నీట్‌ రాయకుండా... మెడికల్‌ కెరియర్‌!

వైద్యపరిశ్రమలో అడుగుపెట్టాలంటే.. నీట్‌ రాసి డాక్టర్లే కావాల్సిన పనిలేదు. ఇంకా చాలా అవకాశాలున్నాయి. చికిత్స చేసేది వైద్యులే అయినా.. వివిధ రకాలుగా రోగికి సాయపడేలా వారి చుట్టూ ఎంతోమంది నిపుణులు సేవలు అందిస్తుంటారు.

Updated : 01 Jun 2023 10:04 IST

వైద్యపరిశ్రమలో అడుగుపెట్టాలంటే.. నీట్‌ రాసి డాక్టర్లే కావాల్సిన పనిలేదు. ఇంకా చాలా అవకాశాలున్నాయి. చికిత్స చేసేది వైద్యులే అయినా.. వివిధ రకాలుగా రోగికి సాయపడేలా వారి చుట్టూ ఎంతోమంది నిపుణులు సేవలు అందిస్తుంటారు. ప్రస్తుతం వీరికి డిమాండ్‌ పెరుగుతోంది.  ఆసక్తి ఉన్నవారు కోర్సులు పూర్తిచేసుకుని ఉద్యోగంలో రాణించవచ్చు.

నదేశంలో ఏటా దాదాపు 18 నుంచి 20 లక్షల మంది విద్యార్థులు నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) రాస్తుంటారు. కానీ ఇందులో ఏడు నుంచి ఎనిమిది శాతం మంది మాత్రమే తాము అనుకున్న విధంగా సీట్‌ తెచ్చుకుని కాలేజీలో చేరగలుగుతారు. మరి మిగతా వారి సంగతేంటి? అందుకే కేవలం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అని మాత్రమే కాకుండా... చాలా రకాలైన మెడికల్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. నీట్‌ రాయకుండానే వీటిల్లో చేరవచ్చు, గౌరవప్రదమైన ఉద్యోగం, లాభదాయకమైన జీతభత్యాలు పొందవచ్చు.

బీఎస్సీ నర్సింగ్‌

డాక్టర్ల తర్వాత అంతగా గుర్తింపు పొందిన కొలువులివి. రోగులను నిత్యం కనిపెట్టుకుంటూ ఉండే నర్సుల సేవలు ఎనలేనివి. వైద్యులకు అన్నివిధాలా సహాయసహకారాలు అందించేలా ఈ నాలుగేళ్ల యూజీ కోర్సులో విద్యార్థులకు తర్ఫీదు ఇస్తారు. ఐసీయూ, సీసీయూ, ఈఆర్‌, ఓటీ వంటి పలు విభాగాల్లో పనిచేసేలా విద్యార్థులు శిక్షణ పొందుతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (తిరుపతి), గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ కేజీహెచ్‌ క్యాంపస్‌ (విశాఖపట్నం), రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (శ్రీకాకుళం), వైఎస్‌ఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌, కేఎంసీ క్యాంపస్‌ (వరంగల్‌), ఏరియా హాస్పిటల్‌ కాలేజ్‌ (కరీంనగర్‌), రిమ్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ (ఆదిలాబాద్‌), నిమ్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ (హైదరాబాద్‌).. పలు కాలేజీలు ఈ కోర్సులు అందిస్తున్నాయి. స్టాఫ్‌ నర్సు, రిజిస్టర్డ్‌ నర్స్‌, నర్స్‌ ఎడ్యుకేటర్‌ వంటి పోస్టుల్లోకి వెళ్లొచ్చు.

బీఫార్మసీ

మందుల పరిశ్రమలో అడుగుపెట్టాలి అనుకునేవారికి ఈ నాలుగేళ్ల డిగ్రీ సరిగ్గా సరిపోతుంది. ఫార్మాస్యూటికల్‌ సైన్స్‌లో డ్రగ్‌ డెవలప్‌మెంట్‌, సేఫ్టీ, డిస్కవరీ, మెడికల్‌ కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్‌ ఫార్మసీ, ఫార్మకాలజీ, క్లినికల్‌ ప్రాక్టీస్‌ వంటివి ఇందులో అభ్యసిస్తారు. డిప్లొమా కూడా చేసే వీలుంది. ఇది చదివిన విద్యార్థులు కెమికల్‌ టెక్నీషియన్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌, ఫార్మసిస్ట్‌ వంటి ఉద్యోగాలు చేసే వీలుంటుంది. ఎయిమ్స్‌ (మంగళగిరి), ఆచార్య నాగార్జున (గుంటూరు), ఆదికవి నన్నయ (రాజమండ్రి), ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖ), కాకతీయ (వరంగల్‌), శాతవాహన (కరీంనగర్‌), పాలమూరు (మహబూబ్‌నగర్‌)తోపాటు వివిధ ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సును అందిస్తున్నాయి.

ఫిజియోథెరపీ

వివిధ కారణాలతో దెబ్బతిన్న శరీర భాగాల కదలికలను తిరిగి పునరుద్ధరించడంలో ఫిజియోథెరపీ ప్రముఖమైనది. రోగులు పూర్తిస్థాయిలో కోలుకుని మునుపటి జీవితాన్ని పొందడంలో ఇది గణనీయ పాత్ర పోషిస్తుంది. ఈ కోర్సు పూర్తిచేసినవారు హెల్త్‌ -  ఫిట్‌నెస్‌ క్లినిక్స్‌, స్పెషల్‌ స్కూల్స్‌, ఇండస్ట్రియల్‌ హెల్త్‌ సెక్టార్లలో ఫిజియోథెరపిస్ట్‌గా ఉద్యోగాలు ఆశించవచ్చు. ఏడాదికి సగటున రూ.3 నుంచి రూ.7 లక్షల వరకూ సంపాదించవచ్చు.

బీఎస్సీ బయోటెక్నాలజీ

ఇది మాలిక్యులర్‌, బయోకెమిస్ట్రీల గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేసే మూడేళ్ల డిగ్రీ. దీన్ని ఫుల్‌టైం, పార్ట్‌టైం, దూరవిద్య ద్వారా కూడా అభ్యసించవచ్చు.   రిసెర్చ్‌ ప్రాజెక్టుల్లో పనిచేయగలిగే జ్ఞానం, నైపుణ్యాలను ఇందులో నేర్చుకోవచ్చు. మానవ జీవితాన్ని ఉన్నతి దిశగా నడిపించే విధంగా బయాలజీ, టెక్నాలజీలను సహజ పద్ధతుల్లో కలగలపడం దీని ప్రధాన ఉద్దేశం. అగ్రికల్చర్‌, ఫార్మా, ఫుడ్‌, జీనోమిక్స్‌, కెమిస్ట్రీ వంటి విభిన్న రంగాల్లో వీరు అడుగు పెట్టవచ్చు. బయోకెమిస్ట్‌, ఎపిడిమియోలజిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ వంటి ఉద్యోగాలుంటాయి.

బీఎస్సీ/బీఏ సైకాలజీ

మానవ మెదడు, మనసును అధ్యయనం చేసే శాస్త్రమిది. ఈ కోర్సులో హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌, స్పోర్ట్స్‌, హెల్త్‌, క్లినికల్‌, ఫోరెన్సిక్‌, డిఫెన్స్‌, సోషల్‌ బిహేవియర్‌, కాగ్నిటివ్‌ ప్రాసెసస్‌ వంటి అనేక రకాలున్నాయి. పెరుగుతున్న ఒత్తిడి, మారుతున్న జీవనవిధానాలతో ఈ నిపుణుల సేవలు అధికంగా అవసరమవుతున్నాయి. యూనివర్సిటీలు, గవర్నమెంట్‌ ఏజెన్సీలు, హాస్పిటల్స్‌లో పనిచేసే అవకాశం ఉంటుంది. కెరియర్‌ కౌన్సెలర్‌, క్లినికల్‌ సైకాలజిస్ట్‌, న్యూరోసైకాలజిస్ట్‌, సైకోథెరపిస్ట్‌, కన్సల్టెంట్‌.. వంటి పలు ఉద్యోగాలుంటాయి.

బీఎస్సీ కార్డియోవాస్క్యులర్‌ టెక్నాలజీ

ఈ డిగ్రీలో విద్యార్థులు హ్యూమన్‌ అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, బ్లడ్‌ బ్యాంకింగ్‌, హెమటాలజీ వంటి అంశాలను అధ్యయనం చేస్తారు. గుండె వైద్యులకు సహాయకారులను తయారుచేసే ఈ రంగం నిజానికి మన దేశంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. గుండె - సంబంధిత అనారోగ్యాల నివారణలో డాక్టర్లకు సాయం చేసే టెక్నీషియన్లు వీరు. రోగులకు పరీక్షలు, అల్ట్రాసౌండ్స్‌ వంటివి నిర్వహించడంలో వీరి పాత్ర ముఖ్యమైనది. హాస్పటల్స్‌, ల్యాబ్స్‌లో అవకాశాలుంటాయి. నైపుణ్యం, అనుభవాన్ని బట్టి ఏడాదికి సగటున రూ.3 లక్షల నుంచి రూ.13 లక్షల వరకూ ఆర్జించవచ్చు.

బీఎన్‌వైఎస్‌

బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగిక్‌ సైన్సెస్‌.. ఇండియాతోపాటు విదేశాల్లోనూ అవకాశాలు లభిస్తున్న రంగం. ఐదున్నరేళ్ల ఈ డిగ్రీలో ఆక్యుపంక్చర్‌, న్యూట్రిషన్‌, హెర్బల్‌ మెడిసిన్‌ వంటి పలు విధానాలను ఉపయోగిస్తూ వ్యాధికారకాలను సహజ పద్ధతుల్లో దూరం చేసే ప్రక్రియల గురించి అధ్యయనం చేస్తారు. ఆహ్లాదకర జీవన విధానంపై అవగాహన, ఆసక్తి పెరుగుతున్న ఈ రోజుల్లో.. మెట్రో నగరాల్లో దీనికి మంచి డిమాండ్‌ ఉంది. వెల్‌నెస్‌ సెంటర్లు, స్పెషాలిటీ క్లినిక్స్‌, హాస్పిటల్స్‌లో కెరియర్‌  మొదలుపెట్టడంతోపాటు మరింత లోతైన అధ్యయనం, సాధన ద్వారా సొంతంగానూ రాణించవచ్చు.

బీఎస్సీ ఫుడ్‌ టెక్నాలజీ

ఈ డిగ్రీలో ఆహారపు ప్రాసెసింగ్‌, ప్రిజర్వేషన్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, స్టోరేజ్‌ వంటి అంశాలన్నీ నేర్చుకుంటారు.  కెమిస్ట్రీ, బయాలజీ, న్యూట్రిషన్‌, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ.. వంటి పలు సబ్జెక్టులు ఇందులో భాగం. ఈ నిపుణులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో చక్కటి అవకాశాలున్నాయి. ఇందులో బీటెక్‌ కూడా చేసే వీలుంది. నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - వరంగల్‌ (నిట్‌)తో పలు విద్యాసంస్థల్లో చదవొచ్చు. వీరికి రిసెర్చ్‌ ఫీల్డ్‌లో అధికంగా అవకాశాలుంటాయి. ఫుడ్‌ టెక్నాలజిస్ట్‌, క్వాలిటీ అనలిస్ట్‌, ప్యాకేజింగ్‌ మేనేజర్‌.. ఇలా పలు రకాలైన పోస్టుల్లోకి వెళ్లొచ్చు.

న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌

ఒక వ్యక్తి శారీరక పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నాక.. అతడు తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన అలవాట్లు సూచించేవారే ఈ నిపుణులు. వీరు సొంతంగా లేదా హాస్పటల్స్‌లో పనిచేయవచ్చు. ఇందులో స్పోర్ట్స్‌, పబ్లిక్‌ హెల్త్‌.. వంటి వివిధ స్పెషలైజేషన్లు ఉన్నాయి. బైపీసీ సబ్జెక్టులతో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు కచ్చితంగా ఎంచుకోదగిన కోర్సుల్లో ఇదీ ఒకటి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో చదివే అవకాశం ఉంది. డైటీషియన్‌, న్యూట్రిషనిస్ట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌.. పలు ఉద్యోగాలుంటాయి.

ఇంకా...

ఇవేకాక వైద్యరంగానికి అనుబంధంగా బయాలజీ, క్లినికల్‌ రిసెర్చ్‌, ఆడియాలజీ, స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ థెరపీ, క్లినికల్‌ సైకాలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఆప్టోమెట్రీ, మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, అనస్థీషియా టెక్నాలజీ, బ్లడ్‌ బ్యాంకింగ్‌, ఆర్థోపెడిక్‌, డయాలసిస్‌ టెక్నాలజీ, పర్‌ఫ్యూజన్‌, జెనిటిక్స్‌.. ఇలా పలు కోర్సులు చదివే వీలుంది. విద్యార్థులు తమ ఆసక్తి మేరకు నిర్ణయించుకోవచ్చు.

బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌

బయాలజీ, మెడిసిన్‌ సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ టెక్నిక్స్‌ను ఉపయోగించి మానవ ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు కృషి చేసే రంగమిది. ఐఐటీ హైదరాబాద్‌, ఐఐటీ కాన్పూర్‌, ఎన్‌ఐటీ రూర్కెలా, హిందుస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ వంటి పేరున్న సంస్థల్లో ఈ కోర్సు పూర్తిచేసినవారికి చక్కని అవకాశాలు అందుతున్నాయి. బయోమెడికల్‌ ఇంజినీర్లు ప్రధానంగా రిసెర్చ్‌ ల్యాబ్స్‌లో పనిచేస్తారు. డాక్టర్లు, సైంటిస్ట్‌లతో కలిసి మెడికల్‌ టెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్‌ సిస్టమ్స్‌ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలలు అన్నింటిలో ఈ కోర్సు లభిస్తుంది. అయితే ఇన్‌స్టిట్యూట్‌ నిబంధనలు అనుసరించి ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత అవసరం.


అర్హతలు

ఇంటర్‌ తగిన మార్కులతో ఉత్తీర్ణులు కావడంతోపాటు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ / మ్యాథమెటిక్స్‌ (పీసీబీ/పీసీఎం) సబ్జెక్టులు చదివి ఉండాలి.

ఈ కోర్సులకు ఎంచుకున్న ఇన్‌స్టిట్యూట్‌ను బట్టి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఫీజులుంటాయి. మూడు నుంచి ఐదున్నరేళ్ల కాలవ్యవధి ఉంటుంది.

యూనివర్సిటీల విధివిధానాలను అనుసరించి మెరిట్‌ లేదా ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని