ఈ ఏడాది... ఇలా చేద్దామా!

కొత్త ఏడాది ఇలా చేయాలి, అలా ఉండాలి అంటూ చాలా అనుకుంటాం. ఏవేవో లక్ష్యాలు పెట్టుకుంటాం. అవి నెరవేరాలంటే మనవంతు ప్రయత్నం కూడా ఉండాలి కదా...  మరి ఒక విద్యార్థిగా ఈ నూతన  సంవత్సరంలో మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు?

Updated : 02 Jan 2023 05:04 IST

కొత్త ఏడాది ఇలా చేయాలి, అలా ఉండాలి అంటూ చాలా అనుకుంటాం. ఏవేవో లక్ష్యాలు పెట్టుకుంటాం. అవి నెరవేరాలంటే మనవంతు ప్రయత్నం కూడా ఉండాలి కదా...  మరి ఒక విద్యార్థిగా ఈ నూతన  సంవత్సరంలో మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు?

సమయంలో మనం చేసే పనేదైనా చదువులోనూ కెరియర్‌లోనూ మనల్ని మరో మెట్టు పైకెక్కించేదే కావాలి. నూతన సంవత్సరం.. నూతన నిర్ణయాలు అనేవి అందరూ తీసుకుంటారు. కానీ కొందరు మాత్రమే వాటిని స్థిరంగా పాటించి మెరుగైన ఫలితాలు అందుకుంటారు. కొంచెం శ్రమిస్తే అటువంటి వారిలో మనమూ ఉండొచ్చు. అందుకే... బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవడానికి, కెరియర్‌లో మరింత ముందుకు వెళ్లడానికి మనం తీసుకోదగిన ‘బెస్ట్‌ న్యూఇయర్‌ రిజల్యూషన్స్‌’ ఏమిటో చూసేద్దాం.


ఆరోగ్యకరమైన అలవాట్లు

రోగ్యానికి హాని చేసే అలవాట్లు కలిగి ఉండటం చాలా సులువు. కానీ ఒక్కసారి ఆరోగ్యకరమైన అలవాట్లను సాధన చేస్తే వాటి వల్ల కలిగే లాభాలు, లభించే సంతోషం తెలుస్తుంది. ఇది చదువులో ఏకాగ్రతను పెంచడమే కాదు, రోజువారీ జీవితంలో కలిగే ఒత్తిడినీ తగ్గిస్తుంది. త్వరగా నిద్రపోయి, త్వరగా మేలుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒంటికి ఏమాత్రం మంచి చేయని జంక్‌ ఫుడ్‌ తగ్గించడం, సమయానికి భోజనం చేయడం, తాజా పండ్లు - కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవడం... ఇవన్నీ విద్యార్థిగా మన ప్రదర్శనను మెరుగుపరిచేవే. కావాలంటే ఓసారి ప్రయత్నించి చూడండి!


మెరుగైన ప్రదర్శన

నిన్నటికి.. ఇవాళ్టికి ఏదో ఒక మార్పు ఉండాలి. ఆ మార్పు మెరుగైన ప్రదర్శన దిశగా మనల్ని ప్రోత్సహించాలి.. విజయం అనేది గమ్యం కాదు, ప్రయాణం అంటారు అందుకే. తరగతులైనా, పరీక్షలైనా, మార్కులు - ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌... ప్రతిదీ ఇంకా మెరుగ్గా చేసేందుకు ప్రయత్నించడం లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఆ ‘ఇంకొంచెం..’ అన్న దగ్గరే మనం అందరికంటే ప్రత్యేకంగా నిలుస్తాం. బృందంతో చదవడం, ఒక్కరే కష్టపడటం, సృజనాత్మకంగా ఆలోచించడం, ఏవైనా ప్రాజెక్టులు మొదలుపెట్టడం, పార్ట్‌టైం జాబ్‌, సామాజిక సేవ... ఇలా ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నించవచ్చు. మనకున్న ఆసక్తి, పరిమితులు దృష్టిలో పెట్టుకుని నిర్ణయించుకోవాలి.


సరిపడా నిద్ర

ప్రస్తుతం మన డైలీ రొటీన్‌ను దెబ్బతీయడంలో అత్యంత ముందున్నవి మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రికల్‌ డివైజ్‌లే. వీటితో కాలక్షేపం చేస్తూ.. మనం నిద్రపోయే సమయం తగ్గిపోయిందని ఇప్పటికే చాలా పరిశోధనల్లో రుజువైంది. నిద్ర తగ్గితే... మెదడు పనితీరుపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. ప్రతి పనిలోనూ నిరాసక్తత ఆవహిస్తుంది. శారీరక ఆరోగ్యానికీ, మానసిక ఉల్లాసానికీ ఏ విధంగానూ మంచిది కాదు. అందుకే సరిపడా నిద్రపోవడం మనం తీసుకోబోయే మంచి నిర్ణయాల్లో ఒకటి కాగలదు. దీనిద్వారా చాలా మానసిక సమస్యల నుంచి దూరంగా ఉండగలుగుతాం. అదే సమయంలో అధికనిద్ర కూడా మంచిది కాదు. కేవలం సమయానికి, సరిపడా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.


అవగాహన, పరిచయాలు..

కేవలం కాలేజీకి వెళ్లడం, రావడమేనా? మన చుట్టూ రోజూ ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. ఎందరో నిపుణులు నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. మనం చదువుతున్న సబ్జెక్టుకు సంబంధించి, చేరాలి అనుకుంటున్న కెరియర్‌కు సంబంధించి చాలా కొత్త విషయాలు  బయటకు వస్తుంటాయి. వాటి గురించి తెలుసుకోవడం, ఇప్పటికే రంగంలో ఉన్నవారితో పరిచయం పెంచుకోవడం చాలా ఉపయోగపడుతుంది. సంస్థలు నిర్వహించే వివిధ రకాల ఈవెంట్లలో పాల్గొనడం, చేరబోయే వృత్తిపట్ల ఆసక్తిని, అవగాహనను మరింత పెంచుతుంది. అందుకే ఇకపై నెట్‌వర్కింగ్‌ మీద దృష్టి సారించండి.


వాయిదాని వాయిదా వేద్దాం!

ప్రతి పనినీ చివరి నిమిషం దాకా వాయిదా వేయడం మనలో చాలామందికి ఉన్న అలవాటే. దీనివల్ల విలువైన సమయం వృథా కావడమే కాదు, ఎన్నో పనులు పేరుకుపోతూ ఉంటాయి. ఆఖర్లో హడావుడి పడటం వల్ల చేయాల్సిన పనిలో నాణ్యత తగ్గిపోతుంది. అందుకే ప్రతి టాస్క్‌నూ నిర్దేశించిన సమయంలో పూర్తిచేయడం, ఎప్పటి పనులు అప్పుడే కానివ్వడం, పెద్ద పెద్ద అసైన్‌మెంట్లు - ప్రాజెక్టులను చిన్న చిన్న విభాగాలుగా చేసి సమయానికి పూర్తిచేయడం లక్ష్యంగా పెట్టుకోవచ్చు.


భావప్రకటన నైపుణ్యాలు..

నేడు విద్యార్థులకు కావాల్సిన అతి ముఖ్యమైన నైపుణ్యాల్లో మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కూడా ఒకటి. కొన్ని ఉద్యోగాల్లో మార్కులకంటే కూడా అభ్యర్థులు మాట్లాడే తీరు, విషయ పరిజ్ఞానం, సమస్యలను పరిష్కరించే విధానం.. వీటికే అధిక ప్రాధాన్యం ఉంటుంది. సందర్భాన్ని బట్టి, ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవడం చాలా అవసరం. అదే సమయంలో చక్కని భాషాజ్ఞానం కూడా ముందు నుంచే అలవరుచుకోవడం ఎంతో ఉపకరిస్తుంది. వీటిపై దృష్టి పెట్టొచ్చు.


సమప్రాధాన్యం

సమయం, ఈ వయసు  తిరిగి రావు... తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అది తరగతి గదిలోనైనా, జీవితంలోనైనా! అందుకే రెండింటి మధ్య సమన్వయం ఉండాలి. స్నేహితులకు కేటాయించే సమయం వల్ల మన మార్కులు తగ్గిపోకూడదు. ప్రాజెక్టు పూర్తి చేసే పనిలో పడి కుటుంబానికి ఇచ్చే సమయం తగ్గిపోకూడదు. ప్రతి దానికీ నిర్దిష్టమైన ప్రణాళిక అంటూ ఉండాలి. అప్పుడే చదువు, జీవితం సమప్రాధాన్యంతో సాఫీగా సాగిపోతాయి. ఇది నేర్చుకోవడం నేడు విద్యార్థిగానే కాదు, రేపు ఉద్యోగంలోనూ చాలా ఉపయోగపడుతుంది. ఉద్యోగాన్నీ, కుటుంబాన్నీ బ్యాలెన్స్‌ చేయడం నేటితరం కచ్చితంగా నేర్చుకోవాల్సిన నైపుణ్యం.


చూశారుగా.. ఇవేకాకుండా ఇంకా చాలా విషయాలను మనం కొత్తగా మొదలుపెట్టొచ్చు. అది మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడితే చాలు. మరి మీకు నచ్చిందేంటో చూసేయండి ఇక!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు