సబ్జెక్టు పరిజ్ఞానం సరిగా గుర్తుంటోందా?

జ్ఞాపకం ఉండటం అనేది.. చదువులో రాణించడానికి శక్తికేంద్రంలా పని చేస్తుందని చెప్పొచ్చు. సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవడం, ఆలోచనల మధ్య సమన్వయం, పరిజ్ఞానాన్ని అనువర్తనం చేయడం..

Updated : 25 Jan 2024 01:29 IST

జ్ఞాపకం ఉండటం అనేది.. చదువులో రాణించడానికి శక్తికేంద్రంలా పని చేస్తుందని చెప్పొచ్చు. సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవడం, ఆలోచనల మధ్య సమన్వయం, పరిజ్ఞానాన్ని అనువర్తనం చేయడం.. వీటన్నిటికీ దృఢమైన జ్ఞాపకశక్తి ఎంతో అవసరం. దీంట్లో చాలా రకాలున్నాయి. వీటిని తెలుసుకుని, సరైన వ్యూహాలను అనుసరిస్తే.. సవ్యంగా నేర్చుకోవచ్చు. లక్ష్యాలను సాధించవచ్చు!  

పాఠ్యాంశాలను నేర్చుకునే క్రమంలో ఎన్నో విషయాలను గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత శ్రద్ధపెట్టినా.. కొంతకాలం తర్వాత వాటిని మర్చిపోతుంటాం. పునశ్చరణ చేయడానికి ఒక్కోసారి తగినంత సమయం కూడా ఉండదు. ఒకసారి చదివితే చాలు.. ఎప్పటికీ గుర్తుండిపోతే ఎంత బాగుంటుందో అని చాలాసార్లు అనిపిస్తుంటుంది కూడా. అసలు ఎలాంటి పద్ధతుల్లో నేర్చుకుంటే మర్చిపోకుండా ఉంటామో చూద్దాం.
వర్కింగ్‌ మెమరీ: రోజువారీ లక్ష్య సాధనకు అవసరమైన తాత్కాలిక సమాచారాన్ని గుర్తుపెట్టుకోవడం. గణిత సమస్యలను పరిష్కరించడం, క్లిష్టమైన వాక్యాలను అర్థం చేసుకోవడం.. దీని కిందికే వస్తాయి. ఇది లేకపోతే అవగాహన లేదా గ్రహణ సామర్థ్యం కొరవడుతుంది.
లాంగ్‌టర్మ్‌ మెమరీ: భవిష్యత్తు అవసరాల కోసం జ్ఞానాన్నీ, నైపుణ్యాలనూ భద్రపరుచుకోవచ్చు. ఇది దృఢంగా ఉంటే.. చదివిన పాఠాలను విద్యార్థులు చక్కగా గుర్తుపెట్టుకుని పరీక్షలు బాగా రాయగలుగుతారు.  
ఎపిసోడిక్‌ మెమరీ: కొన్ని ప్రత్యేకమైన అనుభవాలనూ, వేడుకలనూ గుర్తుచేసుకోవడం. చారిత్రక సంఘటనలు, శాస్త్రీయ ప్రయోగాలు, సాహిత్య సంబంధిత విషయాలు మొదలైనవి.
సెమాంటిక్‌ మెమరీ: జనరల్‌ నాలెడ్జ్‌, భావనలు లేదా ఊహలను భద్రపరచడం. పదాలకు అర్థాలు తెలుసుకోవడం, గణిత సూత్రాలను అన్వయించడం, శాస్త్రీయ సిద్ధాంతాలను గ్రహించడం.. మొదలైనవి దీనిలోకి వస్తాయి.  
అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. చదువులో రాణించాలంటే జ్ఞాపకశక్తి ఒక్కటే సరిపోదు. ఏకాగ్రత, ప్రేరణ, అధ్యయన నైపుణ్యాలు, తార్కికంగా ఆలోచించడం.. మొదలైనవన్నీ అవసరం అవుతాయి. మరో సంగతి ఏమిటంటే- విషయాన్ని అర్థం చేసుకోకుండా.. గుర్తుపెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. పూర్తిగా అర్థం చేసుకుంటేనే ఎక్కువకాలంపాటు మర్చిపోకుండా ఉంటారు.


ఇవి గమనించండి

1 ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పజిల్స్‌ పూరించడం, ఏదైనా కొత్త భాష నేర్చుకోవడం లాంటివి చేయాలి. 


2 సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా ఏకధాటిగా చదివితే మంచిదని చాలామంది అభిప్రాయపడుతుంటారు. కానీ ఈ పద్ధతి సరికాదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎడతెగని అధ్యయనం బదులు మధ్యలో చిన్న విరామం తీసుకోవడం వల్ల పునరుత్తేజం పొంది సమర్థంగా నేర్చుకోగలుగుతారు.


3 యాంత్రికంగా గుర్తుపెట్టుకోవడానికే కాకుండా అర్థం చేసుకుంటూ చదవడాన్ని అలవాటు చేసుకోవాలి. ‘ఎందుకు’, ‘ఎలా’ అని ప్రశ్నించుకుంటూ చదవడంతో విషయావగాహన పెరుగుతుంది.


4 డయాగ్రమ్స్‌, వీడియోలను ఉపయోగిస్తూ నేర్చుకోవడం వల్ల ఆ విషయాన్ని త్వరగా మర్చిపోలేరు. చూడటంతో అనుసంధానమైన ఏ విషయమైనా ఎక్కువ కాలం గుర్తుంటుంది.


5 జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి తీసుకునే ఆహారమూ తోడ్పడుతుంది. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-బి (చేపలు, గింజపప్పులు, ఆకుకూరలు)లను ఆహారంలో భాగం చేసుకోవాలి.


6 పోషకాహారంతోపాటుగా తగినన్ని మంచినీళ్లు తాగడం మర్చిపోకూడదు. దీంతో మెదడు కణాలు చురుగ్గా పనిచేస్తాయి.  


7 రోజూ వ్యాయామం చేయడం, ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు నిద్రపోవడం వల్ల మెదడు చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది.


8 ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. దాంతో ఉత్సాహంగా చదవగలుగుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని