లాభనష్టాల్లో ఉమ్మడి వాటాలు!

ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది కలిసి ఒక సంయుక్త లక్ష్యంతో పెట్టుబడి వనరులను సమీకరించుకుని, సమష్టిగా కృషి చేసి, వ్యాపారం లేదా ఇతర కార్యకలాపాలు నిర్వహించి, వచ్చే లాభాలను లేదా నష్టాలను తగిన నిష్పత్తిలో పంచుకోవడమే భాగస్వామ్యం.

Published : 20 Mar 2024 00:36 IST

జనరల్‌ స్టడీస్‌ అరిథ్‌మెటిక్‌

ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది కలిసి ఒక సంయుక్త లక్ష్యంతో పెట్టుబడి వనరులను సమీకరించుకుని, సమష్టిగా కృషి చేసి, వ్యాపారం లేదా ఇతర కార్యకలాపాలు నిర్వహించి, వచ్చే లాభాలను లేదా నష్టాలను తగిన నిష్పత్తిలో పంచుకోవడమే భాగస్వామ్యం. నిత్యజీవితంలో అనేక సందర్భాల్లో ఈ విధమైన వ్యవహారాలు ఎదురవుతుంటాయి. వాటిని సమర్థంగా పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో భాగస్వామ్యంపై ప్రశ్నలను అంకగణితంలో అడుగుతుంటారు. శాతాలు, నిష్పత్తులు తదితర ప్రాథమిక గణిత పరిక్రియలపై పట్టు పెంచుకుంటే వాటికి సులువుగా సమాధానాలు రాబట్టవచ్చు.

భాగస్వామ్యం

ఒక వ్యాపారాన్ని ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి నడపడం అనే ప్రక్రియలో, వారు పెట్టిన పెట్టుబడి ధనాన్ని ‘మూలధనం’ లేదా ‘పెట్టుబడి మొత్తం’ అంటారు.
పెట్టుబడి పెట్టే వ్యక్తులను ‘భాగస్వాములు’ లేదా ‘పెట్టుబడిదారులు’గా వ్యవహరిస్తారు. ఇలాంటి వ్యాపారాన్ని ‘భాగస్వామ్యం’ లేదా ‘ఉమ్మడి వ్యాపారం’ అంటారు. లాభాలను భాగస్వాములు వారి పెట్టుబడి, భాగస్వామ్య కాలాల లబ్ధ నిష్పత్తిలో పంచుకుంటారు.

ఉదాహరణకు A, B ల పెట్టుబడుల నిష్పత్తి a : b, ఆ వ్యాపారాల కాలాల నిష్పత్తి p : q అయితే లాభం పంచుకున్న నిష్పత్తి ap : bq.

భాగస్వాములు 2 రకాలు

1) భాగస్వాములందరూ వ్యాపారాన్ని చూసుకుంటారు. వీరిని యాక్టివ్‌ పార్ట్‌నర్స్‌ అంటారు.
2) భాగస్వాముల్లో ఒకరు మాత్రమే వ్యాపారాన్ని చూసుకుంటారు. మరోవ్యక్తి వ్యాపారాన్ని చూసుకోరు. ఇతడిని ‘పనిచేయని భాగస్వామి’ (స్లీపింగ్‌ పార్ట్‌నర్‌) అని అంటారు. పనిచేసే భాగస్వామి తన జీతాన్ని లాభం నుంచి వేరు చేసిన తర్వాత మిగిలిన భాగాన్ని/లాభాన్ని భాగస్వామ్య నిష్పత్తిలో పంచుకుంటారు.

భాగస్వామ్యం 2 రకాలు

1) సామాన్య భాగస్వామ్యం (సింపుల్‌ పార్ట్‌నర్‌షిప్‌)
2) సంయుక్త భాగస్వామ్యం (కాంపౌండ్‌ పార్ట్‌నర్‌షిప్‌)

సామాన్య భాగస్వామ్యం: భాగస్వాములు ఒకేసారి కలిసి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. మధ్యలో ఎవరు కూడా    భాగస్వామ్యాన్ని విరమించుకోవడం లేదా తొలగిపోవడం, ఒక పనిచేయని భాగస్వామిగా ఉండటం జరగదు.

సంయుక్త భాగస్వామ్యం: భాగస్వాములు వేర్వేరు కాలాలకు వ్యాపారంలో ఉంటారు. లాభాలను వారి పెట్టుబడి, కాలాల లబ్ధ నిష్పత్తిలో పంచుకుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని