పాఠ్య పుస్తకాల్లో ‘పైరసీ’లు.. NCERT వార్నింగ్‌

NCERT: పాఠ్య పుస్తకాల్లో కొందరు పైరసీలకు పాల్పడుతున్నారని, అలాంటి వాటిల్లో వాస్తవాలను తప్పుగా చూపించే అవకాశముందని NCERT హెచ్చరించింది.

Updated : 08 Apr 2024 14:23 IST

దిల్లీ: మరికొద్ది నెలల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న వేళ.. పాఠ్య పుస్తకాల (Textbooks)పై నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) కీలక ప్రకటన చేసింది. మార్కెట్లోకి నకిలీ పుస్తకాలు వస్తున్నాయని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. తమ ఎడ్యుకేషనల్‌ మెటీరియల్‌ను ఉపయోగించి కొంతమంది కాపీరైట్‌ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని తెలిపింది.

‘‘ఎన్‌సీఈఆర్టీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే.. మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న పుస్తకాలను కొంతమంది పబ్లిషర్లు వారి పేర్లతో ముద్రించుకుంటున్నారు. ఇలా కాపీరైట్‌ అనుమతులు తీసుకోకుండా మా బుక్స్‌ను ప్రచురిస్తే, లేదా మా కంటెంట్‌ను వాడుకుంటే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ఎన్‌సీఈఆర్టీ హెచ్చరించింది. ఈ నకిలీ పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది. అందులో వాస్తవాలను తప్పుగా ముద్రించే ప్రమాదం ఉందని పేర్కొంది. అలాంటి పైరసీ పుస్తకాలు కన్పిస్తే వెంటనే కౌన్సిల్‌కు రిపోర్ట్‌ చేయాలని కోరింది.

కొత్త విద్యా సంవత్సరంలో సిలబస్‌ మార్పు, పాఠ్యపుస్తకాల విడుదలపై ఇటీవల ఎన్‌సీఈఆర్టీ అప్‌డేట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. 3, 6వ తరగతులకు మాత్రమే కొత్త సిలబస్‌తో పాఠ్య పుస్తకాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. మూడో తరగతి బుక్స్‌ ఏప్రిల్‌ చివరివారంలో, ఆరో తరగతి పుస్తకాలను మే మధ్యకాలం నాటికి అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. ఇక, 1, 2, 7, 8, 10, 12 తరగతులకు సంబంధించి 2023-24 ఎడిషన్స్‌ పాఠ్య పుస్తకాలు 1.21 కోట్ల కాపీలు దేశవ్యాప్తంగా విడుదల చేసినట్లు వెల్లడించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు