‘పోటీ’ సన్నద్ధతలో పాటిస్తున్నారా?

కొంతమంది విద్యార్థులు చదువుకుంటూనే పోటీ పరీక్షలు రాస్తుంటారు. కొందరేమో ఖాళీగా ఉంటూ వీటి కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవుతుంటారు.

Updated : 16 Aug 2023 02:16 IST

కొంతమంది విద్యార్థులు చదువుకుంటూనే పోటీ పరీక్షలు రాస్తుంటారు. కొందరేమో ఖాళీగా ఉంటూ వీటి కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవుతుంటారు. ఉద్యోగం చేసుకుంటూనే మరికొందరు పోటీ పరీక్షలు రాస్తుంటారు. ఇలా వేర్వేరు మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగించినా..  కొందరే విజయాన్ని సాధిస్తారు. ఆశించిన ఫలితాన్ని   పొందలేనివారు నిరాశపడుతుంటారు.

అనుకున్నది సాధించలేనప్పుడు దిగులుపడటం ఎవరికైనా సహజమే. అయితే వీలైనంత త్వరగా దాన్నుంచి బయటపడటానికి కృషిచేయాలి. అందుకోసం ఇలా ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందామా...

  • అప్పటివరకూ చదివిన విధానాన్ని ఒకసారి నిజాయతీగా సమీక్షించుకోవాలి. నిజానికి మీరు చదివిన పద్ధతి మీద మీకు పూర్తి నమ్మకం ఉంటుంది. కానీ తగిన ఫలితాన్ని సాధించలేకపోయారంటే.. ఎక్కడో పొరపాటు జరిగే ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి అది ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. దానికోసం.. ఏ స్టడీ మెటీరియల్‌ను చదివారు, ఏయే వనరులను వినియోగించారు, సమయ నిర్వహణ ఎలా చేశారు.. అనే విషయాలను పరిశీలించుకోవాలి.
  • ఒకేసారి భారీ లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించలేకపోయామని బాధపడుతూ కూర్చోకూడదు. వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. సాధించాల్సిన దాన్ని చిన్న భాగాలుగా విభజించుకోవాలి. దాంట్లో నుంచి ప్రతిరోజూ కొంత భాగాన్ని పూర్తిచేస్తుండాలి. ఉదాహరణకు పాఠ్య పుస్తకంలోని చాప్టర్లన్నింటినీ ఒకేరోజు చదివేయాలనుకోకూడదు. ప్రతిరోజూ కొంత భాగాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటూ చదవాలి. కొన్ని రోజుల తర్వాత ఈ అంశాల మీద వివిధ రకాలుగా ప్రశ్నించినా వెంటనే జవాబు చెప్పేలా ఉండాలి. అంటే మొక్కుబడిగా కాకుండా.. ఇలా అర్థం చేసుకుంటూ చదివితేనే పరీక్షలో బాగా రాయగలుగుతారు.
  • కొంతమంది చదివిన అంశాన్ని ఎంత బాగా అర్థంచేసుకున్నా.. రాయడానికి ఇబ్బందిపడుతుంటారు. చదివినంత వేగంగా రాయలేకపోవడం, రాసేటప్పుడు ఒత్తిడికి గురై కొన్ని విషయాలను మర్చిపోవడం లాంటివి చేస్తుంటారు. అందుకే నిర్ణీత వ్యవధి లోపలే సమాధానాలను రాయడానికి ప్రయత్నించాలి. రాసేటప్పుడు విషయాన్ని క్రమపద్ధతితో చెప్పడంతోపాటు ముఖ్యాంశాలన్నీ వచ్చేలా చూడాలి. ఇలా రోజూ సాధన చేయడం వల్ల ఆలోచనలను సమర్థంగా వెల్లడించే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. దీంతో పరీక్షల్లోనూ వ్యవధిలోపలే అన్ని అంశాలనూ రాయగలుగుతారు.
  • కొంతమంది విద్యార్థులు పాఠ్యాంశాలను చక్కగా అర్థంచేసుకుని పరీక్షల్లో రాయగలుగుతారు. కానీ వర్తమానాంశాల విషయానికి వచ్చేసరికి మాత్రం బాగా వెనకబడి ఉంటారు. నిజానికి పోటీ పరీక్షల్లో ఈ అంశానికీ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సబ్జెక్టులోని పాఠ్యాంశాలతో సమకాలీన అంశాలను పోల్చుకుంటూ అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల అవగాహన పెరుగుతుంది.
  • వాస్తవంగా పరీక్ష రాసిన అనుభూతిని పొందుతూ.. బలాలు, బలహీనతల గురించి తెలుసుకోవడానికి టెస్ట్‌ సిరీస్‌లను రాస్తుండాలి. తరచూ వీటిని రాయడం వల్ల ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో విశ్లేషించుకుని.. పరిజ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నించొచ్చు. పరీక్ష రాయడంలో నైపుణ్యాన్నీ పెంచుకోవచ్చు. వాస్తవంగా పరీక్ష రాసేటప్పుడు ఒత్తిడికి గురికావడం, అందుబాటులో ఉన్న సమయం లోపల రాయలేకపోవడం జరుగుతుంటాయి. తరచూ టెస్ట్‌లు రాయడం వల్ల ఈ ఇబ్బందులను అధిగమించొచ్చు.
  • ఆటంకాలు, అపజయాలు తాత్కాలికంగా నిరాశకు గురిచేయొచ్చు. అంతమాత్రాన ప్రయత్నాలను అంతటితో విరమించాలని అనుకోకూడదు. లక్ష్యసాధనకు పట్టుదలతో మరింతగా కృషిచేయాలి. నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుని పోటీ పరీక్షల్లో రాణించడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ రెట్టింపు ఉత్సాహంతో కృషిచేయాలి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని