సమాచార వ్యవస్థలకు సురక్షిత కవచం!

కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధిత స్పెషలైజేషన్లలో సైబర్‌ సెక్యూరిటీ ఓ ముఖ్యమైన బ్రాంచి. ఆధునిక ప్రపంచంలో దీనికి ఎనలేని ప్రాముఖ్యం లభిస్తోంది. అందుకే ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో విద్యార్థుల నుంచి దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ బ్రాంచిని ఎంచుకునేవారు నాలుగేళ్ల వ్యవధిలో  ఏ అంశాలు నేర్చుకుంటారు? ఉపాధి అవకాశాలు ఏమేం ఉంటాయి?  తెలుసుకుందాం!  

Updated : 19 Jul 2023 04:58 IST

సైబర్‌ సెక్యూరిటీ  

కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధిత స్పెషలైజేషన్లలో సైబర్‌ సెక్యూరిటీ ఓ ముఖ్యమైన బ్రాంచి. ఆధునిక ప్రపంచంలో దీనికి ఎనలేని ప్రాముఖ్యం లభిస్తోంది. అందుకే ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో విద్యార్థుల నుంచి దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ బ్రాంచిని ఎంచుకునేవారు నాలుగేళ్ల వ్యవధిలో  ఏ అంశాలు నేర్చుకుంటారు? ఉపాధి అవకాశాలు ఏమేం ఉంటాయి?  తెలుసుకుందాం!  

సైబర్‌ సెక్యూరిటీ అనేది డిజిటల్‌ దాడుల నుంచి సిస్టమ్‌లు, నెట్‌వర్క్‌లను రక్షించే పద్ధతి. ఈ సైబర్‌ దాడులు సాధారణంగా సున్నితమైన సమాచారాన్ని అనధికారికంగా యాక్సెస్‌ చేయడం, మార్చడం లేదా నాశనం చేయడం లక్ష్యంగా ఉంటాయి. ఈ పెను ప్రమాదాల నుంచి సమాచార వ్యవస్థలను పటిష్ఠ కవచంలా రక్షించడంలో సైబర్‌ భద్రతా నిపుణులు కీలక పాత్ర పోషిస్తారు. వీరు సైబర్‌ భద్రతకు ఏర్పడే అపాయాలు, ఎదురయ్యే బెదిరింపులు, దుర్బలత్వాల నుంచి బయటపడేసేందుకు నిరంతర అప్రమత్తతతో సురక్షిత దుర్గంలా పనిచేస్తారు. దీనికోసం వీరు భద్రతా ఈవెంట్‌ల పర్యవేక్షణ, దర్యాప్తు, విశ్లేషణ, దర్యాప్తులను నైపుణ్యంతో చేపడతారు.


ఏమేం నేర్చుకుంటారు?

మొదటి సంవత్సరం

పైతాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌, సైబర్‌ సెక్యూరిటీ ఫౌండేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్‌ కాన్సెప్టులను నేర్చుకుంటారు. ఈ మాడ్యూల్‌లో విద్యార్థులు లాజిక్‌, బూలియన్‌ ఆల్జీబ్రా, సెట్‌ థియరీ, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్‌, రిలేషన్స్‌, ఫంక్షన్‌లు, మాడ్యులర్‌ అరిథ్‌మెటిక్‌ వంటివి అభ్యసిస్తారు.  

రెండో సంవత్సరం

ఎథికల్‌ హ్యాకింగ్‌ కోర్సు ద్వారా హ్యాకింగ్‌ ప్రాథమికాంశాలను అధ్యాపకులు బోధిస్తారు. డేటాబేస్‌ సెక్యూరిటీ ద్వారా విద్యార్థులు వివిధ డేటాబేస్‌ భద్రతా నమూనాలను అధ్యయనం చేస్తారు.  

మూడో సంవత్సరం

డేటాను బ్లాక్‌లుగా రూపొందిస్తారు. ప్రతి బ్లాక్‌లో లావాదేవీలు/ వాటి బండిల్‌ ఉంటుంది. ప్రతి కొత్త బ్లాక్‌, దాని ముందున్న అన్ని బ్లాక్‌లనూ క్రిప్టోగ్రాఫిక్‌ చెయిన్‌లో కలుపుతుంది, ఆ విధంగా ట్యాంపర్‌ చేయడం దాదాపు అసాధ్యం. వీటిని కూలంకషంగా అభ్యసిస్తారు.  

నాలుగో సంవత్సరం  

రియల్‌ టైమ్‌ అప్లికేషన్స్‌, క్లౌడ్‌ సెక్యూరిటీ ద్వారా వ్యాపార బాహ్య, అంతర్గత భద్రతను పరిష్కరించడానికి రూపొందించిన విధానాలు నేర్చుకుంటారు. మాల్‌వేర్‌, వైరస్‌లు, ఇతర ఇన్‌ఫెక్షియస్‌ ప్రోగ్రామ్‌ల నుంచి రక్షణ, డేటా రక్షణ, సమాచార లీక్‌ల నివారణ, హ్యాకర్ల నుంచి రక్షణ సాధ్యమవుతాయి. తద్వారా వినియోగదారుల సమాచార వ్యవస్థలు దెబ్బతినకుండా రక్షణ ఏర్పడుతుంది.


ఈ నైపుణ్యాలు తప్పనిసరి  

1 హ్యాకింగ్‌పై అవగాహన: సైబర్‌-దాడుల నుంచి కాపాడుకోవడానికి నైతికంగా ఎలా హ్యాక్‌ చేయాలో తప్పక తెలుసుకోవాలి. సిస్టమ్‌పై జరిగిన దాడిని అర్థం చేసుకోవడంలో, సమర్థ పరిష్కారాన్ని కనుగొనడంలో ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం మొదటి దశ.

2 క్లౌడ్‌ సెక్యూరిటీ: భవిష్యత్తులో నష్టాన్ని నివారించడానికి సంస్థలు తమ డేటాను క్లౌడ్‌లో నిల్వ చేస్తున్నాయి. అయితే సైబర్‌-దాడుల నుంచి సురక్షితంగా ఉంచడం కూడా చాలా అవసరం. ఆ డేటాను రక్షించడానికి సంస్థలకు క్లౌడ్‌ భద్రత ద్వారా నిర్వహించే వృత్తిపరమైన భద్రత అవసరం.

3 కంప్యూటర్‌ ఫోరెన్సిక్‌ నైపుణ్యాలు: సమాచారాన్ని ప్రచారం చేయడానికి, కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌, సైబర్‌సెక్యూరిటీ సాధారణంగా చేతులు కలిపి పనిచేస్తాయి. మీరు కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌ ఫౌండేషన్‌లో నైపుణ్యం పెంచుకుంటే అది మీ సైబర్‌ సెక్యూరిటీ కెరియర్‌ విజయవంతంగా ముందుకు సాగడానికి తోడ్పడుతుంది. దాడుల నివారణకూ, పరిష్కారాలు కనుగొనడానికీ కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌- సైబర్‌ సెక్యూరిటీ నైపుణ్యాలు ‘డిజిటల్‌ మేధ’గా చెప్పవచ్చు. అందువల్ల ఈ రెండు నైపుణ్యాలూ ఒకదానికొకటి ప్రయోజనకరంగా ఉంటాయి.  

4 బ్లాక్‌చెయిన్‌ సెక్యూరిటీ: మొబైల్‌, ఐఓటీ పరికరాలు, సప్లై చెయిన్‌ ఇంటిగ్రేషన్‌, నెట్‌వర్క్‌ నియంత్రణ, గుర్తింపు పరిష్కారాలతో సహా వివిధ భద్రతా వ్యవస్థలు బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీపై నిర్మితమయ్యే అవకాశం ఉంది. దాడి చేసే వ్యక్తి బ్లాక్‌చెయిన్‌ను నాశనం చేయడానికో, పాడు చేయడానికో గ్లోబల్‌ నెట్‌వర్క్‌లోని ప్రతి కంప్యూటర్‌నూ నాశనం చేయాల్సి ఉంటుంది. అది ఆచరణలో సాధ్యం కాదు కాబట్టి ఇది అపూర్వమైన డేటా భద్రతను అందిస్తుంది. అటువంటి నెట్‌వర్క్‌ల్లోకి ప్రవేశించడం, చొచ్చుకుపోవటంలో ఉండే సంక్లిష్టత కారణంగా బ్లాక్‌చెయిన్‌ భద్రత హ్యాక్‌ అయ్యే ప్రమాదం తక్కువ.

5 ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ): ఈ కృత్రిమ మేధ భద్రతా నిపుణులూ, సాంకేతిక నిపుణులకు సహాయపడే అత్యంత అధునాతన భద్రతా కార్యక్రమాల్లో ఒకటి. అందుకే ఈ నైపుణ్యం అవసరం.

6 ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌: ఏ సైబర్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్‌కి అయినా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ను అర్థం చేసుకోవడం చాలా కీలకం. జావా, పీహెచ్‌పీ, సీ, సీ++ మొదలైన భాషల పరిజ్ఞానంతో వారు దాడుల అవకాశాలను సులభంగా గుర్తించవచ్చు. అంతే కాదు- తదనుగుణంగా దాడి చేసేవారినీ ఎదుర్కోవచ్చు.

సమస్యా పరిష్కార సామర్థ్యం: సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు సమస్యలు ఎప్పుడైనా చుట్టుముట్టవచ్చు. అందువల్ల ఎల్లప్పుడూ సమస్య-పరిష్కార విధానం పెంపొందించుకోవాలి. దీనివల్ల అత్యంత క్లిష్టమైన భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి అసాధారణ మార్గాలను కనుగొనటానికి అవకాశం ఉంటుంది.


ఉద్యోగ హోదాలు

సైబర్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌

పెనెట్రేషన్‌ టెస్టర్‌

సైబర్‌ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్‌

సెక్యూరిటీ/ సైబర్‌ సెక్యూరిటీ ఇంజినీర్‌

సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌

సెక్యూరిటీ ఆడిటర్‌

సెక్యూరిటీ డైరెక్టర్‌

సెక్యూరిటీ కన్సల్టెంట్‌

క్రిప్టోగ్రాఫర్‌

చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌

వల్నరబిలిటీ అసెసర్‌

ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌

సోర్స్‌ కోడ్‌ ఆడిటర్‌

సెక్యూరిటీ మేనేజర్‌

సగటు జీతం: రూ. 5.1 లక్షల నుంచి రూ. 25.8 లక్షల వార్షిక వేతనం

ప్రసిద్ధ నియామక సంస్థలు

సైబర్‌ సెక్యూరిటీలో నైపుణ్యాలు ఉన్నవారిని కింది సంస్థలు ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయి.

అమెజాన్‌

నోకియా

ఇన్ఫోసిస్‌

యాపిల్‌

బోయింగ్‌

క్యాపిటల్‌ వన్‌

సిస్కో

జనరల్‌ మోటార్స్‌

ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌

కాగ్నిజెంట్‌

ఇంటెల్‌

లాక్‌హీడ్‌ మార్టిన్‌

నార్త్‌రోప్‌ గ్రుమ్మన్‌

పేషెంట్‌ ఫస్ట్‌

పింకర్టన్‌  

సర్టిఫికేషన్‌ కోర్సులు

సర్టిఫైడ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్‌ (CISSP)

గ్లోబల్‌ ఇన్ఫర్మేషన్‌ అస్యూరెన్స్‌ సర్టిఫికేషన్ (GIAC)

సర్టిఫైడ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ ఆడిటర్‌ (CISA)

సర్టిఫైడ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (CISO)

సర్టిఫైడ్‌ ఇన్ఫర్మేషన్‌ ప్రైవసీ  ప్రొఫెషనల్‌ (CIPP)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు