంటి కఠోర శ్రమ ఇతర ఆరోగ్యసమస్యలకు దారి తీయదు. ఆదివారం, పండగల రూపేణా సెలవులు లభిస్తాయి కాబట్టి వాటిని వినియోగించుకోవటం తెలివైన నిర్ణయం! గృహిణులు.. పిల్లలు పాఠశాలలకూ, భాగస్వాములు పనులకు వెళ్ళిన తరువాత లభించే సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. చాలామందిలో ఆశయాలు, లక్ష్యాలు ఉంటాయి కానీ అందుకు తగిన సమయ ప్రణాళిక లేకపోవడమే వైఫల్యానికి కారణం. గతంలో చాలామంది స్త్రీలు అటు గృహ నిర్వహణ చూసుకుంటూ లభించిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతమైన ఫలితాలు సాధించారు.ఈతరహా ప్రేరణ పొంది లక్ష్యసాధనకు అంకితం అవ్వాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని