నేర్పుగా సన్నద్ధ్ధమైతే... నీట్‌లో మేటి స్కోరు!
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో వైద్య, దంత, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశార్హత నిర్ణయించే పరీక్ష.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్). ఈ ఏడాది మే 7న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. కీలకమైన ఈ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించటానికి కొన్ని మెలకువలు గ్రహించాలి. అవేమిటో తెలుసుకుందామా?!
వైద్యవిద్య (ఎంబీబీఎస్) సీట్లు 92 వేలకుపైగా, దంతవైద్య (బీడీఎస్) సీట్లు 28 వేలకుపైగా, ఆయుష్ సీట్లు 53 వేలకు పైగా నీట్ ర్యాంకుతోనే భర్తీ చేస్తారు. వీటితోపాటు 1899 ఎయిమ్స్ సీట్లు, 249 జిప్‌మర్ సీట్ల భర్తీకి కూడా నీట్ ర్యాంకే ఆధారం. 2023 సంవత్సరంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 96 వేలకు పైగా పెరగొచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఎక్కువ. 2023లో ఆంధ్రప్రదేశ్‌లో 32 మెడికల్ కాలేజీల్లో 5585 సీట్లు, తెలంగాణలో 42 వైద్య కళాశాలల్లో 6690 సీట్లు భర్తీ కానున్నాయి (కొత్తగా అనుమతించిన కాలేజీల్లో కూడా సీట్లు అందుబాటులో ఉంటే).
నీట్ 2023కి సుమారు 4 నెలల వ్యవధి ఉన్నట్లు అనిపించినా.. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఒకనెల రోజులు ఇంటర్ బోర్డు థియరీ, ప్రాక్టికల్స్ పరీక్షల కోసం వినియోగించుకోవాలి. కాబట్టి మిగిలిన 3 నెలల వ్యవధిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.
* ప్రతిరోజూ ప్రతి సబ్జెక్టుకూ తగినంత సమయాన్ని కేటాయిస్తూ 11, 12 తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అధ్యయనం చేయాలి.
* సబ్జెక్టుల్లోని సందేహాలను ఎప్పటికప్పుడు అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకుని పాఠ్యాంశాలపై పట్టు సాధించాలి.
* తేలికపాటి అధ్యాయాలను చాలాసార్లు చదవడం కంటే కష్టతరమైన అధ్యాయాలకు తగిన సమయాన్ని కేటాయించాలి.
* పాఠ్యాంశాలను చదువుతున్నప్పుడే సమాంతరంగా షార్ట్ స్టడీనోట్సులో కీలకాంశాలను, గ్రాఫ్‌లు, ఫార్ములాలను పొందుపరచుకుని పునశ్చరణకు ఉపయోగించుకోవాలి.
* నమూనా ప్రశ్నపత్రాలతోపాటు గత సంవత్సరాల ప్రశ్నపత్రాలనూ సాధన చేయాలి. వీలైనన్ని మాక్ టెస్ట్‌లు (కనీసం 20కి పైగా గ్రాండ్ టెస్ట్‌లు) సాధన చేయడం ఉపయోగకరం.
* మాక్ టెస్టుల్లో ప్రతి సబ్జెక్టుకూ సమయ విభజనను సరైన పద్ధతిలో పాటించాలి.
* మాక్ టెస్టులు సాధన చేసేటప్పుడు ఓఎంఆర్ షీట్‌లో ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్టుగా సమాధానాల్ని గుర్తించే అలవాటు చేసుకోవాలి. చాలామంది అన్ని ప్రశ్నలనూ చివర్లో గుర్తిస్తారు. ఇది సమస్యాత్మకం.
పరీక్ష విధానం
గత రెండు సంవత్సరాల నుంచీ నీట్ ప్రశ్నపత్రంలో స్వల్పంగా వచ్చిన మార్పులు గమనించదగినవి. అంతకుముందు 3 గంటల కాలవ్యవధితో 180 ప్రశ్నలను ఇచ్చారు. మార్చిన విధానంలో 200 ప్రశ్నలు ఇస్తున్నారు. గతంలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 90, 45, 45 ప్రశ్నలు ఇచ్చేవారు. కానీ దానికి బదులుగా 100, 50, 50 చొప్పున ఇస్తున్నారు. ప్రతి సబ్జెక్టులో సెక్షన్-ఎలో 35, సెక్షన్-బిలో 15 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-ఎలో ఉన్న ప్రశ్నలకు ఛాయిస్ లేదు. కానీ సెక్షన్-బిలో 10 ప్రశ్నలకు మాత్రమే జవాబులను గుర్తించాలి. కాబట్టి మొత్తం మీద నాలుగు సబ్జెక్టుల నుంచి 180 ప్రశ్నలకు జవాబులను గుర్తించాలి.
ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ (బహుళైచ్ఛిక) విధానంలో నాలుగు ఆప్షన్లతో ఉంటాయి. సరైన ఆప్షన్‌ను ఓఎంఆర్ పేజీలో బ్లూ లేదా బ్లాక్ ఇంక్ బాల్ పాయింట్ పెన్ సహాయంతో గుర్తించాలి. రఫ్‌వర్క్ చేయడానికి ప్రత్యేకంగా వేరే కాగితాలు ఇవ్వరు. ప్రశ్నపత్రంలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే రఫ్‌వర్క్ చేసుకోవాలి.
కొంతమంది విద్యార్థులు ఓఎంఆర్ షీటులో రెండు లేదా అంతకుమించి ఆప్షన్లను గుర్తిస్తారు. అలా గుర్తిస్తే వాటిలో సరైన సమాధానం ఉన్నా మార్కులు రావు. కాబట్టి అలా చేయకూడదు.
ప్రతి ప్రశ్నకూ సరైన సమాధానాన్ని గుర్తిస్తే 4 మార్కుల చొప్పున 180 ప్రశ్నలన్నింటికీ సరైన జవాబులు గుర్తిస్తే.. గరిష్ఠంగా సాధించగలిగే మార్కులు 720. ఏదైనా ప్రశ్నకు తప్పుగా సమాధానాన్ని గుర్తిస్తే ఒక మార్కును తగ్గిస్తారు. అంటే తప్పుగా గుర్తించిన ప్రశ్న వల్ల విద్యార్థి 5 మార్కులను కోల్పోవలసి ఉంటుంది.
గతంలో 3 గంటల కాల వ్యవధిలో 180 ప్రశ్నలకు సమాధానాల్ని గుర్తిస్తే ప్రస్తుత విధానంలో 200 నిమిషాల (3 గంటల 20 నిమిషాలు) వ్యవధిలో 200 ప్రశ్నలను చదివి వాటిలో 180 ప్రశ్నలను ఎంచుకోవాలి. ఈ ప్రక్రియలో కచ్చితత్వంతో వేగంగా జవాబులను సాధించడం అవసరం. వీటిలో ఏది లోపించినా నీట్ మార్కులపైనా, ర్యాంకుపైనా ప్రభావం ఉంటుంది.
ప్రశ్నలు తేలిగ్గా ఉండి, ఛాయిస్ కూడా ఉంది అనుకున్నా కొన్ని ఇబ్బందులన్నాయి. నెగెటివ్ మార్కులు, సెక్షన్-బిలో సరైన ప్రశ్నల ఎంపిక.. వీటిలో ముఖ్యమైనవి. ఏదైనా ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించలేక వదిలేస్తే 4 మార్కులను కోల్పోతే, అత్యుత్సాహంతోనో, పొరపాటునో తప్పు సమాధానాన్ని గుర్తిస్తే 5 మార్కులను కోల్పోవాల్సి ఉంటుంది.
సెక్షన్-ఎలో ప్రతి సబ్జెక్టులో ఉన్న 35 ప్రశ్నలను జాగ్రత్తగా చదివి సమాధానాన్ని రాబట్టడం ఎంత ముఖ్యమో, సెక్షన్-బిలో 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నల్ని ఎంచుకోవడమూ అంతే ముఖ్యం. సెక్షన్-బిలో ప్రశ్నలకు నెగెటివ్ మార్కులు పొందకుండా జాగ్రత్తపడాలి.
సెక్షన్-బిలో ప్రతి సబ్జెక్టులో ఉన్న 10 ప్రశ్నలకు 40 మార్కుల చొప్పున తప్పనిసరిగా తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. నాలుగు సబ్జెక్టుల్లో కలిపి 160 మార్కులు ఈ విభాగం ద్వారా పొందే వీలుంది. కాబట్టి నీట్ ర్యాంకు, మంచి కాలేజీల్లో ప్రవేశార్హతను నిర్ణయించేది ఈ మార్కులేనని గుర్తుంచుకోవాలి.
ఏ సబ్జెక్టు ఎలా?
జువాలజీ
బోటనీలో మాదిరిగానే ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని ప్రతి అధ్యాయమూ, ప్రతి లైనూ చదివి ముఖ్యమైన వాక్యాలు, పదాలను గుర్తుంచుకోవాలి.
* ప్రధాన పాఠ్యాంశంతోపాటు ఇంట్రడక్షన్ కూడా చదివితే మంచిది.
* ముఖ్యమైన బొమ్మలను వాటి విడి భాగాలతో సహా జ్ఞాపకం పెట్టుకోవాలి.
* దీనిలో కూడా ఎన్‌సీఈఆర్‌టీ పరిధి దాటిన ప్రశ్నల్ని అడిగే అవకాశం ఉంది.
ముఖ్యాంశాలు: బయోటెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్, హ్యూమన్ ఫిజియాలజీ (ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఇచ్చిన డిజార్డర్స్ ముఖ్యమైనవి), హ్యూమన్ రిప్రొడక్షన్. వీటితోపాటు విభిన్న మెకానిజమ్స్ బొమ్మలు, ఫ్లోచార్టులను బాగా సాధన చేయాలి.
* గత సంవత్సరం ప్రశ్నపత్రంలో జువాలజీ ప్రశ్నలన్నీ ఇంచుమించు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే ఇచ్చారు. కానీ ప్రతి ప్రశ్న నిడివి ఎక్కువగా, మల్టిపుల్ స్టేట్‌మెంట్ల రూపంలో ఇవ్వడం వల్ల ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. ప్రశ్నల్లో అన్ని స్టేట్‌మెంట్లూ చదివి అర్థం చేసుకుని మాత్రమే సరైన సమాధానాన్ని గుర్తించాల్సివచ్చింది.
బోటనీ
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని పాఠ్యాంశాల్లోని ప్రతి వాక్యమూ చదవాలి. ముఖ్యమైన పదాలు, వాక్యాలను అండర్‌లైన్ చేసుకుంటూ స్టడీ నోట్సు తయారుచేసుకోవాలి.
* ప్రతి అధ్యాయంలో ఉన్న ప్రధాన, ప్రాథమిక పాఠ్యాంశాలతోపాటు ఇంట్రడక్షన్/ ప్రివ్యూ కూడా చదవడం తప్పనిసరి. వాటి నుంచి కూడా ప్రశ్నల్ని అడిగే అవకాశం ఉంది.
* ఎన్‌సీఈఆర్‌టీ పరిధి, సిలబస్‌ను దాటి కూడా ఒకటి రెండు ప్రశ్నల్ని అడగొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పుస్తకాలే కాకుండా మీ దగ్గర ఉన్న స్టడీ మెటీరియల్‌ను కూడా చదవొచ్చు.
* ముఖ్యాంశాలు: ప్లాంట్ ఫిజియాలజీ, ఎకాలజీ, జెనెటిక్స్, సెల్‌స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్, డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్. వీటితోపాటుగా మిగిలిన అధ్యాయాలనూ పూర్తిగా చదవాలి.
* ప్రతి అధ్యాయంలో ఉన్న ముఖ్యమైన బొమ్మలను గుర్తుంచుకోవాలి. వాటిలో ముఖ్యాంశాలను ప్రశ్నపత్రంలో అడిగే అవకాశం ఉంది.
*గత సంవత్సరం కొన్ని బోటనీ ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉంది. అంతేకాకుండా స్టేట్‌మెంట్ తరహా ప్రశ్నలు సాధన చేయడానికి అధిక సమయాన్ని కేటాయించాలి.
ఫిజిక్స్
నీట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించాలంటే మిగిలిన సబ్జెక్టులతోపాటు ఫిజిక్స్‌లో కూడా మంచి మార్కులు పొందాలి.
* ప్రిపరేషన్ సందర్భంగా, తుది పరీక్షలోనూ మిగిలిన మూడు సబ్జెక్టుల కంటే కొంత సమయాన్ని అధికంగా కేటాయించడం తప్పనిసరి.
* ఈ సబ్జెక్టులో థియరీ ప్రశ్నల కంటే లెక్కలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. థియరీ ప్రశ్నలు కూడా తేలిగ్గానే ఉంటున్నాయి. కాబట్టి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల పరిధిని దాటి
చదవనక్కర్లేదు.
* నిర్దిష్టంగా ఏ చాప్టర్ ముఖ్యమైందో నిర్ణయించలేకపోయినా మోడరన్ ఫిజిక్స్, సెమీ కండక్ట్టర్స్, మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, మాగ్నటిజం, హీట్ లాంటి అధ్యాయాల నుంచి అధిక సంఖ్యలో ప్రశ్నలు రావొచ్చు.
* గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిక్స్, మాగ్నటిజంలో విభిన్న అంశాలు, అనువర్తనాలు, ఫార్ములాలు పోల్చదగినవి. కాబట్టి ఈ అధ్యాయాలను విడివిడిగా కాకుండా సారూప్య అంశాలను గమనిస్తూ అభ్యసిస్తే చాలా సమయం ఆదా అవుతుంది.
* ఎలక్ట్రిసిటీలో వలయ ఆధారిత లెక్కలు సాధన చేయాలి.
* ఎలక్ట్రిసిటీ, ఉష్ణప్రసారం, ఫ్లూయిడ్స్ లాంటి అధ్యాయాల్లో సారూప్యత ద్వారా గుర్తుపెట్టుకోవడం చాలా తేలిక.
* మెకానిక్స్ విభాగంలో కన్సర్వేషన్ ఆఫ్ లీనియర్ అండ్ యాంగులర్ మొమెంటమ్, ఎనర్జీ లాంటి అంశాలపై పూర్తి పట్టు సాధిస్తే మంచిది.
కెమిస్ట్రీ
బోటనీ, జువాలజీల తర్వాత ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కెమిస్ట్రీ బాగా ఉపయోగకరం. దీనికోసం బయాలజీ మాదిరిగానే ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను పూర్తిగా చదవాలి.
* కెమిస్ట్రీలో ఉన్న మూడు విభాగాల నుంచి ఇంచుమించు సమాన సంఖ్యలోనే ప్రశ్నల్ని ఇచ్చే అవకాశం ఉంది.
* ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 15-20 ప్రశ్నలు రావొచ్చు. ఈ విభాగంలో అధికంగా లెక్కలు అడిగే ఛాన్సు ఎక్కువ. ఈ విభాగంలో అన్ని అధ్యాయాలనూ తప్పనిసరిగా చదవడం మంచిది. దీంట్లో ప్రధాన అంశాలు: కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం, రెడాక్స్ రియాక్షన్స్, సొల్యూషన్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ.
* ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 12-18 ప్రశ్నల్ని అడగొచ్చు. ఈ విభాగంలో లెక్కలు, థియరీ ప్రశ్నలు రెండూ ప్రధానమే. ఈ విభాగంలో ముఖ్యమైనవి: కెమికల్ బాండింగ్, డీ బ్లాక్, కో ఆర్డినేషన్ కాంపౌండ్స్. ఈ విభాగంలో అన్ని గ్రూపుల్లో మూలకాల ముఖ్య ధర్మాలు, భేదాలు సాధన చేయాలి.
* ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 15-20 ప్రశ్నల అడగొచ్చు. ఈ విభాగంలో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఐసోమెరిజం అనువర్తనాలు ముఖ్యమైనవి. వీటితోపాటు హైడ్రోకార్బన్స్, ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, ఎమీన్స్ లాంటివి ప్రధానమైనవి.
* ప్రతి విభాగంలో ఉన్న ప్రతి అధ్యాయంలో ముఖ్యమైన ఫార్ములాలు, గ్రాఫ్‌లు, పట్టికలు విడిగా రాసి ఉంచుకుని పునశ్చరణ చేస్తూ ఉండాలి.
* ఈ సబ్జెక్టులో ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ ఇన్ ఎవ్విరిడే లైఫ్ లాంటి అధ్యాయాలు విద్యార్థులకు అంత ఆసక్తికరంగా అనిపించకపోవచ్చు. కానీ వీటి నుంచి గత కొన్ని సంవత్సరాలుగా ప్రశ్నలు వస్తున్నాయి.
* గత సంవత్సర ప్రశ్నపత్రంలో రెండు మూడు ప్రశ్నలు సందిగ్ధంగా ఉండి సమాధానాలను నిర్ణయించే ప్రక్రియలో విద్యార్థులు కొంత ఇబ్బంది పడ్డారు. చివరకు ఎన్‌సీఈఆర్‌టీలో ఇచ్చిన వివరణలను పరిగణిస్తూ ఎన్‌టీఏ సమాధానాలను ప్రకటించింది. కాబట్టి అనుమానాస్పదంగా ఉన్న కొన్ని సందర్భాల్లో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకుంటారన్నది గమనించాలి.
కొండముది రవీంద్రకుమార్
శ్రీ చైతన్య విద్యాసంస్థలు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Manish Sisodia: భార్యకు అనారోగ్యం.. కొడుకు విదేశాల్లో.. బెయిల్ ఇవ్వండి: సిసోదియా
-
General News
Telangana Jobs: గుడ్ న్యూస్.. జీహెచ్ఎంసీ పరిధిలో 1,540 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్!
-
Sports News
MIW vs RCBW: విజృంభించిన ముంబయి బౌలర్లు.. స్వల్ప స్కోరుకే పరిమితమైన ఆర్సీబీ
-
India News
Amritpal Singh: టోల్‌ప్లాజా వద్ద కారులో అమృత్‌పాల్ సింగ్..!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Virender Sehwag : అప్పుడు దాన్ని తప్పనిసరి చేసిఉంటే.. చాలా మంది దిగ్గజాలు ఫెయిలై ఉండేవాళ్లు : సెహ్వాగ్