కరెంట్‌ అఫైర్స్‌

16వ ఆర్థిక సంఘం కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?

Updated : 11 Mar 2024 02:43 IST

మాదిరి ప్రశ్నలు

16వ ఆర్థిక సంఘం కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?

జ: రిత్విక్‌ రంజనం పాండే

డబ్ల్యూహెచ్‌ఓ 2024, జనవరి నాటికి ఏ ఆఫ్రికా దేశాలను మలేరియారహిత దేశాలుగా ప్రకటించింది?

జ: మారిషస్‌, అల్జీరియా, కేప్‌ వర్డె

2024, జనవరిలో కింగ్‌ ఫ్రెడరిక్‌ - శ్రీ  ఏ దేశ రాజుగా బాధ్యతలు చేపట్టారు?

జ: డెన్మార్క్‌

విలియం లైచింగ్‌-టే 2024, జనవరిలో ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?

జ: తైవాన్‌

2024, జనవరిలో గాబ్రియేల్‌ అట్టల్‌ ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారు?

జ: ఫ్రాన్స్‌

2024, జనవరిలో బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రిగా షేక్‌ హసీనా ఎన్నోసారి తిరిగి ఎన్నికయ్యారు?

జ: అయిదోసారి

2024, జనవరి 1 నుంచి బ్రిక్స్‌ ఛైర్మన్‌గా ఏ దేశం కొనసాగుతోంది?

జ: రష్యా

ఫెలిక్స్‌ షిసెకెడి ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు?

జ: కాంగో

ఇటీవల కేంద్రం 16వ ఆర్థిక సంఘానికి నలుగురు సభ్యులను నియమించింది? వీరిలో ముగ్గురు పూర్తి సమయపు సభ్యులు కాగా, ఒకరు పార్ట్‌టైమ్‌ సభ్యుడు. ఆ పార్ట్‌టైమ్‌ సభ్యుడు ఎవరు?

జ: డాక్టర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ 


కరెంట్‌ అఫైర్స్‌

మిస్‌వరల్డ్‌ కిరీటాన్ని చెక్‌ రిపబ్లిక్‌కి చెందిన క్రిస్టీనా జికోవా దక్కించుకున్నారు. ముంబయి కేంద్రంగా 2024, మార్చి 9న జరిగిన 71వ మిస్‌వరల్డ్‌-2024 గ్రాండ్‌ ఫినాలేలో మిస్‌ లెబనాన్‌ యాస్మినా జైతూన్‌ ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచారు. 1996 తర్వాత ఈ పోటీలు భారత్‌లో జరిగాయి. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్సు (బీకేసీ)లో ఉన్న జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో వీటిని నిర్వహించారు.


అస్సాంలోని తేజ్‌పుర్‌ను అరుణాచల్‌ప్రదేశ్‌లోని కమెంగ్‌ జిల్లాతో కలిపేలా నిర్మించిన ‘సేలా’ సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ 2024, మార్చి 9న వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. దీని నిర్మాణ వ్యయం రూ.825 కోట్లు. భారత్‌-చైనా సరిహద్దులో వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్‌కు ఎలాంటి వాతావరణంలోనైనా సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. సముద్ర మట్టానికి దాదాపు 13,000 అడుగుల ఎత్తున ఈ నిర్మాణం ఉంది. ఇది ప్రపంచంలోనే (ఆ ఎత్తులో) పొడవైన జంట మార్గాల సొరంగం.


పాకిస్థాన్‌ 14వ అధ్యక్షుడిగా పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) సహ ఛైర్మన్‌ ఆసిఫ్‌ అలీ జర్దారీ (68) ఎన్నికయ్యారు. 2024, మార్చి 9న అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో జర్దారీ, విపక్ష సున్నీ ఇత్తెహాద్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఐసీ) సమర్థించిన మహమ్మద్‌ ఖాన్‌ అచక్‌జాయ్‌పై విజయం సాధించారు. జర్దారీ అధ్యక్ష పదవికి ఎన్నికవ్వడం ఇది రెండోసారి.


జాతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా కిశోర్‌ మక్వానా నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం గుజరాత్‌లో భాజపా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన వడ్డేపల్లి రాంచందర్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌కి చెందిన లవ్‌ కుష్‌ కుమార్‌లను సభ్యులుగా నియమిస్తూ సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖ 2024, మార్చి 9న ఉత్తర్వులు జారీచేసింది.


భారత్‌కు ప్రతిష్ఠాత్మక మీజిల్స్‌, రుబెల్లా ఛాంపియన్‌ అవార్డు లభించింది. తట్టు (మీజిల్స్‌), రుబెల్లా లాంటి అంటువ్యాధులను రూపుమాపడంలో భారత్‌ చేసిన కృషికిగాను ఈ అవార్డు లభించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ 2024, మార్చి 8న తెలిపింది. అమెరికా వాషింగ్టన్‌లోని రెడ్‌క్రాస్‌ సంస్థ ప్రధాన కార్యాలయంలో భారత రాయబారి సుప్రియా రంగనాథన్‌ మార్చి 6న ఈ అవార్డును అందుకున్నారు. ఈ అంటువ్యాధుల మరణాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్‌ఓ), అమెరికన్‌ రెడ్‌ క్రాస్‌ సంస్థలతో పాటు వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ అవార్డును అందిస్తున్నాయి.


కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు